ఆధునిక ప్రపంచంలో కామర్స్ కు ఉజ్వలమైన భవిష్యత్తు..

– యూనివర్సిటీ లో కామర్స్ విద్యార్థులకు ప్రేరణ..
– రిజిస్ట్రార్ ప్రొఫెసర్ యాదగిరి..
నవతెలంగాణ – డిచ్ పల్లి
తెలంగాణ కామర్స్ అసోసియేషన్ సౌజన్యంతో  తెలంగాణ యూనివర్సిటీ కామర్స్ విభాగం, యూనివర్సిటీ పరిధిలో  డిగ్రీ స్థాయి కామర్స్ విద్యార్థుల  ప్రతిభా పాటవాలు, సృజనాత్మకతను వెలికి తీయడానికి  ప్రేరణ కార్యక్రమం నిర్వహించారు.ఈ కార్యక్రమ ప్రారంభోత్సవానికి తెలంగాణ యూనివర్సిటీ రిజిస్ట్రార్ ప్రొఫెసర్ డాక్టర్ ఎం.యాదగిరి  ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడుతూ ఆధునిక ప్రపంచంలో కామర్స్ కు ఉజ్వలమైన భవిష్యత్తు ఉందన్నారు. ప్రపంచంలో వ్యాపార రంగంలో ముందున్న దేశమే  ఆర్థికంగా అగ్రగామిగా ఉందన్నారు. వ్యాపార రంగంలో వచ్చే శాస్త్ర సాంకేతికత ఆర్థిక రంగాన్ని  బలంగా ముందుకు తీసుకుపోతుందని పేర్కొన్నారు. అందుకు వాణిజ్య శాస్త్రాన్ని అభివృద్ధి పరచాల్సిన బాధ్యత  విద్యావేత్తలతో పాటు, శాసనకర్తల మీద ఉందని తెలిపారు. ఈ కార్యక్రమానికి అతిథిగా హాజరైన  ఉస్మానియా యూనివర్సిటీ సీనియర్ ప్రొఫెసర్ కృష్ణ చైతన్య ప్రసంగిస్తూ కామర్స్ విద్యార్థులు మార్కెట్లో వస్తున్న ఆధునిక మార్పులను అధ్యయనం చేయాలన్నారు. ఆర్గనైజింగ్ సెక్రటరీ కామర్స్ విభాగం డీన్ ప్రొఫెసర్ రాంబాబు గోపిశెట్టి  మాట్లాడుతూ కామర్స్ ద్వారా ఉపాధి ఉద్యోగ అవకాశాలు  విరివిగా పొందవచ్చునని సూచించారు. ఈ ప్రేరణ కార్యక్రమంలో వివిధ కళాశాలల నుండి వచ్చినా 400 మంది విద్యార్థులు వ్యాసరచన, ఉపన్యాసం, జస్ట్ ఎ మినిట్, ఫేస్ పెయింటింగ్, రంగోలి, కామర్స్ క్విజ్, బిజినెస్ స్కిల్స్ లలో జరిగిన పోటీలో పాల్గొన్నారు. ఈ పోటీలలో న్యాయమూర్తులుగా  డా. సిహెచ్ ఆంజనేయులు, ప్రొఫెసర్ రవీందర్ రెడ్డి, ప్రొఫెసర్ సంపత్ కుమార్, డాక్టర్ పున్నయ్య, డాక్టర్ రాజేశ్వరి, డాక్టర్ వాణి  తదితరులు పాల్గొని ఒక్కొక్క విభాగం నుండి ముగ్గురు విద్యార్థులను ఎంపిక చేసి వారికి బహుమతులు అందించినారు.ఈ బహుమతి పొందిన విద్యార్థులు  ఏప్రిల్ 23 న ఉస్మానియా యూనివర్సిటీ పీజీ కాలేజ్ సికింద్రాబాద్ లో  జరిగే  రాష్ట్రస్థాయి ప్రేరణ  కార్యక్రమంలో పాల్గొంటారని ఆర్గనైజింగ్ సెక్రటరీ ప్రొఫెసర్ రాంబాబు  పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ ప్రొఫెసర్ సిహెచ్ ఆరతి, ఆర్గనైజింగ్ కోఆర్డినేటర్   డాక్టర్ శ్రీనివాస్, ఆర్గనైజ్ మెంబర్లు డాక్టర్ గంగాధర్, డాక్టర్ శ్వేత, రాజు తోపాటు  వివిధ కళాశాల  అధ్యాపకులు పాల్గొన్నారు.