యువత సంక్షేమాన్ని విస్మరించిన బడ్జెట్

– నిరుద్యోగులకు కాంగ్రెస్ ఇచ్చిన హామీలను నెరవేర్చాలి
– డివైఎఫ్ఐ జిల్లా అధ్యక్షులు డి నరేష్ పటేల్
నవతెలంగాణ – జమ్మికుంట
యువత సంక్షేమానికి పాటుపడతామని చెబుతూనే, యువజన సర్వీసులు, క్రీడలకు బడ్జెట్లో నిరాశ జనకంగా కేటాయింపులు ఉన్నాయని, కాంగ్రెస్ ప్రభుత్వం నిరుద్యోగులకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని ఉద్యోగాల నోటిఫికేషన్లు, నిరుద్యోగ భృతి అమలు చేయాలని భారత ప్రజాతంత్ర యువజన సమాఖ్య జిల్లా అధ్యక్షులు డి నరేష్ పటేల్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.శనివారం  జమ్మికుంట మండల కేంద్రంలో డివైఎఫ్ఐ ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించారు.  ముఖ్యఅతిథిగా ఆయన విచ్చేసి మాట్లాడారు . యువత సంక్షేమానికి గత ప్రభుత్వం తీవ్ర అన్యాయం చేసిందని చెబుతున్న, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం చేపట్టిన తర్వాత ప్రవేశపెట్టిన మొట్టమొదటి బడ్జెట్ లోనే యువజనుల సర్వీసు శాఖకు సరైన బడ్జెట్ కేటాయింపులు చేయకపోవడం అన్యాయమని ఆయన విమర్శించారు.2021-22 బడ్జెట్ లో 188 కోట్లు,2022-23 బడ్జెట్లో 176 కోట్లు,2024-25 బడ్జెట్లో 173 కోట్ల 93లక్షలు మాత్రమే  కేటాయించారన్నారు. ఈ కొద్దిపాటి నిధులతో రాష్ట్రంలో యువజన సర్వీసులు, క్రీడల అభివృద్ధి ఎలా సాధ్యమవుతుందని ఆయన ప్రశ్నించారు.యువజన సంక్షేమాన్ని గత ప్రభుత్వం పూర్తిగా విస్మరించిందని, ప్రస్తుత ప్రభుత్వం కూడా అదే మాదిరిగా వ్యవహరించడం సరికాదని ఆయన అన్నారు. నిరుద్యోగ భృతి పై స్పష్టత ఇవ్వలేదని ఆయన దుయ్యబట్టా  రు. జాబ్ క్యాలెండర్ ప్రకటన, 2 లక్షల ఉద్యోగాలపై నామమాత్ర ప్రస్తావననే తప్ప స్పష్టత లేదన్నారు. యువజనుల క్రీడలు ,శారీరక నైపుణ్యం కేంద్రాలు పెంచాలన్నారు. యువత నైపుణ్య శిక్షణ అభివృద్ధి కొరకు ప్రత్యేక యూనివర్సిటీ నిర్మిస్తామని చెప్పిన మాటలకు బడ్జెట్లో మాత్రం ప్రస్తావించలేదన్నారు. విద్యారంగానికి ఆశించిన మేరకు బడ్జెట్ కేటాయింపులు లేవని, పాఠశాల, ఉన్నత విద్య యూనివర్సిటీలు మరింత సంక్షోభంలో ఉన్నాయని, వెంటనే రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్ పెంచాలని ఆయన డిమాండ్ చేశారు.డివైఎఫ్ఐ జమ్మికుంట మండల  కమిటీ  కన్వీనర్ గా ఎలుక సాయి, కో కన్వీనర్ గా ముద్దమల్ల చరణ్ ను ఎన్నుకున్నట్లు తెలిపారు. విద్యార్థి యువజన సమస్యలపై పోరాటాలు నిర్వహిస్తామని నూతన కమిటీ సభ్యులు తెలిపారు.ఈ కార్యక్రమంలో నాయకులు ముద్దమల్ల చరణ్, ఎలుక సాయీ, పర్లపెల్లి జీవన్, సిద్దు,స్వాగత్ బాలు, సురేష్, శ్రీకాంత్ తదిరులు పాల్గొన్నారు.