నవతెలంగాణ- భిక్కనూర్: రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ఒక వైపు ప్రచారం జోరుగా సాగుతుంటే మరోవైపు డబ్బులు, మద్యం భారీ మొత్తంలో పోలీసులు స్వాధీనం చేసుకుంటున్నారు. భిక్కనూరు పట్టణ కేంద్రంలో గురువారం భారీ మొత్తంలో మద్యం స్వాధీనం చేసుకున్నారు. వివరాలు ఇలా ఉన్నాయి పట్టణ కేంద్రంలో ఉన్న వైన్స్ షాప్ నుండి 18 కాటన్ల మద్యం బాటిల్లను పట్టణానికి చెందిన ఓ ప్రజా ప్రతినిధి ఇంటికి తరలిస్తుండగా గమనించిన బీజేపీ నాయకులు పోలీసులకు సమాచారం అందించారు. ఎన్నికల సమయంలో భారీ మొత్తంలో మద్యం ప్రజా ప్రతినిధి ఇంటిలో ఏ విధంగా దాస్తారని బీజేపీ నాయకులు ప్రజా ప్రతినిధి ఇంటిని ముట్టడించారు. పోలీసులు వచ్చి మద్యం బాటిలను స్వాధీనం చేసుకునే వరకు ప్రజా ప్రతినిధి ఇంటి ముందు ప్రజా ప్రతినిధికి, నాయకులకు మధ్య తీవ్రవాగ్వాదం జరిగింది. సమాచారం అందుకున్న పోలీసులు ప్రజాప్రతి ఇంటికి చేరుకొని దాచి ఉంచిన 18 మద్యం కాటన్లను స్వాధీనం చేసుకొని పోలీస్ స్టేషన్ తరలించారు. ఈ మేరకు మద్యం విక్రయించిన వైన్స్ ఓనర్, తరలించిన వ్యక్తి, కారు, మద్యం బాటిల్లపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై సాయి కుమార్ తెలిపారు.