చేపల వేటకు వెళ్లిన (14) ఏండ్ల బాలుడు పాము కాటుకు గురైన ఘటన ఆళ్ళపల్లి మండలంలో మంగళవారం చోటు చేసుకుంది. గ్రామస్తుల వివరాల ప్రకారం.. బోడయికుంట గ్రామానికి చెందిన పాయం సుశాంత్ మర్కోడు గ్రామం బాలుర ఆశ్రమ ఉన్నత పాఠశాలలో 9వ తరగతి చదువుతున్నాడు. సేలవుల నేపథ్యంలో సొంతూరు బోడాయికుంట గ్రామంలో ఇంటికి వచ్చాడు. మంగళవారం తోటి మిత్రులతో సరదాగా చేపల వేటకు గ్రామ సమీపంలోని వాగుకి వెళ్లాడు. ఈ క్రమంలో చెట్లపొదల్లో ఉన్న విష సర్పం కాటేసిందన్నారు. తోటి మిత్రుల సమాచారంతో కుటుంబ సభ్యులు సుశాంత్ ను ఆళ్ళపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకొచ్చారు. ఆసుపత్రిలో వైద్య సిబ్బంది పాము కాటుకు చికిత్స అందించి, మెరుగైన వైద్యం కోసం కొత్తగూడెం ఏరియా ఆసుపత్రికి తరలించారు. అక్కడి ఆసుపత్రిలో సుశాంత్ ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యులు చెప్పినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.