ఘాటు సరసమున్న ధీటైన పాట

A brave song with a strong touchఘాటు సరసమున్న పాటలు వ్యంగ్యమైన మాటలతో చురుకులు పెట్టే పాటలు మన తెలుగు సినిమాల్లో చాలానే ఉన్నాయి. అలాంటి వాటిల్లో ఈ పాట ఒకటి. 1955 లో కె.వి.రెడ్డి దర్శకత్వంలో వచ్చిన ‘దొంగరాముడు’ సినిమాలో సముద్రాల సీనియర్‌ (సముద్రాల రాఘవాచార్య) రాసిన ఆ పాటనిపుడు పరిశీలిద్దాం.
సముద్రాల సీనియర్‌ పేరు వినగానే సంప్రదాయ భక్తిగీతాలు, పౌరాణిక గాథలూ, అద్భుత కథాగీతాలు, సున్నితమైన వలపు గీతాలు మన హదయాల్లో మోగుతుంటాయి.. తెలుగు సినీగీత రచనలోనూ, అద్భుతమైన సంభాషణల్లోనూ ఓ కొత్త ఒరవడిని సష్టించిన కవి ఆయన.. ఆయన ఎలాంటి పాటనైనా అవలీలగా రాయగలడనడానికి ఈ పాటే మచ్చుతునక..
ఈ పాటలో ఓ కొంటెదనం, చమ త్కారం, కొంత ఘాటు సరసం కనబడు తుంది. సినిమా సన్నివేశ పరంగా చూస్తే మోసం చేస్తున్న వాళ్ళ మావ గుట్టును కనిపెట్ట డానికి కథానాయిక వేసిన ఓ ఎత్తులోని భాగమే ఈ పాట.. ఆయన్ని ఇంటికి ఆహ్వానించి ఎంతో సరసంగా మాట్లాడి, పాట పాడి మచ్చిక చేసుకుం టుంది. మాటల్లో సరసం చూపిస్తూనే వ్యంగ్యాన్ని, చురుకు చురుకు పదాలని ప్రయోగిస్తుంది.. ఈ పాటలో సముద్రాల రాఘవాచార్య వాడిన పదాలు చాలా చాలా బాగుంటారు.. వాటిని చూద్దాం..
మా ఇంటికి రా.. మామా.. నీకు ఒక మాట చెప్పాలి.. అంటూ హీరోయిన్‌ తన మావని పిలుస్తుంటుంది. పల్లవిలో.. మాటున్నది, మంచి మాటున్నది అంటుంది.. ఇందులో మాటున్నది అనే పదంలో రెండర్థాలున్నాయి. మొదటి మాటున్నది అనే పదంలో మాట చెప్పాల్సి ఉంది అనే అర్థం వస్తే, రెండవ మాటున్నది అనే పదంలో ‘మాటు’.. రహస్యమైన విషయం మాట్లాడడానికి, పని చేయడానికి అవకాశముం దని అర్థముంది.. చాటుమాటున అంటుంటాం కదా! అంటే.. కొంటె సరసానికి అవకాశముందని అతనికి ఆశ చూపించి అతని మోసానికి సంబంధించిన గుట్టును బట్టబయలు చేయవచ్చని ఆమె వేసిన పథకమిది..
నువ్వు నిలబడి ఉంటే నీకు నిమ్మచెట్టు నీడ ఉంది. లేదా నువ్వు కూర్చోవాలనుకుంటే కురిసిలో మంచి పీట ఉన్నది.. నీకు కావాల్సినవన్నీ మా ఇంటిలో ఉన్నాయి.. రా.. మావా.. నీ మర్యాదలకేమీ లోటుండదు.. రారమ్మని పిలుస్తుంటుంది. నువ్వు పడుకోవాలనుకుంటే పట్టెమంచం ఉంది.. దానిపై మెత్తని పరుపూ ఉంది. నీ నిద్రకు భంగం కలుగకుండా ప్రశాంతతను కలిగించేవన్నీ ఉన్నాయి.. ఏ మాత్రం ఆలోచించకుండా, మొహమాటపడకుండా రమ్మని పిలుస్తుంటుంది. అతని మావ మాత్రం బాగా తాగి మత్తుగా తూలుతూ ఉంటాడు. ఆమె చెప్పే మాటలు, వ్యంగ్యోక్తులు అతని బుర్రకు అంతగా ఎక్కవు. ఆ మాటల్లో ఉన్న పై పై సరసపు వాక్యాలనే అతడు గ్రహిస్తాడు. కాని ఆమె మాటల్లోని లోతేంటో అతడు అర్థం చేసుకోలేకపోతాడు.
అతడు ఇంటిలోకి రాగానే కురిసీ పీట, నీడ, మంచం వంటి సౌకర్యాలన్నీ చూపించి అతడు విశ్రాంతి తీసుకోవడానికి కావల్సినవన్నీ ఉన్నాయని చెబుతుంది. ఆ తరువాత.. అతడు భోజనం చేయాల్సివస్తే కావల్సిన ఆహార పదార్థాలేవేవి ఉన్నాయో చెబు తుంటుంది. నీకు ఆకలైతే సన్నబియ్యం కూడుంది. అందులో వేసుకోవడానికి సగం కోడి కూర ఉంది. దానిపై పోసుకుని తినడానికి రొయ్య పొట్టు చారు కూడా ఉంది. చిక్కటి మీగడ పెరుగు ఉంది. అందులో నంజుకోవ డానికి ఆవకాయ కూడా ఉంది. ఇలా.. సన్న బియ్యం, కోడికూర, రొయ్యపొట్టు చారు, మీగడ పెరుగు, ఆవకాయ ముక్క వంటి వాటితో నువు తప్తిగా తినొచ్చు అని మావకు చెబుతుంది.
తిండికి, నిద్రకు లోటు లేకుండా అన్నీ సౌకర్యాలుండడమే కాదు. నీకు రోగమొస్తే, ఆ రోగాన్ని తగ్గించడానికి ఘాటైన మందు కూడా ఉంది. అంతే కాదు.. చివరికి నిన్ను సాగనంపడానికి వల్లకాటి దిబ్బ కూడా ఉంది అంటూ గట్టి గట్టి మాటలతో కొట్టి పెడుతుంది.. చివర్లో మాటలతో వ్యంగ్యాస్త్రాలు సంధించడం ఎంతో ప్రశంసనీయం..
ఈ పాటలో సముద్రాల రాఘవాచార్య వాడిన పదాలు భలే బాగున్నాయి. ఆయన పరమ వైష్ణవుడు. సద్బ్రాహ్మణుడు. అయినా పాటలో అరకోడి కూర, రొయ్య పొట్టు చారు వంటి పదాలు వాడడం ఆశ్చర్యంగా అనిపిస్తుంటుంది. కాని సినిమా కవి ఎలాగైనా, ఏదైనా రాయడానికి సిద్ధంగా ఉన్నప్పుడే సినీరంగంలో నిలబడగలడు. సీనియర్‌ సముద్రాల సినీరంగాన్ని ఒక ఊపు ఊపేసిన కవి. అందుకు కారణం సినిమా నాడిని ఆయన పసిగట్టడమే. ‘నిలుసుంటే’, ‘కూసుంటే’, ‘తొంగుంటే’.. వంటి జానపద సొబగులద్దుకున్న పదాలు పాటకు వన్నె తెచ్చాయని చెప్పవచ్చు.
సముద్రాల రాఘవాచార్య సంప్రదాయ గీతాలే కాదు మాస్‌ మాస్‌ పదాలతో కూడా పాట రాయగలడని చెప్పడానికి ఈ పాటే ఒక నిదర్శనం. ఈ పాటను ‘రారోయి మా కంట్రికి’ అంటూ స్వల్ప మార్పులతో పవన్‌ కల్యాణ్‌ నటించిన ‘జానీ'(2003) సినిమాలో వాడుకున్నారు. ఇంకా ఈ పాటకు వచ్చిన ప్రజాదరణ ఎలాంటిదో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.
పాట
రారోయి మా ఇంటికి మావో మాటున్నదీ/ మంచి మాటున్నదీ/ నువ్వు నిలుసుంటే నిమ్మసెట్టు నీడున్నదీ/ నువ్వు కూసుంటే కురిసీలో పీటున్నదీ/ నువ్వు తొంగుంటే పట్టె మంచం పరుపున్నదీ/ మాటున్నదీ మంచి మాటున్నదీ/ ఆకలైతే సన్నబియ్యం కూడున్నదీ/ నీకాకలైతే సన్నబియ్యం కూడున్నదీ/ బావుంది బావుంది/ అందులోకి అరకోడి కూరున్నదీ/ ఆవల రైటు ఎరీ గుడ్డు అందులోకి అరకోడి కూరున్నదీ/ ఆపైన రొయ్యపొట్టు చారున్నదీ/ మాటున్నదీ మంచి మాటున్నదీ/ రంజైన మీగడ పెరుగున్నదీ/ నంజుకోను ఆవకాయ ముక్కున్నదీ/ డోంటు వాంటూ.. నీకు రోగమొస్తే ఘాటైన మందున్నదీ/ నిన్ను సాగనంప వల్లకాటి దిబ్బున్నదీ.
– డా||తిరునగరి శరత్‌చంద్ర,
sharathchandra.poet@yahoo.com
సినీ గేయరచయిత, 6309873682