ఏ వ్యక్తి అయినా తన జీవితంలో నిస్వార్థమైన ప్రేమను పొందగలిగాడు అంటే అది కేవలం తల్లిదండ్రుల నుంచి మాత్రమే. తల్లిదండ్రులు పిల్లలకి కేవలం జన్మని మాత్రమే ఇవ్వరు. వారిని మంచి వ్యక్తులుగా తీర్చిదిద్దటం, వారికి అవసరమైన మానసిక ధైర్యాన్ని, దృఢత్వాన్ని వారిలో పెంపొందించడం, వాళ్ల కాళ్లపై వాళ్లు నిలబడేలా చేయటం వంటి విషయాల్లో కీలకపాత్ర వహిస్తారు.
ఒక్క మాటలో చెప్పాలంటే ముందు జన్మని ఇస్తారు, తర్వాత మంచి జీవితాన్ని ఇవ్వడానికి జీవితమంతా శ్రమిస్తారు. కానీ దాన్ని వాళ్లు కష్టంగా, భారంగా మాత్రం భావించరు. అందులోనే వాళ్లు ఆనందాన్ని పొందుతారు.
ఈ విషయాన్ని పిల్లలు కూడా అర్థం చేసుకుని, వారికి కూడా తల్లిదండ్రుల పట్ల వున్న ప్రేమ, అభిమానాన్ని తిరిగి వ్యక్తం చేయడానికి ఒక మంచి అవకాశంగా ఈ ‘పేరెంట్స్ డే’ని సెలబ్రేట్ చేసుకుంటున్నాం.
మారుతున్న కాలాన్ని బట్టి తల్లిదంద్రులు – పిల్లల మధ్య వుండే బాండింగ్‌లో కూడా అనేక మార్పులు చోటుచేసుకోవటం మనం గమనిస్తున్న విషయమే.
పూర్వం పిల్లలు ప్రతి విషయాన్ని వారి తల్లిదండ్రుల ద్వారానే నేర్చుకునేవారు. అంతుకుమించి వారికి వేరే సోర్స్ వుండేది కాదు. గ్రంథాలయాలు కూడా వారికి కొంత తోడ్పడినా, అక్కడ కూడా ఉపాధ్యాయులు, తల్లిదండ్రుల గైడెన్స్ అవసరమయ్యేది. ఏ పుస్తకం ద్వారా ఎలాంటి ఇన్‌ఫర్‌మేషన్ దొరుకుతుందనే విషయాన్ని కూడా వాళ్లు తల్లిదండ్రుల ద్వారానే తెలుసుకునేవారు. అందువల్ల పూర్వకాలంలో పిల్లలకి అన్ని విషయాల్లోనూ వాళ్ల తల్లిదండ్రులే ఆదర్శంగా వుండేవారు. అంతేకాదు, భవిష్యత్తులో పిల్లలు ఏం చదవాలి, ఎలా సెటిల్ అవ్వాలనే విషయాన్ని కూడా తల్లిదండ్రులే నిర్ణయించేవారు. ఒక్కమాటలో చెప్పాలంటే అప్పట్లో పేరెంటింగ్ అనేది అధికారంతో కూడుకుని వుండేది. దానివల్ల తల్లిదండ్రులు – పిల్లల మధ్య స్నేహపూరిత వాతావరణం గానీ, మనసు విప్పి మాట్లాడుకునే చొరవ గానీ వుండేవి కాదు. పిల్లలు తల్లిదండ్రుల పట్ల గౌరవం, విధేయతలు మాత్రమే ప్రదర్శించేవారు. అంతమాత్రాన వారి మధ్య ప్రేమ – ఆప్యాయతలకి ఏ మాత్రం కొదవ వుండేది కాదు.
తరువాత తరం తల్లిదండ్రులు (సాంకేతికత అభివృద్ధి చెందుతున్న కాలంలో) పూర్వం కాలం తల్లిదండ్రుల కన్నా కొంచెం భిన్నంగానే వుండేవారు. కాలంతో వచ్చిన మార్పులని వాళ్లు అర్ధం చేసుకుని దానికి అనుగుణంగా పిల్లలతో మెలిగేవారు.
పిల్లలతో స్నేహితుల్లా వుండడం, వాళ్ల ఆలోచనలకి, భావాలకి విలువ ఇవ్వడం, పిల్లలకి సంబంధించిన అన్ని విషయాల్ని వారితోనే ఓపెన్‌గా చర్చించడం, వాళ్లకి ఏమైనా సమస్యలు ఎదురైనప్పుడు వాటిని ఎలా ఎదుర్కోవాలనే విషయాలపై అవగాహన కల్పించడం అనేవి ఆ తరం తల్లిదండ్రుల్లోని ప్రత్యేక లక్షణాలు. వీటన్నిటికీ అప్పుడే అభివృద్ధి చెందుతున్న సాంకేతికత కూడా వాళ్లకి ఎంతగానో తోడ్పడిందని చెప్పవచ్చు. దానివల్ల తల్లిదండ్రులు పిల్లల మధ్య స్నేహపూరిత వాతావరణం నెలకొనడంతో పాటు ఇద్దరి మధ్య పారదర్శకతకి అవకాశం ఏర్పడింది.
అలా అని తల్లిదండ్రులుగా వారి పాత్ర ఎంతో సాఫీగా ఎటువంటి ఒడిదొడుగులు లేకుండా గడిచిందనుకుంటే పొరపాటే. ప్రతి తరంలోనూ పిల్లల పెంపకంలో తల్లిదండ్రులు అనేక సవాళ్లను ఎదుర్కొంటూనే వుంటారు. సమాజంలో ఏర్పడే మార్పులని బట్టి తల్లిదండ్రులు ఎదుర్కొనే సవాళ్లు వుంటాయి.
ఇక నేటి తరం తల్లిదండ్రుల్ని గురించి ప్రస్తావించుకున్నట్లయితే – ఈ తరం తల్లిదండ్రులు పిల్లల పెంపకంలో సవాళ్లను ఎదుర్కోవడం లేదు. అనేక సవాళ్ల మధ్య వాళ్లు తమ పిల్లల్ని పెంచాల్సిన పరిస్థితి వుంది ఈ రోజు.
‘ఆల్ఫా’ జనరేషన్‌గా చెప్పబడే నేటి తరం పిల్లల్ని పెంచటం అనేది వాళ్ల తల్లిదండ్రులకి నిప్పుల మీద నడకలాంటిదే అంటున్నారు నిపుణులు.
అందుకు ప్రధాన కారణం – సాంకేతికత అభివృద్ధి చెందిన కాలంలో పుట్టిన పిల్లలు వీళ్లు. ఈ తరం పిల్లలు సాంకేతికతకి ఇచ్చినంత ప్రాధాన్యం కుటుంబానికి గానీ, మానవ సంబంధాలకి గానీ ఇవ్వరని నిపుణులు వక్కాణించి చెప్తున్నారు. వీరు సమాజంతో కన్నా సాంకేతిక సాధనాలతోనే ఎక్కువ సంబంధాల్ని కలిగివుంటారు. వీళ్ల డిక్షనరీలో ఎమోషన్స్, బాండిగ్ అనే పదాలకి తావే లేదు.
మరి వీళ్ల తల్లిదండ్రులు ఎదుర్కొంటున్న పరిస్థితుల గురించి మాట్లాడుకున్నటయితే-
ఒకప్పుడు పిల్లల పెంపకమనేది తల్లిదండ్రులకి ఎన్నో మధురజ్ఞాపకాల్ని మిగిల్చేది. పిల్లలు పెద్దవాళ్లయి, పెళ్లిళ్లు అయి వెళ్లిపోయాక కూడా తల్లిదండ్రులు తమ జ్ఞాపకాల్లో పిల్లల బాల్యాన్ని చూసుకునేవారు.
కానీ ఈ తరం పిల్లలకి కొంచెం ఊహ తెలిసిన దగ్గర్నుండి గాడ్జెట్స్ వాడకంలో నిష్ణాతులైపోతున్నారు. తల్లిదండ్రులతో గడిపే సమయం కూడా వాళ్లకి వుండడం లేదు. దాంతో పిల్లలకి, తల్లిదండ్రులకి మధ్య కమ్యూనికేషన్ పూర్తిగా లోపిస్తోంది. అలాంటప్పుడు వాళ్లు తమ పిల్లల్లో ఇంక బాల్యాన్ని ఏమి చూడగలుగుతారు? అంతేకాకుండా వారి మధ్య సరైన కమ్యూనికేషన్ లేనికారణంగా బాండింగ్ తగ్గిపోతోంది. ఎమోషనల్ షేరింగ్ వాళ్లకి తెలీడం లేదు. దానివల్ల ప్రతి చిన్న విషయానికి ఆవేశపడిపోవడం, తల్లిదండ్రులమీద అరవడం చేస్తున్నారు. ఇవన్నీ తల్లిదండ్రుల్ని నిరాశ, నిస్పృలకి గురిచేస్తున్నాయి. పేరెంటింగ్ అనేది యాంత్రికంగా తయారయింది.
ఒకప్పుడు తల్లిదండ్రులు పిల్లల్ని ట్రైన్ చేసేవారు. కానీ నేటి తరం తల్లిదండ్రులు పిల్లల పెంపకం కోసం వాళ్లే అనేక విషయాల్లో ట్రైన్ అవ్వాల్సిన పరిస్థితి ఏర్పడింది.
గాడ్జెట్స్ వాడకంలో తమ పిల్లలు ఎక్కడ ప్రమాదాల్లో చిక్కుకుంటారో అన్న భయంతో తల్లిదండ్రులు, పిల్లలు ఉపయోగించే వివిధ సోషల్‌మీడియా ప్లాట్‌ఫాంలు, ఆన్‌లైన్ కమ్యూనికేషన్ సాధనాల గురించి అవగాహన పెంచుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. ఆ ప్లాట్ ఫాంస్ ఎలా పనిచేస్తాయి, అవి ఎందుకు అంత జనాదరణ పొందుతున్నాయి అనేది తెలుసుకోవడం తల్లిదండ్రులకి ఒక అవసరంగా మారింది. ఇంత కష్టపడుతున్నా తల్లిదండ్రులు పిల్లలు చూసే యాప్స్, కంటెంట్స్‌కి సంబంధించిన పూర్తి ఇన్‌ఫర్మేషన్‌ని తెలుసుకోలేకపోతున్నారు. ఉద్యోగంలో ఎదురవుతున్న సవాళ్లు, ఒత్తిళ్లకి తోడు ఇవన్నీ కూడా యాడ్ అవడంతో వాళ్లు చిన్న వయసులోనే తీవ్రమైన శారీరక, మానసిక అనారోగ్యాలకి గురౌతున్నారు.
తల్లిదండ్రుల్ని బాధించే మరో విషయం – పిల్లలు తల్లిదండ్రులు అంటే తమకి అన్ని సౌకర్యాల్ని అమర్చిపెట్టే యంత్రాల్లా భావిస్తున్నారు. ప్రకటనల్లో కనిపించే ప్రతి ఖరీదైన వస్తువు వాళ్లకి కావాలి. తమ కుటుంబ ఆర్థిక పరిస్థితులుగానీ, రాత్రింబవళ్లు యంత్రాల్లా కష్టపడుతున్న తమ తల్లిదండ్రులుగానీ వాళ్లకి కనబడటం లేదు. కన్నారు కాబట్టి మేం అడిగిందల్లా చేయటమే మీ బాధ్యత అన్నట్టు ప్రవర్తిస్తున్నారు. ఇలాంటి ధోరణులు తల్లిదండ్రుల్లో ఒక విధమైన భయాన్ని రేకెత్తిస్తున్నారు.
తల్లిదండ్రుల్ని వెంటాడుతున్న మరో పెద్ద సమస్యల – సోషల్ మీడియాలో విచ్చలవిడిగా కనిపిస్తున్న అశ్లీల దృశ్యాలు, ఎక్కడ పడితే అక్కడ అందుబాటులో వుంటున్న డ్రగ్స్. ఇవన్నీ అమాయకులైన తమ పిల్లల్ని ఏ క్షణంలోనైనా బలితీసుకుంటాయేమో అనే భయం ప్రతి తల్లిదండ్రుల్ని వెంటాడుతూనే వుంది.
వీటన్నింటి గురించి పిల్లల్లో అవగాహన కల్పించడానికి చాలా మంది తల్లిదండ్రులు ప్రయత్నిస్తూనే వున్నారు. కానీ పిల్లలకి ఒక రంగుల ప్రపంచాన్ని ఎంతో ఆకర్షణీయంగా చూపిస్తున్న సోషల్ మీడియా ముందు వీళ్లు ఓడిపోతూనే వున్నారు. గట్టిగా శాసించాలనుకుంటే పిల్లలు తల్లిదండ్రుల్ని శత్రువుల్లా చూస్తున్నారు. వారికి మరింత దూరమై పోతున్నారు.
ఈ పరిస్థితుల్ని తల్లిదండ్రులు ఎలా ఎదుర్కొంటున్నారు?
జెన్ ఆల్ఫా పిల్లల తల్లిదండ్రులు, పిల్లల వల్ల ఎన్ని సమస్యలు, సవాళ్లు ఎదుర్కొంటున్నా తల్లిదండ్రులుగా తమ బాధ్యతని విస్మరించడం లేదు. ఒక్కొక్కసారి పిల్లల ప్రవర్తన వాళ్లని నిరాశ, నిస్పృహలకి గురిచేసినా, వారు అక్కడే ఆగిపోవడం లేదు. తమ పిల్లలకి మంచి భవిష్యత్తుని అందించడం కోసం అనేక మార్గాల్ని అన్వేషిస్తున్నారు. వాటిని పరిష్కరించాలంటే ఓర్పుతో పాటు నైపుణ్యం కూడా కావాలి.
అందుకే తల్లిదండ్రులు గ్రూపులుగా ఏర్పడి తాము ఎదుర్కొంటున్న సమస్యల గురించి చర్చించుకుంటున్నారు. ఇది కేవలం నా సమస్య అనుకునే కన్నా ఇది మనందరికి సంబంధించిన సమస్య అనుకోవడం వల్ల మానసిక భారం, ఒత్తిడి కొంత వరకు తగ్గుతాయి. అంతేకాదు, అందరితో చర్చించడం వల్ల కొత్త ఆలోచనలు, మెరుగైన పరిష్కార మార్గాల్ని కూడా పొందగలుగుతున్నారు.
పిల్లలతో ఫ్రెండ్లీగా వుండటం, వీలైనంత వరకు ఎక్కువ సమయాన్ని వాళ్లతో గడుపుతూ, వాళ్లతో సంభాషించడం వల్ల కూడా వాళ్ల ఆలోచనల్ని కొంత వరకు అర్ధం చేసుకునే అవకాశం వుంటుంది.
పిల్లల్లో తల్లిదండ్రులకి నచ్చని అంశాలు ఏమైనా వున్నా కూడా మారుతున్న కాలాన్ని దృష్టితో వుంచుకుని వాటిని అంగీకరించడాన్ని తమకి తాము సిద్ధం చేసుకుంటున్నారు. లేకుంటే తోటి పిల్లల మధ్య వీళ్లు ఆడ్ పర్సన్స్‌గా ట్రీట్ చేయబడతారనేది తల్లిదండ్రుల భయం.
పిల్లల్లో వున్న నైపుణ్యాల్ని గుర్తించి వాటిని మెరుగుపరచడం కోసం ఆన్‌లైన్‌లో ప్రత్యేక శిక్షణ ఇప్పిస్తున్నారు. పిల్లల కోసం డబ్బు, శ్రమ, కాలం వేటినైనా వెచ్చించడానికి నేటితరం తల్లిదండ్రులు వెనకాడడం లేదు.
గాడ్జెట్స్‌ని కన్‌స్ట్రక్షన్ వే లో ఎలా ఉపయోగించుకోవాలో కూడా పిల్లలకి నేర్పుతున్నారు. దానివల్ల వారిలో క్రియేటివిటీ పెరిగే అవకాశం వుంది.
ముందుతరం తల్లిదండ్రుల లాగా ఈ తరం తల్లిదండ్రులు పిల్లల ర్యాంకులకి, కెరీర్‌కి ప్రాధాన్యం ఇవ్వకుండా వారి నడవడిక మీదే ఎక్కువ శ్రద్ధ పెట్టాల్సిన పరిస్థితి ఏర్పడింది. దానికి ప్రధాన కారణం పిల్లలపై సోషల్ మీడియా ప్రభావమే.
అవసరమనుకుంటే పిల్లలకి కౌన్సెలింగ్ ఇప్పించడం కోసం సైకాలజిస్టులని కూడా సంప్రదించడానికి తల్లిదండ్రులు వెనుకాడడం లేదు. వాళ్ల లక్ష్యమల్లా ఒక్కటే – తమ పిల్లలు మంచి వ్యక్తులుగా తీర్చిదిద్దబడాలి.
ఇవన్నీ చేయాలంటే ఎంతో ఓర్పు, సహనం కావాలి. అందుకే ఈ ప్రపంచంలో తల్లిదండ్రుల పాత్ర ఎంతో ఉదాత్తమైనది. అలాంటి తల్లిదండ్రులకి ప్రేమతో కృతజ్ఞతలు చెప్పుకోవడమనేది పిల్లల కనీస ధర్మం.
ఇన్ని ఛాలెంజెస్‌ని ఎదుర్కొంటూ, తల్లిదండ్రులుగా తమ పాత్రని ఎంతో సమర్థవంతంగా నిర్వహిస్తూ ముందుకు సాగిపోతున్న తల్లిదండ్రులు అందర్నీ అభినందిస్తూ ‘పేరెంట్స్‌డే’ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను.
– గోపాలుని అమ్మాజి, 7989695883
హ్యూమన్ సైకాలజిస్ట్, ఫ్యామిలీ కౌన్సిలర్