నా ప్రతిభని చూపించే పాత్ర…

A character that showcases my talent...‘నేను ఇప్పటివరకు పలు భిన్న సినిమాలు చేశాను. అయితే ‘డాకు మహారాజ్‌’ మాత్రం ఒక పూర్తి ప్యాకేజ్‌లా ఉంటుంది. ఇలాంటి సినిమాని నేను ఇప్పటి వరకు చేయలేదు. కామెడీ, యాక్షన్‌, ఎమోషన్‌.. అన్నీ ఉంటాయి. పైగా బాలకష్ణ సినిమా అంటే ఎక్కువ మంది ప్రేక్షకులకు నా ప్రతిభను చూపించే అవకాశం ఉంటుంది’ అని కథానాయిక శ్రద్ధా శ్రీనాథ్‌ చెప్పారు.
బాలకృష్ణ నటించిన చిత్రం ‘డాకు మహారాజ్‌’. బాబీ కొల్లి దర్శకుడు. శ్రీకర స్టూడియోస్‌ సమర్పణలో సితార ఎంటర్‌టైన్‌ మెంట్స్‌, ఫార్చ్యూన్‌ ఫోర్‌ సినిమాస్‌ పతాకాలపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మించారు. ఈ చిత్రంలో శ్రద్ధా శ్రీనాథ్‌, ప్రగ్యా జైస్వాల్‌ కథానాయికలు. సంక్రాంతి కానుకగా ఈనెల 12న ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా భారీస్థాయిలో విడుదల కానుంది. ఈ నేపథ్యంలో కథానాయిక శ్రద్ధా శ్రీనాథ్‌ మీడియాతో పలు విశేషాలను షేర్‌ చేసుకున్నారు.
– ఇందులో నా పాత్ర పేరు నందిని. చాలా సాఫ్ట్‌గా ఉంటుంది. ఎంతో ఓపిక ఉంటుంది. అదే సమయంలో ఎప్పుడు మాట్లాడాలో స్పష్టంగా తెలుసు. నా పాత్రలో ఎంతో డెప్త్‌ ఉంటుంది. నటనకు కూడా మంచి ఆస్కారముంది. ఈ సినిమా, ఇందులో నేను పోషించిన నందిని పాత్ర మీద ఎంతో నమ్మకంగా ఉన్నాను. నందిని పాత్రతో ప్రేక్షకులకు మరింత చేరువ అవుతాను.
– నటిగా ఈ సినిమా నుంచి ఎంతో నేర్చుకున్నాను. ముఖ్యంగా డైలాగ్‌లు కరెక్ట్‌ మెజర్‌లో ఉంటాయి. అందుకే టైమ్‌ పట్టినా నాతో చాలా జాగ్రత్తగా డబ్బింగ్‌ చెప్పించారు. పాత్ర పరంగా ‘జెర్సీ’, ‘డాకు మహారాజ్‌’ సినిమాల్లో వేటికవే ప్రత్యేకం. ‘జెర్సీ’లో నేను పోషించిన సారా పాత్ర నా మనసుకి బాగా నచ్చిన పాత్ర. ప్రేక్షకులు కూడా ఎంతో ఆదరించారు. ఇప్పుడు ఈసినిమాలోని నందిని పాత్రని కూడా ప్రేక్షకులకు అదే స్థాయిలో ఆదరిస్తారనే నమ్మకం ఉంది.
– ఎన్నో ఏళ్ళ నుంచి సినీ పరిశ్రమ లో ఉన్నాను, నేనొక బిగ్‌స్టార్‌ని అనే అహం బాలకష్ణలో కనిపించదు. అందరితో సరదాగా ఉంటారు.
– బాబీ ప్రతిభగల దర్శకుడు. సినిమా పట్ల ఆయనకు ఎంతో ప్యాషన్‌ ఉంది. అలాగే, ఆయనలో మంచి నటుడు కూడా ఉన్నాడు. అద్భుతమైన సూచనలు ఇస్తూ, నటీనటుల నుంచి మంచి నటనను రాబట్టుకుంటారు. నా పాత్ర బాగా రావడానికి ఆయనే కారణం.