నాని మూవీ వర్క్స్, రామా క్రియేషన్స్ ఆధ్వర్యంలో విశ్వ కార్తికేయ, ఆయూషి పటేల్ హీరో, హీరోయిన్లుగా నటిస్తున్న ‘కలియుగం పట్టణంలో’. కందుల గ్రూప్ విద్యా సంస్థల మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ కందుల చంద్ర ఓబుల్ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ మూవీకి కథ, డైలాగ్స్, స్క్రీన్ ప్లే, దర్శకత్వం ఇలా అన్ని బాధ్యతలను రమాకాంత్ రెడ్డి నిర్వర్తిస్తున్నారు. రమాకాంత్ రెడ్డిని దర్శకుడిగా పరిచయం చేస్తూ డాక్టర్ కందుల చంద్ర ఓబుల్ రెడ్డి, జి.మహేశ్వరరెడ్డి, కాటం రమేష్ ఈ మూవీని తెరకెక్కిస్తున్నారు. ఈనెల 22న రాబోతోన్న ఈ మూవీలో చిత్రా శుక్లా ప్రధాన పాత్రను పోషిస్తున్నారు. తాజాగా ఈ మూవీ టీజర్ లాంచ్ ఈవెంట్‌ను గురువారం నిర్వహించారు. రాజేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ, ”ఆ నలుగురు’ సినిమాలో నాతో నటించిన విశ్వ కార్తికేయ ఇప్పుడు హీరోగా నటించాడు. కొత్త పాయింట్‌తో ఈ చిత్రం రాబోతోందని అర్థం అవుతోంది. కలియుగం పట్టణంలో అనే టైటిలే కొత్తగా ఉంది. ఈ సినిమాను పెద్ద సక్సెస్ చేయాలని కోరుకుంటున్నాను’ అని అన్నారు. ‘నేను సినిమా పరిశ్రమకు కొత్త. మా మామ నీలకంఠంని సినిమాల గురించి ఎప్పుడూ అడుగుతుండేవాడిని. నాకు మూడు ఇంజనీరింగ్ కాలేజీలున్నాయి. అక్కడ విద్యార్థులకు చాలా టాలెంట్ ఉంది. ఆ టాలెంట్‌ను బయటకు తీసుకు రావాలని, నా విద్యార్థులకు అవకాశం ఇవ్వాలని నాని మూవీ వర్క్స్ అనే బ్యానర్‌ను పెట్టాను. రమాకాంత్ నా టీంకు కథను చెప్పారు. మూడు, నాలుగు నెలల్లోనే సినిమా స్టార్ట్ చేశారు. రెండున్నర గంటలు అద్భుతంగా కథ చెప్పాడు. ప్రతీ సీన్ నా మైండ్‌లోకి ఎక్కించేశాడు. అజరు మ్యూజిక్, చంద్రబోస్, భాస్కర భట్ల పాటలు అద్భుతంగా వచ్చాయి. టీజర్, ట్రైలర్‌లను చూసి మా సినిమా కథను అంచనా వేయలేరు. ఈ స్టోరీ అంత కొత్తగా ఉంటుంది. ఈనెల 22న మా చిత్రం రాబోతోంది. అందరూ మా సినిమాను చూసి ఆదరించండి’ అని నిర్మాత డా.కందుల చంద్ర ఓబుల్ రెడ్డి చెప్పారు.