అవయవదానంతో మరణించి జీవించే అవకాశం

A chance to die and live with an organ– దేశంలోనే తొలి స్థానంలో రాష్ట్రం : వైద్యారోగ్యశాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు
– అవయవదాతల కుటుంబీకులకు సన్మానం
నవతెలంగాణ-కల్చరల్‌
బ్రెయిన్‌ డెడ్‌ అయిన వ్యక్తి శరీర అవయవాలు ఎనిమిది మందికి ప్రాణం పోస్తాయని ఆ రకంగా మరణించి కూడా జీవించే అవకాశం అవయవ దానంతో సాధ్యమని వైద్యారోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు అన్నారు. అవయవ దానం పట్ల కొందరిలో ఇంకా అపోహలు, మూఢ నమ్మకాలు ఉన్నాయని, కానీ ఎలాంటి సంశయం అవసరం లేదని చెప్పారు.
తెలంగాణ ప్రభుత్వ జీవన్‌దాన్‌ నిర్వహణలో 13వ జాతీయ అవయవదాన దినోత్సవం కార్యక్రమం గురువారం హైదరాబాద్‌ రవీంద్రభారతి ప్రధాన వేదికపై నిర్వహించారు. ఈ సందర్భంగా అవయవ దాతల కుటుంబ సభ్యులు 105 మందిని మంత్రి సత్కరించారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ.. అవయవ దానంలో తెలంగాణ రాష్ట్రం దేశంలోనే తొలి స్థానంలో ఉందని, ఇది మనందరికీ గర్వకారణం అన్నారు. ప్రతి ఒక్కరి ఆరోగ్యం వారి చేతుల్లోనే ఉందన్నారు. అధిక ధూమపానం, మద్యపానం వల్ల లివర్‌, కిడ్నీ, సమస్యలు వస్తాయని చెప్పారు. జీవన శైలిలో యోగ, శారీరక వ్యాయామం వల్ల రక్తపోటు, చెక్కర వ్యాధులు రాకుండా చూసుకోవచ్చని, శరీరాన్ని, గుండెను కాపాడుకోవచ్చని అన్నారు. ప్రజల ఆరోగ్యం విషయంలో ప్రభుత్వం నిబద్ధతతో ఉందన్నారు. ఏ అనారోగ్య సమస్యకైనా ప్రభుత్వ వైద్యశాలలో ఉత్తమ చికిత్స లభిస్తుందని తెలిపారు. వైద్యవిద్య డైరెక్టర్‌ డాక్టర్‌ కె.రమేష్‌ రెడ్డి మాట్లాడుతూ.. ఆరోగ్యశ్రీ పథకం ద్వారా ప్రభుత్వం ఉచితంగా కిడ్నీ, లివర్‌, హార్ట్‌, లంగ్స్‌ అవయవ మార్పిడికి అనుమతిచ్చిందన్నారు. అవయవ మార్పిడిపై ప్రజలకు అవగాహన కల్పించే కార్యక్రమాలు జీవన్‌ దాన్‌ ద్వారా చేపట్టామని తెలిపారు. 2013 నుంచి ఇప్పటి వరకు 4829 వివిధ అవయవాల మార్పిడి జరిగిందని వివరించారు. వివిధ అవయవ మార్పిడీల కోసం 3089 మంది వేచి ఉన్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో హోంమంత్రి మహమూద్‌ అలీ, సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌, ఎమ్మెల్యే దానం నాగేందర్‌, ఎమ్మెల్సీ వాణీదేవి, కార్పొరేటర్‌ విజయారెడ్డి, ఉస్మానియా వైద్యశాల సూపరింటెండెంట్‌ డాక్టర్‌ నాగేందర్‌, గాంధీ వైద్యశాల సూపరింటెండెంట్‌ డాక్టర్‌ రాజారావు తదితరులు పాల్గొన్నారు.