ఇరాన్ దేశాధ్యక్షునిగా ఉదారవాది మసూద్ పెజిష్కియన్ ఎన్నిక కావడం చాలామందిని ఆశ్చర్యచకితుల్ని చేసింది. ప్రజాస్వామ్యం అంకురించి విరబూయడానికి ఈ ఎన్నిక విజయం ఎంతో కొంత దోహదపడగలదని పలువురు రాజకీయ పరిశీలకులు నేడు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. అందుకే సర్వత్రా హర్షామోదం వెల్లడవుతున్నది. ఇరాన్‌లో రాజరికం కుప్పకూలి 45 ఏండ్లు కావస్తున్నది. 1979లో ఇరాన్ రాజు షా మహ్మద్ రెజా పెహ్లవి రాజరికం కూలిపోయిన తర్వాత అయితుల్లా భోమైనీ నాయకత్వంలో అక్కడ ఇస్లామిక్ ప్రభుత్వం ఏర్పడింది. ఆసియా ఖండంలో ఇరాన్ ఓ మధ్య ప్రాచ్యదేశం. జనాభా దాదాపు ఏడుకోట్లు, గతంలో ఇరాన్‌ను ప్రష్యా అని కూడా పిలిచేవారు. ఇరాన్ పేరుకు అర్థం స్థలి ఆర్యన్. అంటే ఆర్య భూమి. ఆర్యులు మన భారత దేశానికి అక్కడినుండే తరలి వచ్చారనే వాదన లేకపోలేదు. ప్రస్తుతం ఆదేశంలో పేరుకు ఇస్లామిక్ రిపబ్లిక్ ప్రభుత్వం అని ఉన్నా… అది గతంలోని మత రాజరిక ప్రభుత్వాలకంటే భిన్నమైనది కాదనే వాస్తవం ఎప్పటికప్పుడు వెల్లడవుతూనే ఉంటుంది.
2022లో మెహసా అమినీ అనే యువతి ‘హిజాబ్’ వస్త్రధారణ సరిగా పాటించలేదనే నెపంపై పోలీసులు నిర్భందించారు. ఆ నిర్భందంలో చిత్రహింసలు పెట్టిన కారణాన ఆమె మరణించడంతో ప్రజా నిరసన మిన్నంటిందప్పుడు. నిరసనను అణచేందుకు ప్రభుత్వం రకరకాల చర్యలకు ఒడిగట్టింది. నిరసన చెలరేగుతున్న ప్రాంతాలను గుర్తించి నెట్ బంద్ చేసింది. సామాజిక మాధ్యమాలపై నిషేధం విధించింది. ఉద్యమకారులపై పోలీసుల దమనకాండ నిత్యకృత్యమైంది. వేల సంఖ్యలో ప్రజలు జైళ్ల పాలయ్యారు. చిత్రహింసలకు గురయ్యారు. అమాయకులు బలైపోయారు.
అయినా యువతులు, మహిళలు పెద్ద సంఖ్యల్లో అప్పుడు వీధుల్లోకి వచ్చి హిజాబ్ వస్త్రధారణను బాహాటంగా ఉల్లంఘించడం వెల్లువెత్తింది. అధికారులనే కాక మతఛాందసులకు సైతం ఏం చేయాలో పాలు పోలేదు.
‘మహిళల జీవితం మహిళలదే. మతం ముసుగులో మగ పెత్తనమేంటి? అంటూ మహిళా ధిక్కారస్వరం దిక్కులు పిక్కటిల్లేలా మార్మోగింది. చాపకింద నీరులా సాగిన ఆ ప్రజాస్వామ్య ఉద్యమ హోరు ఈ మార్పునకు ఇప్పుడు నాంది పలికినట్టు వారు భావిస్తున్నారు. యుద్ధవీరుడు సయ్యద్ జలీలీ మీద సంస్కరణ వాది పెజిష్కియన్ మంచి మెజారిటీతో గెలవడం సామాన్య విషయంకాదనేవి ఆ పరిశీలకుల అభిప్రాయం.
‘సంప్రదాయాలను గౌరవిస్తూనే. ఆధునికతకు చోటివ్వక తప్పదని’ పెజిష్కియన్ ఇప్పుడు అంటు న్నాడు, స్త్రీలను రెండో తరగతి పౌరులుగా చూడటం ఇక ఎంతమాత్రం తగదని కూడా చెబుతున్నాడు.
ఇరాన్‌లోని అల్పసంఖ్యాక వర్గాలతో పాటు సంస్కరణ వాదులు, ప్రజాస్వామ్యవాదుల ఆదరణ సైతం పొందడం వల్లనే పెజష్కియన్‌కు 53 శాతం ఓట్ల ఘన విజయం లభించినట్టు బొగట్టా.
గత అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ మే నెలలో హెలికాప్టర్ ప్రమాదంలో మరణించడం వల్లనే ఇప్పుడు ఈ అధ్యక్షుని ఎన్నిక జరిగింది. కాగా ఈ ఎన్నికల బరిలో నిలవడానికి షియా మతాచార్యుల మండలి అనుమతి లభించిన ఏకైక సంస్కరణ వాది పెజిష్కియన్ మాత్రమే.
పెజిష్కియన్ గెలుపును ఇరాన్ మిత్రదేశం రష్యా వెంటనే స్వాగతించింది. వృత్తి రీత్యా హృదయ శస్త్ర నిపుణుడై పెజిష్కియన్ ఇరవైయేండ్ల క్రితం ఆరోగ్యమంత్రిగా పనిచేసిన అనుభవం ఉన్నది.
అగ్రరాజ్యం అమెరికా ఆంక్షల కారణంగా ఇరాన్ నేడు ఉక్కిరి బిక్కిరవుతున్నది. ఇరాన్ అణ్వస్త్ర తయారీని విరమిస్తే తప్ప ఆర్థిక ఆంక్షలు సడలించమని అమెరికా బెదిరిస్తున్నది. అయితే గాజాలో ఇజ్రాయిల్ సైన్యాలతో పోరాడుతున్న పాలస్తీనా సాయుధ బృందాలకు ఇరాన్ అండగా నిలుస్తున్నది. ఇజ్రాయిల్‌కు అడుగడుగునా వత్తాసు పలుకుతున్నది. అమెరికా అనేది జగమెరిగిన సత్యం.
అమెరికా – ఇజ్రాయిల్ యుద్ధోన్మాద చర్యలకు వ్యతిరేకంగా ఎర్రసముద్రంలో చమురు రవాణాకు ఆటంకం కలిగిస్తున్న హైతీ తిరుగుబాటు దార్లకూ ఇరాన్ మద్దతునిస్తున్నది. ఈ కారణాల రీత్యా ఇజ్రాయిల్ – ఇరాన్‌ల మధ్య క్షిపణుల యుద్ధం (మిస్సైల్ వార్) ఢ అంటే ఢ అంటున్నది.
ఈ నేపథ్యంలో ఎన్నికల పెజిష్కియన్ ఓ సంస్కరణవాదిగా అటు అంతర్గతంగానూ, ఇటు బహిర్గతంగానూ ఎలాంటి చర్యలు చేపడతాడా? అని లోకం ఎదురు చూస్తున్నది. ఆయన చేపట్టే పాలనా చర్యలకు మతాచార్యుల మండలి మరి తోడ్పాటునందిస్తుందా..? ఎందుకంటే ఆ మండలి సర్వాధికారి ఇప్పటికీ అయితుల్లా బొమైనీనే.
దేశం లోపల మతఛాందసత్వం, వెలుపల అమెరికా సామ్రాజ్యవాదాన్ని ఏకకాలంలో ధిక్కరిస్తూ ముందుకు సాగడం అత్యంత సాహసోపేతమైన కృత్య ం. నిజంగా కత్తిమీద సాములాంటిదీ. అయితే ప్రజల ఆకాంక్షలు, ఆదరణ, ప్రజాఉద్యమాలు పెజిష్కి యన్ వెన్నంటి ఉన్నాయి. అదే ఆయన అద్వితీయ బలం.
ప్రజాస్వామ్యం బలోపేతం కావడానికి ఎక్కడైనా పునాదిగా నిలిచేది ప్రజల చొరవేనని, ప్రజల భాగస్వామ్యంతో ప్రజాస్వామ్యం పరిఢవిల్లుతుందని థోరో చెప్పిన మాటలు రుజువు కావడమే ఆ హర్షాతిరేకం.
– కె.శాంతారావు, 9959745723