చిన్నారికి తప్పిన ప్రాణాపాయం

– గ్రావెల్ గోతిలో నీటమునిగిన బాలుడు 
నవతెలంగాణ – ఆళ్ళపల్లి
పెద్ద వెంకటాపురం గ్రామానికి చెందిన ఓ చిన్నారి బాబుకి గురువారం సాయంత్రం తృటిలో ప్రాణాపాయం తప్పింది. గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం.. మండల పరిధిలోని పెద్ద వెంకటాపురం గ్రామానికి చెందిన కుంజ నాగేంద్రబాబు, కుమారి దంపతుల కుమారుడు కుంజ రేవంత్ అనే ఆరేళ్ల బాబు అదే గ్రామానికి చెందిన సమీప వయసు గల వజ్జ లక్కీతో కలిసి గురువారం సాయంత్రం సుమారు 6 గంటల సమయంలో దొడ్డి(ఆరుబయట)కి గ్రామంలోని పాఠశాల దగ్గరలో ఉన్న రోడ్డు కోసం తీసిన పెద్ద గ్రావెల్ గోతిలో నీళ్ళు ఉన్నది చూసి అక్కడికి వెళ్లాడు. కాలకృత్యాలు తీర్చుకునే క్రమంలో జారి రేవంత్ గుంతలో పడి, నీట మునిగాడు. అదిచూసిన లక్కీ గ్రామస్తులకు విషయం చెప్పడంతో పలువురు వచ్చి గొయ్యలో పూర్తిగా నీట మునిగిన రేవంత్ ను వారు మునిగి బయటకు తీశారు. అప్పటికే కడుపు నిండా నీళ్ళు తాగి అపస్మారక స్థితిలో ఉన్న రేవంత్ ను కుటుంబ సభ్యులు హుటాహుటిన మండల కేంద్రంలో తాత్కాలిక చికిత్స అందించి, మెరుగైన వైద్యం కోసం ప్రైవేటు వాహనంలో కొత్తగూడెం అద్వైత ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. అక్కడ వైద్యులు చికిత్స అందిస్తున్నారు. శుక్రవారం రేవంత్ ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని, మా బాబుకి ప్రాణాపాయం తప్పిందని కుటుంబ సభ్యులు తెలిపారు. ప్రస్తుతం వర్షాకాలం సీజన్ పక్కనే చిన్న పిల్లలు చదివే పాఠశాల ఉన్నందున ఎప్పటికైనా ప్రమాదమే అని గ్రామస్తులు వాపోతున్నారు. ఇకనైనా సంబంధిత అధికారులు, ప్రజా ప్రతినిధులు పెద్దవారు సైతం మునిగేలా ప్రమాదకరంగా ఉన్న నీటి గుంటను పూడ్చే చర్యలు చేపట్టాలని గ్రామస్తులు కోరుతున్నారు.