చిదిగిన గూడు

ఒకప్పుడు అక్కడ తండా వుండేది
తనువంతా చెట్టయి తిరగాడి
బతుకంతా మట్టి పొదుగుల్తో శ్వాసగా
ప్రకతితో మెలిగిన మనుషులుండే వాళ్ళు
ఇపుడక్కడ మసకపడిన ఆనవాళ్లు మాత్రమే మిగిలి
తండా జాడలన్నీ చెరిగిపోయాయి
తండా వాసులు లేని అడవి గర్భస్రావమైన తల్లి లాగుంది
దేశపటంలో దేశం లేనంతగా ఇప్పటిది కాదు వాళ్ళ చరిత్ర
నాలుగు తరాలు అక్కడే దుసేరు తీగతో గంపకట్టినట్లు
ఆ నేలతో బట్టకట్టిన బతుకులు వాళ్ళు చెట్లకు చేతులిచ్చారు
కొమ్మమింద పిట్టకు గొంతునిచ్చారు మట్టికి చెమటల్ని అద్దినారు
కాలికి గజ్జె కట్టిన తంగేడు పూలు అనాదిగా నడిసిన అడుగుల్ని
దోసిళ్ళతో ఎత్తి పోసుకుపోవడమంటే మాటలా !
దుఃఖపు నెర్రల మధ్య పోతూ పోతూ
ఆ మట్టికింది ఒక రక్తపుగింజ నాటేవుంటారు
ఎప్పుడో ఒకప్పుడు మొలకెత్తక మానదు
( పి.వి తండా కనుమరుగయిన తడికన్నులతో..)
– ఈ.రాఘవేంద్ర