– ఎస్ఎఫ్ఐ రాష్ట్ర అధ్యక్షులు ఆర్ఎల్.మూర్తి
నవతెలంగాణ-ఓయూ
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం విద్యారంగంలోనూ మతోన్మాదాన్ని, కులాన్ని చొప్పిస్తోందని ఎస్ఎఫ్ఐ రాష్ట్ర అధ్యక్షులు ఆర్ఎల్.మూర్తి అన్నారు. అందుకు ఉదాహరణే నూతన విద్యావిధానం అని చెప్పారు. బుధవారం ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో హైదరాబాద్ ఓయూ ఆర్ట్స్ కళాశాల ఎదుట డా.బి.ఆర్ అంబేద్కర్ 67వ వర్ధంతి కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కుల, మత, ప్రాంతాల భేదాలు లేకుండా అందరూ సమానమే అని చెప్పిన గొప్ప వ్యక్తి అంబేద్కర్ అన్నారు. విద్య, వైద్యం, ఉపాధి అందరికీ సమానంగా కల్పించాలని చెప్పారన్నారు. కానీ బీజేపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి విద్యలో మతోన్మాదాన్ని, కులాన్ని చొప్పించే ప్రయత్నం చేస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. సెంట్రల్ యూనివర్సిటీలో భూత వైద్య కోర్సులు ప్రవేశపెట్టి మూఢనమ్మకాలను పెంచి పోషించి అబద్ధాలను ముందుకు తీసుకొస్తోందన్నారు.
ఎస్ఎఫ్ఐ ఓయూ అద్యక్షకార్యదర్శులు ఆంజనేయులు, రవి నాయక్ మాట్లాడుతూ.. బీజేపీ మూఢ నమ్మకాలతో ప్రజల్లో విషం నింపుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. కులాలు, మతాల పేరుతో చిచ్చు పెడుతూ పేద విద్యార్థులు బడిలో స్వేచ్ఛగా చదువుకోకుండా చేస్తోందన్నారు. బడుగు బలహీన వర్గాల విద్యార్థులకు విద్యను దూరం చేసే విధంగా మతోన్మాద శక్తులు ప్రయత్నాలు చేస్తున్నాయని తెలిపారు. అనేక మంది విద్యార్థులు చదువు లేక.. కూలి పనులు చేస్తున్నారని.. వచ్చిన డబ్బులతో కుటుంబాలను పోషించుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. దేశంలో ఏ నిరుపేద విద్యార్థి ఉండరాదని, ప్రతి ఒక్కరూ జ్ఞానం వైపు నడవాలని అంబేద్కర్ కోరుకున్నారన్నారు. ప్రతి ఒక్కరికీ స్వేచ్ఛ, సమానత్వం, సామాజిక న్యాయం జరగాలని, అందరికీ విద్య, వైద్యం సక్రమంగా అందినప్పుడే దేశం అభివృద్ధి వైపు అడుగులు వేస్తుందని చెప్పారన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ ఓయూ ఉపాధ్యక్షులు, సాయి కిరణ్, కృష్ణ, సహాయ కార్యదర్శి రాజు, నాయకులు శ్రీకాంత్ పాల్గొన్నారు.