దేశంలో కులగణన చేపట్టాలి

– కేంద్ర ప్రభుత్వానికి డిప్యూటీ సీఎం భట్టి డిమాండ్‌
– దేశ సంపద అన్ని వర్గాలకు అందుతుంది
– అప్పులు చేసైనా సంపద సష్టిస్తాం… పేదలకు పంచుతామని వ్యాఖ్య
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్‌
కేంద్రంలోని బీజేపీ సర్కారు కుల గణన చేపట్టాలని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క డిమాండ్‌ చేశారు. అది విప్లవాత్మకమైన మార్పు అవుతుందని చెప్పారు. అలా చేస్తే జనాభా ప్రాతిపదిక అన్ని వర్గాలకు దేశ సంపద అందుతుందని అభిప్రాయపడ్డారు. రాష్ట్రంలో అప్పులు చేసైనా సంపద సృష్టిస్తామనీ, ఆ సంపద ద్వారా పేదలకు సంక్షేమ కార్యక్రమాలు అందిస్తామని ఆయన వ్యాఖ్యానించారు. బుధవారం హైదరాబాద్‌లోని గాంధీభవన్‌లో పార్టీ నాయకులు శివసేనారెడ్డి, అన్వేష్‌రెడ్డి, భవానిరెడ్డి, సంగిశెట్టి జగదీష్‌, డాక్టర్‌ లింగం యాదవ్‌, పద్మతో కలిసి ఆయన విలేకర్లతో మాట్లాడారు. మహిళా సంఘాలకు ఐదేండ్లలో లక్ష కోట్ల వడ్డీ లేని రుణాలందిస్తామన్నారు. పార్టీ కోసం కష్టపడి పని చేసిన వారి సమగ్ర వివరాలు అధిష్టానం వద్ద ఉన్నాయని చెప్పారు. త్వరలోనే అలాంటి నాయకులకు పార్టీ పదవులు అందుతాయని భరోసా ఇచ్చారు. ఆగస్టు 15లోపు రైతు రుణమాఫీ చేయాలనే వాగ్దానానికి రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని చెప్పారు.
ఈ విషయంలో ఎవరికి ఎలాంటి అనుమానాలు అక్కర్లేదన్నారు. కులగణన ద్వారా ఆయా వర్గాలను పరిపాలనలోనూ భాగస్వాములను చేయాలనేది తమ పార్టీ విధానమని చెప్పారు. మేడిగడ్డలో మేట వేసిన ఇసుకను తొలగిస్తేనే మరమ్మతు పనులు ప్రారంభమవుతాయని పునరుద్ఘాటించారు. కేంద్ర బడ్జెట్‌ ఆధారంగా రాష్ట్ర బడ్జెట్‌ ప్రవేశపెడతామని చెప్పారు. విద్యుత్‌ కొనుగోళ్లపై న్యాయ విచారణ జరగాలంటూ నిండు సభలో మాజీ విద్యుత్‌ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్‌రెడ్డి కోరారని గుర్తు చేశారు. తమ ప్రభుత్వం దానిపై న్యాయ విచారణకు ఆదేశిస్తే ఎందుకు ఉలిక్కి పడుతున్నారని ప్రశ్నించారు. దేశంలోని వనరులను దామాషా ప్రకారం పంచాలనే లక్ష్యంతో ఏఐసీసీ అగ్రనేత రాహుల్‌ గాంధీ సుదీర్ఘ పాదయాత్ర చేసిన విషయాన్ని గుర్తు చేశారు. మన రాష్ట్రంలోనూ ఆయన ఆలోచనలను అమలు చేస్తున్నట్టు తెలిపారు. రాహుల్‌ జన్మదినం సందర్భంగా మరోసారి ఈ విషయాన్ని చెబుతున్నట్టు తెలిపారు.