– క్యూ3 లాభాల్లో 33 శాతం వృద్ధి
న్యూఢిల్లీ : ప్రభుత్వ రంగంలోని సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆకర్షణీయ ఆర్ధిక ఫలితాలు ప్రకటించి0ది. ప్రస్తుత ఆర్ధిక సంవత్సరం (2024-25) డిసెంబర్‌తో ముగిసిన తృతీయ త్రైమాసికం (క్యూ3)లో 33 శాతం వృద్ధితో రూ.958.93 కోట్ల నికర లాభాలు సాధించింది. గతేడాది ఇదే త్రైమాసికంలో రూ.717.86 కోట్ల లాభాలు నమోదు చేసింది. ఇదే సమయంలో రూ.3151 కోట్లుగా ఉన్న నికర వడ్డీ ఆదాయం.. గడిచిన క్యూ3లో 12.31శాతం పెరిగి రూ.3,540 కోట్లకు చేరింది. బ్యాంక్ స్థూల నిరర్థక ఆస్తులు రూ.10,459.89 కోట్లకు తగ్గి.. 3.86 శాతంగా చోటు చేసుకున్నాయి. గతేడాది ఇదే త్రైమాసికంలో 4.50 శాతం స్థూల నిరర్ధక ఆస్తులు నమోదయ్యాయి. క్రితం క్యూ3 నాటికి నికర నిరర్ధక ఆస్తులు 1.27 శాతం నుంచి 0.59 శాతానికి దిగివచ్చాయి. గడిచిన డిసెంబర్ త్రైమాసికంలో బ్యాంక్ మొత్తం వ్యాపారం 8.31 శాతం పెరిగి రూ.6,68,686 కోట్లకు చేరింది. 2023-24 ఇదే క్యూ3లో రూ.6,17,368 కోట్ల వ్యాపారం నమోదయ్యింది. బ్యాంక్ డిపాజిట్లు 5.34 శాతం పెరిగి రూ.3,97,907 కోట్లకు చేరగా.. అడ్వాన్సులు 12.99 శాతం వృద్ధితో రూ.2,70,779 కోట్లుగా నమోదయ్యాయి.
తగ్గిన ఐడిబిఐ బ్యాంక్ ఎన్‌పిఎలు
ప్రయివేటు రంగంలోని ఐడిబిఐ బ్యాంక్ ప్రస్తుత ఆర్ధిక సంవత్సరం (2024-25) డిసెంబర్‌తో ముగిసిన మూడో త్రైమాసికం (క్యూ3)లో 31 శాతం వృద్ధితో రూ.1,908 కోట్ల నికర లాభాలు సాధించింది. గతేడాది ఇదే త్రైమాసికంలో రూ.1,458 కోట్ల లాభాలు నమోదు చేసింది. ఇదే సమయంలో కంపెనీ మొత్తం ఆదాయం రూ.7,514.27 కోట్లుగా ఉండగా.. గడిచిన క్యూ3లో రూ.8,564.92 కోట్లకు చేరింది. ఇదే సమయంలో బ్యాంక్ వడ్డీ ఆదాయం రూ.7,815.57 కోట్లకు పెరిగింది. 2023-24 ఇదే క్యూ3లో రూ.6,540.86 కోట్ల వడ్డీ ఆదాయం చోటు చేసుకుంది. 2023 డిసెంబర్ ముగింపు నాటికి బ్యాంక్ స్థూల నిరర్థక ఆస్తులు 4.69 శాతంగా ఉండగా.. 2024 డిసెంబర్ ముగింపు నాటికి 3.57 శాతానికి తగ్గాయి. ఇదే సమయంలో నికర నిరర్ధక ఆస్తులు 0.34 శాతం నుంచి 0.18 శాతానికి పరిమితమయ్యాయి.
తగ్గిన జొమాటో లాభాలు..
ప్రముఖ ఫుడ్ డెలివరీ సంస్థ జొమాటో లాభాల్లో తగ్గుదల చోటు చేసుకుంది. 2024-25 డిసెంబర్‌తో ముగిసిన మూడో త్రైమాసికం (క్యూ3)లో 57 శాతం పతనంతో రూ.59 కోట్ల నికర లాభాలకు పరిమితమయ్యింది. గతేడాది ఇదే త్రైమాసికంలో రూ.138 కోట్ల లాభాలు సాధించింది. క్రితం క్యూ3లో జొమాటో గ్రాస్ ఆర్డర్ విలువ (జిఒవి) మాత్రం 57 శాతం పెరిగి రూ.20,206 కోట్లుగా చోటు చేసుకుంది.