టెల్కోలకు బంఫర్‌ లబ్ధి..!

వీఐ, భారతీ ఎయిర్‌టెల్‌లకు మద్దతు– రూ.1 లక్ష కోట్ల ఏజీఆర్‌ బకాయిల మాఫీ
– యోచనలో కేంద్రం
– వీఐ, భారతీ ఎయిర్‌టెల్‌లకు మద్దతు
న్యూఢిల్లీ : ప్రయివేటు టెలికం కంపెనీలకు భారీ లబ్ధి చేకూర్చడానికి మోడీ సర్కార్‌ కసరత్తు చేస్తోందని సమాచారం. టెల్కోలను ఆదుకునే పేరుతో స్థూల సర్దుబాటు ఆదాయం (ఏజీఆర్‌) బకాయిలను మాఫీ చేయాలని కేంద్ర ప్రభుత్వం యోచిస్తోందని లీకులు వస్తున్నాయి. దీంతో టెలికాం కంపెనీలకు దాదాపు రూ.1 లక్ష కోట్ల మేర లబ్ధి చేకూరనుందని సమాచారం. గతంలో దక్కించుకున్న స్పెక్ట్రమ్‌కు గానూ బ్యాంక్‌ గ్యారెంటీలు సమర్పించాలన్న నిబంధనను ఇప్పటికే కేంద్రం తొలగించింది. మరోమారు టెల్కోలకు భారీ ఆర్ధిక మద్దతును ఇవ్వనుందని.. ఇందుకోసం త్వరలోనే కీలక నిర్ణయం తీసుకోనుందని రిపోర్టులు వస్తున్నాయి. ఈ నిర్ణయంతో ముఖ్యంగా వొడాఫోన్‌ ఐడియా, భారతీ ఎయిర్‌టెల్‌ వంటి సంస్థలకు మేలు చేకూరనుందని మార్కెట్‌ నిపుణులు అంచనా వేస్తున్నారు. టెలికం కంపెనీల డిపాజిట్లపై వడ్డీ, ఆస్తుల విక్రయాలు, డివిడెండ్‌లు సహా అన్ని రకాల ఆదాయాలపై పన్నులు చెల్లించాల్సి ఉండగా.. పలు కారణాలు, భారాల పేరుతో టెల్కోలు ఇందులో కొన్ని బకాయిలను చెల్లించలేదు. ఆ విధంగా కేంద్రానికి రూ.1.47 లక్షల కోట్ల మేర చెల్లించాల్సి ఉంది.
ఏజీఆర్‌ బకాయిలకు సంబంధించిన చర్చలు ఏండ్ల తరబడి కొనసాగుతున్నాయి. గతేడాది మార్చి నాటికి వొడాఫోన్‌ ఐడియా బకాయిలు రూ.80వేల కోట్లకు చేరగా.. ఎయిర్‌టెల్‌ బకాయిలు రూ.42వేల కోట్లుగా ఉన్నాయని అంచనా. ఇందులో దాదాపు 75 శాతం మేర వడ్డీ ఉండగా మిగిలినది జరిమానాలు ఉన్నాయి. ఈ బకాయిలపై ఇప్పటికే టెలికాం కంపెనీల ప్రతినిధులతో టెలికాం విభాగం పలుమార్లు సమావేశమైంది. ఆర్థికంగా తాము ఒత్తిడిని ఎదుర్కుంటున్నామని ఆ కంపెనీలు ప్రభుత్వానికి తెలిపాయి. ఈనేపథ్యంలోనే వడ్డీపై 50శాతంతో పాటు పెనాల్టీలు, పెనాల్టీలపై విధించిన వడ్డీని 100 శాతం మేర మాఫీ చేసేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తుందని సమాచారం. అదే జరిగితే విఐకి రూ.52 వేల కోట్లు, ఎయిర్‌టెల్‌కు రూ.38వేల కోట్లు, టాటా టెలీ సర్వీసెస్‌కు రూ.14వేల కోట్ల మేర బకాయిలు రద్దు కానున్నాయి.