ములుగు లక్ష్మీ మైథిలి… చిన్నతనం నుండి సాహిత్యమంటే ఎంతో మక్కువ. పిన్ని ప్రభావంతో చదవడం, రాయడం బాల్యంలోనే మొదలుపెట్టారు. మంచి సాహిత్యంతో సమాజంలో మార్పు తప్పకుండా వస్తుందని బలంగా నమ్మిన రచయిత్రి. కథలు, కవితలు, గేయాలు, గజల్స్, వ్యాసాలు, నానీలు ఇలా ఎన్నో ప్రక్రియల్లో తన రచనలను కొనసాగించారు. అక్షరానికున్న శక్తిని గుర్తించి సమాజానికి ఉపయోగపడే సాహిత్యాన్ని పాఠకులకు అందించాలని నితరంతరం తపిస్తున్న ఆమె పరిచయం ఆమె మాటల్లోనే…
మా సొంతూరు ఒంగోలు. అమ్మ సీతామహాలక్ష్మి, నాన్న నవులూరి శేషగిరిరావు, పోస్ట్‌మాస్టర్‌గా చేసి రిటైర్ అయ్యారు. వీళ్ళకు మేము నలుగురం పిల్లలం. నాకు ఓ అన్నయ్య, తమ్ముడు, చెల్లి ఉన్నారు. నాన్న ఉద్యోగ రీత్యా నా బాల్యం అనేక గ్రామాల్లో గడిచింది. నా బాల్యం మొత్తం చాలా సరదాగా సాగిపోయింది. ఒకటవ తరగతి నుంచి 5వ తరగతి వరకు కర్నూలు జిల్లాలోని దొర్నిపాడు గ్రామంలో, 9వ తరగతి వరకు ఆకుమళ్ళ గ్రామంలో, 10వ తరగతి పేరుసోముల గ్రామంలో చదివాను. తర్వాత పాలిటెక్నిక్ ఎంట్రెన్స్‌లో సెకండ్ ర్యాంకు సాధించి డి.సి.పి. కోర్సులో జాయిన్ అయ్యాను.
నాన్న చనిపోవడంతో…
పాలిటెక్నిక్ పూర్తి చేసే నాటికి మా నాన్న హార్ట్ఎటాక్తో మాకు దూరమయ్యారు. ఆర్థిక ఇబ్బందులతో మా కుటుంబం మొత్తం ఒంగోలు వచ్చేసింది. ఇక రెగ్యులర్ కాలేజీలో చదవలేక దూరవిద్య ద్వారా బీఏ పూర్తి చేసాను. పెండ్లి తర్వాత నెల్లూరు వెళ్ళాను. అప్పట్లో మావారు యమ్. చంద్రశేఖర్ రావు, నెల్లూరు గవర్నమెంట్ స్కూల్ హెడ్ మాస్టర్‌గా చేసేవారు. అక్కడే నేను స్టాఫ్ సెలక్షన్ కమిషన్, గ్రూప్ ఎగ్జామ్స్ రాసాను. బి.ఈ.డి. కూడా పూర్తి చేసాను. కానీ ర్యాంకు రాలేదు. తర్వాత కొన్ని ప్రైవేటు స్కూల్స్‌లో టీచర్‌గా పని చేశాను. మా అబ్బాయి యమ్.వి.కె.విశ్వనాథ్, కోడలు గాయత్రి. ఇద్దరూ బెంగుళూరులో సాఫ్ట్వేర్ ఇంజనీర్లుగా చేస్తున్నారు.
సాహిత్యంతో పరిచయం…
రాయడంలో నాకు స్ఫూర్తి మా అమ్మ చెల్లెలు డా.దేశారు విజయలక్ష్మి పండిట్. ఆవిడ సంస్కృతం లెక్చరర్, రచయిత్రి, కవయిత్రి. చాలా పుస్తకాలు రచించారు. మా పిన్ని ప్రభావంతోనే నేనూ రాయడం మొదలుపెట్టాను. చిన్నప్పటి నుంచి కవితలు రాయటమంటే చాలా ఇష్టం. ఎనిమిదవ తరగతి నుంచే కవితలు, గేయాలు రాసేదాన్ని. నా వయసుతో పాటే రచనల సంఖ్య కూడా పెరుగుతూ పోయింది. వివిధ పత్రికల్లో కథలు, కవితలు, నానీలు, గేయాలు వ్యాసాలు, ప్రచురించేవారు. అలాగే కొన్ని సంకలనాల్లో కూడా నా కథలు, కవితలు, వ్యాసాలు, నానీలు ప్రచురితమయ్యాయి.
ఇప్పటి వరకు చేసిన రచనలు
ఇప్పటివరకు మొత్తం 90 కథలు, వెయ్యి కవితలు, గజల్ ప్రక్రియలో 50, పద్యాలు 50, నానీలు- 200, వ్యంజకాలు 30, వ్యాసాలు 10, హైకూలు 50, మొగ్గలు 10, చందమామ పదాలు 10, గుణింతాల కవితలు 10, పంచపదులు పది వరకు రచించాను. వీటిలో చినుకులు, ఊహలు గుసగుసలాడే, కరచాలనం అనే మూడు కవితా సంపుటాలు వెలువడ్డాయి. ఇంకా 100 కథలు, 5 నవలలు పుస్తక రూపంలో ముద్రించాల్సి వుంది. అలాగే ‘తెలుగు వైద్యుత మహా నిఘంటువు” కోసం నెల్లూరు మాండలిక(3000 పదాలు) పదకోశం కూడా రచించాను.
మార్పు తప్పక వస్తుంది
అక్షరాలకు ఎంతో శక్తి ఉంది. సమాజంలో మార్పుకు ఎంతో దోహదపడతాయి. కవితలు, కథలు, పాటలు సమాజంపై ఎంతో ప్రభావం చూపుతాయి. అయితే వీటిని జనాల్లోకి తీసుకెళ్ళడం చాలా ముఖ్యం. మనం రాసే రచనలు చదవాలే కానీ, చదివిన వారిలో మార్పు తప్పకుండా వస్తుంది. సాహిత్యానికి అంతటి శక్తి ఉంది. మన రచనలు సమాజానికి ఉపయోగపడినప్పుడే మన అక్షరాలకు విలువ, గౌరవం పెరుగుతుంది. అలాగే నేను రాసిన కథలు, కవితల వల్ల ఏ ఒక్కరిలో నైనా మార్పు రావాలని కోరుకుంటున్నాను.
సహకారం అవసరం
ఏదైనా ఓ రంగంలో మహిళలు రాణించాలంటే కచ్చితంగా కుటుంబ సహకారం చాలా అవసరం. అప్పుడే ఆమె అనుకున్నది సాధించగలుగుతుంది. నా వరకు నా కుటుంబంలో మావారు, పిల్లలు, బంధువులు అందరూ ఎంతో సహకరించే వారు. నా రచనలను ప్రోత్సహించేవారు. కాబట్టే నా రచనలను నేటికీ కొనసాగించ గలుగుతున్నాను. ఓ రచయిత్రిగా అందరి ముందు నిలబడగలుగుతున్నాను. నేను సుమారు పాతికేండ్లు ప్రైవేటు స్కూల్లో టీచర్‌గా పని చేసాను. తర్వాత మోకాళ్ళ ఆపరేషన్ చేయించుకోవడంతో ఉద్యోగం మానేశాను. కానీ పిల్లలకు చదువు చెప్పడమంటే నాకెంతో ఇష్టం. అందుకే ఇంట్లోనూ పిల్లలకు ట్యూషన్లు చెబుతూ నా రచనలు కొనసాగిస్తున్నాను.
భవిష్యత్ ప్రణాళిక…
నేను గజల్స్ పద్యాలు హైకూలు ఇంకా ఇతర ప్రక్రియల్లో కూడా రచనలు చేశాను. నేను రాసిన రచనలను పుస్తకం రూపంలో ముద్రించాలి. ఇప్పటి వరకు కేవలం మూడు కవితా సంపుటాలు మాత్రమే వెలువడ్డాయి. ఒక కథా సంపుటి, ఐదు నవలలు ముద్రణలో ఉన్నాయి. వీటిని కూడా త్వరలో పూర్తి చేసి పాఠకులకు అందించాలి.
పొందిన పురస్కారాలు
ఇప్పటి వరకు నా కథలకు, కవితలకు అనేక బహుమతులు, పురస్కారాలు వచ్చాయి. దేవులపల్లి కృష్ణశాస్త్రి స్మారక అవార్డు, బీబీసీ అవార్డు, ప్రతిభా పురస్కారం మొదలైనవి వచ్చాయి. ఇలా చెన్నై, బెంగుళూరు, ఢిల్లీ, హైదరాబాద్, విశాఖ పట్నం మొదలైన చోట్ల సాహితీ సంస్థల ద్వారా అందుకున్నాను.