– ఆవేశంలో కుక్కను చంపిన కుటుంబీకులు
– తాండూర్ మండలంలో ఘటన
నవతెలంగాణ-తాండూరు రూరల్
కుక్క దాడిలో నాలుగు నెలల చిన్నారి ప్రాణాలు కోల్పోయిన ఘటన వికారాబాద్ జిల్లా తాండూర్ మండలం కరణ్‌కోట్ పోలీస్టేషన్ పరిధిలో మంగళవారం జరిగింది. ఎస్‌ఐ విట్టల్‌రెడ్డి, బాధిత కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. మహబూబ్‌నగర్ జిల్లా చిన్న చింతకుంట మండలం దుప్పల్లి గ్రామానికి చెందిన నీలం దత్తు, లావణ్య దంపతులు 15 రోజుల క్రితం తాండూర్‌కు వలస వచ్చారు. తాండూరు మండలం సంగంకాలన్ గ్రామానికి చెందిన బసవేశ్వర్‌నగర్ మారుతి పాలిష్ యూనిట్ మిషన్‌లో పని చేస్తున్నారు. వీరికి కుమారుడు సాయినాథ్(4నెలలు) ఉన్నాడు. రోజూలాగే మంగళవారం ఉదయం దత్తు పాలిష్ యూనిట్ మిషన్‌లో నాపరాతి రాళ్లు కటింగ్ చేసేందుకు వెళ్లారు. బాలుడిని పడుకోబెట్టి లావణ్య తన భర్త వద్దకు వెళ్లింది. ఈ క్రమంలో వీధి కుక్క యూనిట్ మిషన్ ప్రాంతంలోని రూమ్‌లోకి వెళ్లి నిద్రిస్తున్న బాలుడిపై అతిక్రూరంగా దాడి చేసింది. బాలుడి కన్ను, మెడకాయ, ముఖంపై కొరకడంతో బాలుడు కేకలు వేశాడు. వెంటనే తల్లిదండ్రులు ఘటనా స్థలానికి వెళ్లి చూడగా బాలుడు సాయినాథ్ అప్పటికే మృతిచెంది ఉన్నాడు. ఆవేశంతో కోపోద్రిక్తులైన తల్లిదండ్రులు.. కుక్కను కొట్టి చంపారు. అనంతరం బాధిత కుటుంబ సభ్యులు పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్‌ఐ విట్టల్‌రెడ్డి తెలిపారు.