రైతన్నలు చనిపోయినా..కరుణించని కేంద్రం

– అన్నదాతలకు లభించని హామీ
– ఇప్పటి వరకు ఆరుగురు మృతి
– ‘ఢిల్లీ చలో’పై చలనం లేని మోడీ సర్కారు
న్యూఢిల్లీ: రైతన్నల ‘ఢిల్లీ చలో’ మార్చ్‌ను కేంద్రం అంత సీరియస్‌గా తీసుకోవటం లేదు. 20 రోజుల పాటు జరిగిన ఆందోళనలో ఆరుగురు పంజాబ్‌ రైతులు చనిపోయారు. కానీ కేంద్రంలో ఎలాంటి చలనమూ రాలేదు. ప్రభుత్వం నుంచి ఒక ఒప్పందమూ కనిపించలేదు. ‘డిల్లీ చలో’ పాదయాత్ర 20వ రోజుకు చేరుకోవటంతో శంభు, ఖానౌరీ సరిహద్దుల్లో జరిగిన నిరసనలో ఆరుగురు మృతి చెందారు. శుభకరన్‌ను కాల్చి చంపటంతోపాటు 500 మందికి పైగా రైతులు గాయపడ్డారు. ఇంత పోరాడినా.. ప్రభుత్వంలో చలనం లేదని రైతులు, రైతు సంఘాల నాయకులు, సామాజిక కార్యకర్తలు మోడీ సర్కారుపై ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు.
ఇప్పటివరకు మరణాలు
పాటియాలా జిల్లాలోని ఆర్నో గ్రామానికి చెందిన కర్నైల్‌ సింగ్‌ (62) ఫిబ్రవరి 26న మరణించారు. గురుదాస్‌పూర్‌ జిల్లా చచెకి గ్రామానికి చెందిన జ్ఞాన్‌ సింగ్‌ (63) ఫిబ్రవరి 14న మృతి చెందాడు. పాటియాలా జిల్లాకు చెందిన మంజిత్‌ సింగ్‌ (72) ఫిబ్రవరి 18న, నరీందర్‌పాల్‌ సింగ్‌ (43) ఫిబ్రవరి 20న మరణించారు. భటిండా జిల్లాలోని బల్లోV్‌ా గ్రామానికి చెందిన శుభకరన్‌ సింగ్‌ ఫిబ్రవరి 21న చనిపోయాడు. ఫిరోజ్‌పూర్‌ జిల్లాలోని మన్సూర్‌దేవాకు చెందిన గుర్జంత్‌ సింగ్‌ (23) ఫిబ్రవరి 23న ప్రమాదంలో మరణించాడు.
అజరు మిశ్రాకు టికెట్‌ కేటాయించటంపై రైతుల ఆగ్రహం
బీజేపీ నేత అజరు మిశ్రా తేనీకి లోక్‌సభ టికెట్‌ కేటాయించడం శంభు, ఖానౌరీ సరిహద్దుల్లో నిరసన తెలుపుతున్న రైతు సంఘాల నేతలకు ఆగ్రహం తెప్పించింది. 2021లో లఖింపూర్‌ ఖేరీలో నలుగురు రైతులను చంపినట్టు తేని కుమారుడు ఆశిష్‌పై ఆరోపణలు ఉన్నాయి. వందలాది మంది రైతులు మరణించినా, గాయపడినప్పటికీ, సంయుక్త కిసాన్‌ మోర్చా (నాన్‌ పొలిటికల్‌), కిసాన్‌ మజ్దూర్‌ మోర్చా (కేఎంఎం) బ్యానర్‌పై నిరసనలు చేస్తున్న సంఘాలకు కేంద్రం నుంచి ఇప్పటికీ ఎలాంటి హామీ లభించకపోవటం గమనార్హం.