– నాలుగు రోజుల పాటు దాడులకు విరామం
– బందీల విడుదలకు మార్గం సుగమం
– గత రాత్రి దాడుల్లో వందమందికి పైగా మృతి
– ఒప్పందాన్ని స్వాగతించిన అంతర్జాతీయ సమాజం
– మళ్ళీ యుద్ధాన్ని కొనసాగిస్తామన్న నెతన్యాహు
గాజా, జెరూసలేం : గత ఆరు వారాలకు పైగా గాజాలో వరుస దాడులతో బీభత్సం సృష్టించిన ఇజ్రాయిల్ ఎట్టకేలకు కాల్పుల విరమణకు అంగీకరించింది. నాలుగు రోజుల పాటు కాల్పులను విరమించేందుకు ఇరు పక్షాల మధ్య అంగీకారం కుదిరింది. దీంతో హమస్ చెరలో వున్న బందీల విడుదలకు అవకాశం కలుగుతుంది. అలాగే ఇజ్రాయిల్ అదుపులో వున్న పాలస్తీనియన్లను కూడా విడిపించేందుకు వెసులుబాటు వుంటుందని అధికారులు బుధవారం తెలిపారు.
హమస్‌తో మధ్యవర్తిత్వం వహించడంలో కీలక పాత్ర పోషించిన కతార్ ఒప్పందం వివరాలను ప్రకటించింది. బుధవారం అర్ధరాత్రి లేదా గురువారం తెల్లవారు జాము నుండి కాల్పుల విరమణ అమల్లోకి వస్తుందని తెలిపింది. హమస్ వద్ద గల 50మంది బందీలు దశలవారీగా విడుదలవుతారని, అందుకు ప్రతిగా ఇజ్రాయిల్ జైళ్ళలో మగ్గుతున్న 150మంది ఖైదీలను విడుదల చేయాల్సి వుంటుందని తెలిపింది. బందీల్లో 33మంది మహిళలు, 123మంది మైనర్లు వున్నారు. వీరందరూ 2021 నుండి నిర్బంధంలో వున్నారు. రాళ్ళు విసరడం నుండి హత్యా ప్రయత్నాల వరకు వీరిపై అభియోగాలు మోపారు. కాగా ప్రస్తుతం కుదిరిన ఒప్పందం దీర్ఘకాల కాల్పుల విరమణ దిశగా తొలి చర్య అని కతార్ భావిస్తోంది.
కాగా నాలుగు రోజులే కాదని ఒప్పంద గడువును ఇంకా పెంచాలని సౌదీ అరేబియా, ఈజిప్ట్, జోర్డాన్‌ల విదేశాంగ మంత్రులు కోరారు. లండన్‌లో మీడియా సమావేశంలో మాట్లాడుతూ వీరు, ఈ కాల్పుల విరమణ ఒప్పందం అంతిమంగా రెండు దేశాల ఏర్పాటు దిశగా చర్చల పునరుద్ధరణకు దారి తీయాలని పేర్కొన్నారు. ఇజ్రాయిల్ మానవ హక్కుల పర్యవేక్షణా విభాగం కూడా ఒప్పందాన్ని స్వాగతించింది.
ఆస్పత్రులు, శరణార్ధ శిబిరాలపై కొనసాగుతున్న దాడుల్లో 100మంది మృతి
గాజాలో ఆస్పత్రులు, శరణార్ధ శిబిరాలపై గత రాత్రంతా, బుధవారం ఉదయం జరిగిన దాడుల్లో దాదాపు వందమందికి పైగా పాలస్తీనియన్లు మరణించారు. వీరందరినీ సామూహిక ఖననం చేశారు. ఆస్పత్రుల్లో, చుట్టుపక్కలా పరిస్థితులు భయంకరంగా వున్నాయని కమల్ అద్వాన్ ఆస్పత్రి డైరెక్టర్ తెలిపారు. తమ ఆస్పత్రికి గత రాత్రి నుండి 60వరకు మృత దేహాలు, వెయ్యి మందికి పైగా గాయపడిన వారు వచ్చారని చెప్పారు. వైద్య బృందాలు చాలా అలిసిపోతున్నాయని, ఒక్క చుక్క కూడా ఇంధనం లేదని, చేతుల్లో టార్చిలైట్లు పట్టుకుని చీకట్లోనే పనిచేస్తున్నామని చెప్పారు. ఆస్పత్రికి చుట్టుపక్కలా కూడా బాంబు దాడులు పెరిగాయని అన్నారు. అనేక భవనాలు కుప్పకూలుతున్నాయని, వడీ గాజా నుండి ఉత్తర గాజా వరకు పనిచేస్తున్న ఆస్పత్రుల్లో ఇదొక్కటే వుందని చెప్పారు. విచక్షణారహితంగా బాంబు దాడులు జరుగుతున్నాయని అన్నారు.
సరైన దిశగా కీలక చర్య
కాల్పుల విరమణ ఒప్పందాన్ని సరైన దిశలో తీసుకున్న కీలకమైన చర్యగా పేర్కొంటూ ఐక్యరాజ్య సమితి స్వాగతించింది. అయితే ఇంకా చేయాల్సింది చాలా వుందని పేర్కొంది. కాల్పులు విరమించిన ఈ సమయాన్ని బందీల విడుదలకు, గాజాలోని పాలస్తీనియన్ల దుస్థితిని తప్పించేలా వారి అవసరాలు తీర్చేందుకు ఉపయోగిం చాలని మధ్య ప్రాచ్య శాంతి ప్రక్రియకు ఐక్యరాజ్య సమితి ప్రత్యేక కోఆర్డినేటర్ టార్ వెనెస్‌లాండ్ సూచించారు. అల్‌షిఫా రోగులందరినీ తక్షణమే తరలించేందుకు తాము సిద్ధంగా వున్నామని పాలస్తీనా రెడ్ క్రీసెంట్ చెప్పింది.
రెండు పక్షాల మధ్య జరుగుతున్న ఘర్షణ యుద్ధం పరిధిని దాటి తీవ్రవాదంగా రూపాంతరం చెందిందని పోప్ ఫ్రాన్సిస్ వ్యాఖ్యానించారు. ఇరుపక్షాలకు చెందిన బంధువులు, కుటుంబ సభ్యులతో విడివిడిగా ఆయన మాట్లాడారు. వారి బాధలను ప్రత్యక్షంగా విన్నానని చెప్పారు.
నెతన్యాహ మొండిపట్టు
ఒప్పందం కుదిరిందంటే యుద్ధం ఆగిపోతుందని అర్ధం కాదని, కాల్పుల విరమణ పూర్తి కాగానే మళ్ళీ కాల్పులు ప్రారంభిస్తామని ఇజ్రాయిల్ ప్రధాని నెతన్యాహు ప్రకటించారు. ”మేం యుద్ధం జరుపుతున్నాం, అది కొనసాగుతుంది.” అని ఆయన వ్యాఖ్యా నించారు. ”మేము అనుకున్న లక్ష్యాల న్ని ంటినీ సాధించేవరకు ఈ యుద్ధం కొనసాగుతుంది.” అని ప్రకటించారు.
అంతర్జాతీయ సమాజం స్పందన
మానవతా సంక్షోభాన్ని తగ్గించేందుకు ఈ కాల్పుల విరమణ ఒప్పందం సాయపడుతుందని ఆశిస్తున్నట్లు చైనా విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి మావో నింగ్ వ్యాఖ్యానించారు. ఉద్రిక్తతలను, ఘర్షణలను తగ్గించడానికి వెసులుబాటు కలుగుతుందన్నారు.
కీలకమైన చర్యగా బ్రిటన్ వ్యాఖ్యానించింది. బందీల కుటుంబాలకు ఉపశమనం కలుగుతుందని, మానవతా సంక్షోభాన్ని పరిష్కరించడానికి అవకాశం వుంటుందని పేర్కొంది.
చాలా కాలం తర్వాత విన్న మొదటి మంచి వార్తగా రష్యా ప్రశంసించింది. సుస్థిర పరిష్కారం దిశగా ఇదొక్కటే మార్గమని వ్యాఖ్యానించింది.
గాజాలో మానవతా సాయం పెంచడానికి ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవచ్చని యురోపియన్ కమిషన్ అధ్యక్షుడు ఉర్సులా వాన్ డెర్ లేయన్ వ్యాఖ్యానించారు.