నవతెలంగాణ – రాయపోల్
ప్రమాదవశాత్తు విద్యుత్ షాక్ కు గురై కాడేద్దు మృతి చెందిన సంఘటన రాయపోల్ మండలం ఎల్కల్ గ్రామంలో శనివారం సాయంత్రం చోటు చేసుకుంది. స్థానికులు,బాధితుని కథనం ప్రకారం మండలంలోని ఎల్కల్ గ్రామానికి చెందిన రైతు గడ్డం సత్తయ్య తనకు ఉన్న వ్యవసాయ భూమిలో వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తుంటాడు. అతనికి రెండు ఎద్దులు ఉన్నాయి. వాటి సహకారంతోనే వ్యవసాయం చేస్తుంటాడు. శనివారం సాయంత్రం గ్రామ సమీపంలోని పాఠశాలకు ఎదురుగా ఉన్న విలేజ్ పార్క్ వద్ద ఒక ఎద్దు గడ్డి మేత మేస్తూ ప్రమాదవశాత్తు విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ కు తగలడంతో విద్యుత్ షాక్ కు గురై అక్కడికక్కడే మృతి చెందింది. ఇది తెలిసిన రైతు కుటుంబం సంఘటన స్థలానికి చేరుకొని మృతి చెందిన ఎద్దును చూసి బోరున విలపించారు. సుమారు రూ.80 వేల విలువ కలిగిన కాడెద్దు మృతితో తీవ్ర నష్టం వాటిలిందని, వ్యవసాయం చేయడానికి ఎద్దు లేకపోవడంతో ఇబ్బంది అవుతుందని ప్రభుత్వం ఆ కుటుంబాన్ని ఆదుకొని రైతుకు బాసటగా నిలవాలని స్థానికులు విజ్ఞప్తి చేశారు.