ఖమ్మం జిల్లాలో 41 మంది నకిలీ వైద్యులపై కేసు నమోదు

– తెలంగాణ మెడికల్‌ కౌన్సిల్‌
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
ఖమ్మం జిల్లాలో 41 మంది నకిలీ వైద్యులు, ఆర్‌ఎంపీ, పీఎంపీలపై ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసినట్టు తెలంగాణ మెడికల్‌ కౌన్సిల్‌ తెలిపింది. ఈ మేరకు కౌన్సిల్‌ పౌరసంబంధాల కమిటీ చైర్మెన్‌ డాక్టర్‌ నరేష్‌ కుమార్‌ మంగళవారం ఒక ప్రకటన విడుదల చేశారు. ఆర్‌ఎంపీ, పీఎంపీలు వైద్యులు కారని స్పష్టం చేశారు. అల్లోపతి వైద్యం చేసే అర్హత వారికి లేదని తెలిపారు. అశాస్త్రీయంగా ఇచ్చే యాంటీ బయాటిక్స్‌, స్టెరాయిడ్స్‌ ఇంజెక్షన్స్‌తో దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలు తలెత్తుతున్నాయని హెచ్చరించారు.
ములుగు జిల్లా మంగపేటకు చెందిన నకిలీ వైద్యులు రాము ఇచ్చిన గర్భవిచ్ఛిత్తి మాత్రలు వికటించి గర్భిణి మరణించినట్టు తెలిపారు. ఇలాంటివెన్నో బయటికి రాని సంఘటనలున్నాయని తెలిపారు. వంరగల్‌ పోలీస్‌ కమిషనరేట్‌లో కూడా నకిలీ వైద్యులపై ఉన్న పెండింగ్‌ కేసులను త్వరలోనే ఫైల్‌ చేయనున్నట్టు వెల్లడించారు. కొత్త విజిలెన్స్‌ ఆఫీసర్లను ఈ నెలలో నియమించనున్నట్టు చెప్పారు. రాష్ట్రవ్యాప్తంగా తనిఖీలను తీవ్రతరం చేయనున్నట్టు పేర్కొన్నారు.
ఫార్మసీ లైసెన్స్‌ లేకుండా మందుల నిల్వ
హైదరాబాద్‌లోని మియాపూర్‌లో నకిలీ వైద్యుడు కృష్ణ నిల్వ ఉంచిన హైడోస్‌ యాంటీ బయాటిక్స్‌, షెడ్యూల్‌ మందులను స్వాధీనం చేసుకున్నట్టు తెలంగాణ మెడికల్‌ కౌన్సిల్‌ తనిఖీ అధికారులు చైర్మెన్‌ డాక్టర్‌ కె.మహేష్‌ కుమార్‌, వైస్‌ చైర్మెన్‌ డాక్టర్‌ జి.శ్రీనివాస్‌ తెలిపారు. కేసు నమోదు చేయనున్నట్టు చెప్పారు. దీంతో పాటు డ్రగ్‌ కంట్రోల్‌ అధికారులకు కూడా ఫిర్యాదు చేయనున్నట్టు వెల్లడించారు.