– ముగ్గురు మృతి, మరో ముగ్గురి పరిస్థితి విషమం
– సంగారెడ్డి జిల్లా నల్లవల్లి అటవీ ప్రాంతంలో ఘటన
నవతెలంగాణ-గుమ్మడిదల
ఎదురుగా వస్తున్న రెండు ఆటోలను ఓ కారు ఢీకొట్టిన ఘటనలో ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందగా, మరో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉంది. ఈ హృదయవిధారకర ఘటన సంగారెడ్డి జిల్లా గుమ్మడిదల శివారులోని నల్లవల్లి అటవీ ప్రాంతంలో శుక్రవారం జరిగింది. ఎస్‌ఐ మహేశ్వర్‌రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. గండి మైసమ్మ నుంచి నర్సాపూర్ వైపు టీజీ35టీక్యూ 168, టీఎస్ 35ఏ2586 అనే నెంబర్ గల రెండు ఆటోలు ప్రయాణికులతో వెళ్తున్నాయి. ఈ క్రమంలోనే నర్సాపూర్ నుంచి గండిమైసమ్మ వైపు వెళ్తున్న ఏపీ28డీవీ4801 అనే నెంబర్ గల కారు.. నల్లవల్లి గ్రామ శివారులోని అటవీ ప్రాంతంలో ఉన్న మేడాలమ్మ టెంపుల్ వద్ద ఎస్‌హెచ్ 765 రోడ్డుపై ఎదురుగా వస్తున్న ఆ రెండు ఆటోలను ఢకొీట్టింది. దాంతో ఆటోలో ప్రయాణిస్తున్న కాలేజీ విద్యార్ధి ఐశ్వర్య(25), ప్రభుత్వ అధికారి మనిషా(25), సంతోష్ (24) అక్కడికక్కడే మృతి చెందారు. మరో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉండటంతో అంబులెన్స్‌లో ఆస్పత్రికి తరలించారు. ఈ ప్రమాదంతో స్థానికంగా ట్రాఫిక్ నిలిచిపోవడంతో.. గుమ్మడిదల పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని ట్రాఫిక్ క్లియర్ చేశారు. ఘటన వివరాలను అడిగి తెలుసుకొని ఘటనాస్థలిని పరిశీలించారు.