– నేడు గుజరాత్ టైటాన్స్‌తో ఢీ
– ప్లే ఆఫ్స్ బెర్త్ వేటలో సన్‌రైజర్స్
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 17వ సీజన్ ప్లే ఆఫ్స్ రేసు ఆసక్తికరంగా మారింది. కోల్‌కత నైట్‌రైడర్స్,రాజస్థాన్ రెండు స్థానాలను ఖాయం చేసుకోగా మరో రెండు బెర్తుల కోసం ఐదు జట్లు పోటీపడుతున్నాయి. ఢిల్లీ క్యాపిటల్స్, లక్నో సూపర్‌జెయింట్స్‌కు అవకాశాలు నామమాత్రం. కానీ సన్‌రైజర్స్ హైదరాబాద్, రాయల్ చాలెంజర్స్ బెంగళూర్, చెన్నై సూపర్‌కింగ్స్ గట్టిగా పోటీపడుతున్నాయి. రెండు మ్యాచులు సొంతగడ్డపై ఆడనున్న సన్‌రైజర్స్ హైదరాబాద్ ప్లే ఆఫ్స్ రేసులో హాట్ ఫేవరేట్‌గా కనిపిస్తోంది. నేడు గుజరాత్ టైటాన్స్‌తో మ్యాచ్‌లోనే టాప్-4లో బెర్త్ ఖాయం చేసుకునేందుకు రైజర్స్ రెడీ అవుతున్నారు.
నవతెలంగాణ-హైదరాబాద్
సన్‌రైజర్స్ హైదరాబాద్ ఐపీఎల్ 17వ సీజన్లో గ్రూప్ దశలో చివరి రెండు మ్యాచులకు సిద్ధమైంది. గ్రూప్ దశలో 12 మ్యాచుల్లో ఏడింట విజయాలు సాధించిన సన్‌రైజర్స్ హైదరాబాద్ చివరి రెండు మ్యాచులను సొంతగడ్డ ఉప్పల్‌లో ఆడనుంది. ప్లే ఆఫ్స్ రేసులో సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో పోటీపడుతున్న ఇతర జట్లు గ్రూప్ దశలో ఒకే మ్యాచ్ ఆడాల్సి ఉండగా.. పాట్ కమిన్స్ సేన మాత్రమే రెండు మ్యాచుల్లో ఆడనుంది. దీంతో చివరి రెండు మ్యాచుల్లోనూ విజయాలు సాధించి ప్లే ఆఫ్స్ బెర్త్‌తో పాటు క్వాలిఫయర్ 1 మ్యాచ్‌లో ఆడటంపై సన్‌రైజర్స్ హైదరాబాద్ కన్నేసింది. సన్‌రైజర్స్ హైదరాబాద్, గుజరాత్ టైటాన్స్ మ్యాచ్ నేడు ఉప్పల్ వేదికగా జరుగనుంది.
ఆ ఇద్దరిపైనే ఫోకస్ : సన్‌రైజర్స్ హైదరాబాద్ మరోసారి భారీ స్కోరుపై గురిపెట్టింది. పవర్‌ప్లేలోనే మ్యాచ్‌ను లాగేసుకునే వ్యూహంతో బరిలోకి దిగుతుంది. ఓపెనర్లు ట్రావిశ్ హెడ్, అభిషేక్ శర్మలపైనే నేడు ఫోకస్ ఉండనుంది. ఈ ఇద్దరు 300 స్ట్రయిక్‌రేట్‌తో పరుగులు పిండుకుంటున్నారు. దీంతో పవర్‌ప్లే ముగిసేసరికి సన్‌రైజర్స్ స్కోరు మూడెంకలు తాకుతోంది. గత మ్యాచ్‌లో 167 లక్ష్యాన్ని 9.4 ఓవర్లలోనే ఊదేసిన ఓపెనర్లు నేడు అదే ఆత్మవిశ్వాసంతో క్రీజులోకి రానున్నారు. ట్రావిశ్ హెడ్, అభిషేక్ శర్మ ప్రదర్శన సన్‌రైజర్స్‌కు కీలకం కానుంది. మిడిల్ ఆర్డర్లో హెన్రిచ్ క్లాసెన్ తనదైన షో చూపించాల్సిన సమయం వచ్చింది. నితీశ్ కుమార్ రెడ్డి, అబ్దుల్ సమద్, షాబాజ్ అహ్మద్‌లు సైతం మంచి ఫామ్‌లో ఉండటం సన్‌రైజర్స్‌కు అదనపు బలం. కెప్టెన్ పాట్ కమిన్స్ మిడిల్ ఓవర్లలో బౌలింగ్ భారం మోస్తుండగా.. కొత్త బంతితో భువనేశ్వర్ కుమార్, డెత్ ఓవర్లలో టి. నటరాజన్‌లు సన్‌రైజర్స్‌కు కీలకంగా మారారు.
ఒత్తిడి లేకుండా… : అహ్మదాబాద్‌లో కోల్కతతో మ్యాచ్ వర్షార్పణం కావటంతో గుజరాత్ టైటాన్స్ ప్లే ఆఫ్స్ ఆశలు ఆవిరయ్యాయి. గ్రూప్ దశ చివరి మ్యాచ్‌లో ఒత్తిడి లేకుండా టైటాన్స్ బరిలోకి దిగుతుంది. కొంతమంది కీలక ఆటగాళ్లు నేటి మ్యాచ్‌కు అందుబాటులో ఉండటం లేదు. దీంతో యువ ఆటగాళ్లకు అవకాశం దక్కే అవకాశం ఉంది. సన్‌రైజర్స్‌ను గత మ్యాచ్‌లో టైటాన్స్ పేసర్లు, స్పిన్నర్లు కట్టడి చేశారు. కానీ ఇప్పుడు సన్‌రైజర్స్ బ్యాటర్లు మరింత భయంకర ఫామ్‌లో ఉన్నారు. సన్‌రైజర్స్ మాజీ ఆటగాళ్లు రషీద్ ఖాన్, కేన్ విలియమ్సన్‌పై టైటాన్స్ భారీగా ఆశలు పెట్టుకుంది. శుభ్‌మన్ గిల్, సాయి సుదర్శన్ సహా డెవిడ్ మిల్లర్, రాహుల్ తెవాటియ రాణిస్తే టైటాన్స్ గట్టి పోటీ ఇచ్చేందుకు చాన్స్ ఉంది. మోహిత్ శర్మ, నూర్ అహ్మద్ బంతితో టైటాన్స్‌కు కీలకం కానున్నారు.
పిచ్, వాతావరణం : ఈ ఏడాది ఐపీఎల్ సీజన్లో అత్యధిక పరుగులు ఉప్పల్ పిచ్‌పైనే నమోదవుతున్నాయి. ఇక్కడ జరిగిన ఐదు మ్యాచుల్లో ఒక్క మ్యాచ్‌లోనే ఇరు జట్లు 200 ప్లస్ పరుగులు చేయలేదు. మిగతా నాలుగు మ్యాచుల్లో పరుగుల వరద పారింది. సన్‌రైజర్స్ హైదరాబాద్ తొలుత బ్యాటింగ్ చేస్తే మరోసారి బ్యాటింగ్ రికార్డులు బద్దలు కావటం లాంఛనమే. నేడు హైదరాబాద్‌లో అధిక ఉష్ణోగ్రత, ఉక్కపోతతో పాటు మ్యాచ్ సమయంలో చిరు జల్లులు సైతం కురిసే అవకాశం కనిపిస్తుంది. మ్యాచ్‌కు ఆటంకం కలిగించే స్థాయిలో వర్షం ఉండబోదని వాతావరణ శాఖ తెలిపింది. టాస్ నెగ్గిన జట్టు తొలుత బ్యాటింగ్ ఎంచుకునే అవకాశం ఉంది.