– పోలీస్ స్టేషన్ ఎదుట తండ్రీ, కొడుకుల ఆత్మహత్యాయత్నం
నవతెలంగాణ-చేర్యాల
తమ బంధువులతో ఉన్న భూ సమస్యపై కేసు నమోదు కావడంతో చేర్యాల పోలీస్ స్టేషన్ ఎదుట బుధ వారం సిద్దిపేట జిల్లా చేర్యాల పట్టణ కేంద్రానికి చెందిన తండ్రీ, కొడుకులు అవుశెర్ల సత్యనారాయణ, వెంకటేష్ ఆత్మహత్యకు యత్నించిన ఘటన సంచలనం సృష్టించింది. కుమారుడు వెంకటేష్ విలేకరులతో మాట్లాడుతూ.. గత కొనేండ్లుగా తమ పెద్దనాన్నతో భూ సమస్య ఉందని, సమస్యను పరిష్కరించుకొనేందుకు పెద్ద మనుషుల సమక్షంలో పంచాయితీలు జరుగుతున్నాయని తెలిపారు. కానీ, కొన్ని నెలలుగా ఈ సమస్యపై కాంగ్రెస్ పార్టీకి చెందిన ఇరువురు నాయకులు తమపై పెద్ద నాన్నతో పోలీసులకు ఫిర్యాదు చేయించినట్టు చెప్పారు. వెంటనే భూ సమస్యను పరిష్కరించాలని అధికార పార్టీ నాయకులు పోలీసులపై ఒత్తిడి తీసుకురావడంతో పోలీసులు తమను పోలీస్ స్టేషన్‌కు పిలిపించారన్నారు. దాంతో తీవ్ర మనస్తాపానికి గురై ఒంటిపై డీజిల్ పోసుకుని నిప్పు అంటించు కునేందుకు యత్నించామని తెలిపారు. ఈ విషయమై ఎస్‌ఐ పి.నీరేష్ మాట్లాడుతూ.. తమపై ఎవరి ఒత్తిడి లేదని, భూమిని దున్నేందుకు వెళ్లిన ట్రాక్టర్‌ను తిప్పి పంపారని ఫిర్యాదు రావడంతో విచారణ కోసం వారిని స్టేషన్‌కు పిలిపించామన్నారు. ఇంతలోనే ఒంటిపై డీజిల్ పోసుకున్నారని తెలిపారు.