క్రైస్తవులందరూ ఏసుక్రీస్తు జన్మదినాన్ని పర్వదినంగా భావించి తమ ఇంటిని క్రిస్మస్ ట్రీ తో, రంగు కాగితాలు, నక్షత్రాలు, కానుకలతో అలంకరిస్తారు. తమ కుటుంబ సభ్యులు, స్నేహితులు, బంధువులతో చర్చికి వెళ్ళి ఆరాధనలో ఆనందంగా జరుపుకుంటారు.
క్రిస్మస్ అనగానే కేక్స్ గుర్తొస్తాయి. నిజమే ప్రతి పండగా ఆయా తినుబండారాలతో, ఆచార వ్యవహారాలతో పెనవేసుకని ఉంటుంది. భారతీయ చర్చిలలో క్రిస్మస్ నాడు చాలావరకు కేక్స్, అరటిపళ్ళు, చాక్లెట్స్ ఇస్తుంటారు. కుటుంబాలలో, మందిరాలలో, ఆరాధన సంఘాలలో చర్చి అయిపోయాక పెద్ద ఎత్తున భోజన ఏర్పాట్లు కూడా ఉంటాయి. కానీ ఇవన్నీ వేరొకరికి సహాయం చేసిన తర్వాతే. క్రీస్తు మాటలను నమ్మి పాటించే ప్రతి క్రైస్తవులూ డిసెంబర్ మాసంలో పేదలకి ఏదోక రూపంలో తమ సహాయాన్ని, దానాలని అందిస్తుంటారు. మరీ ముఖ్యంగా క్రిస్మస్ పండుగ రోజున పేదలకు, నిస్సహాయులకు తమ సామర్థ్యం మేరకు దానాలు చేస్తుంటారు. క్రిస్మస్ ఆత్మ అందులోనే ఉందని గుర్తుచేస్కోవాల్సిన సమయం ఇది.
నువ్వు పరిపూర్ణంగా ఉండాలనుకుంటే, పోయి నీ ఆస్తిని అమ్మి బీదలకిస్తే పరలోకంలో నీకు ధనము కలుగుతుందని క్రీస్తు అంటాడు. భూమి మీద ఉన్నంత కాలం మనిషికి ఉండే అత్యాశను జయించే మధురమైన మాటలు ఇవి. ధనవంతుడు పరలోక రాజ్యములో ప్రవేశిం చుటకంటె సూది బెజ్జములో ఒంటె దూరుట సులభమని అంటాడు క్రీస్తు. ధనవంతులు పేరాశను కలిగి కరుణ, దయ లేనివారై తోటి వారిని కనీస మాత్రంగా లెక్క చేయనివారై ఉండడంపై ఈ వ్యాఖ్య. ఎప్పుడైతే నువ్వు నీ అహాన్ని వదిలి పేదలకి సహాయంగా నిలుస్తావో అప్పుడే నీకు దేవుని ఆశీర్వాదం, పరలోకరాజ్యం ఉంటుందని చెప్పాడు. అందుకే క్రిస్మస్ పండుగ సందర్భంగా చాలామంది శాంటాక్లాస్ వేషధారణలో ఎవరికి తెలియకుండా సహాయం చేస్తూ ఉంటారు.
పేదల పట్ల దయ కరుణ ప్రతి నిత్యం ఉండాలి. అయితే క్రిస్మస్ మాసంలో దాదాపు ప్రతిరోజూ బీదలకి చలి కోట్లు, దుప్పట్లు, నిత్యావసరాలు, ఆహారం, డబ్బులు ఇస్తూనే ఉంటారు క్రైస్తవులు.
క్రీస్తు తన శిష్యులకు రక్షణ పొందాలంటే నిన్ను సహాయం అడిగినవారికి ఇవ్వు, నిన్ను అప్పు అడిగే వారి నుండి నీ ముఖం తిప్పకోవద్దని చెప్పాడు. మీ శత్రువులను ప్రేమించి, వారిలో మార్పు కోసం ప్రార్థన చేయండి. మిమ్మల్ని ప్రేమించిన వారిని ప్రేమించడం వల్ల ఏ ఉపయోగం ఉంది? మనసు నిండా చెడును నింపుకున్న శత్రువుని ప్రేమతో మార్చమని చెప్పాడు క్రీస్తు. ప్రేమ అన్ని దోషాలని కప్పుతుంది. ఒకరి పట్ల ఒకరికి ప్రేమ ఉంటే దోషాలు, శతత్వాలు తగ్గించిన వారమవుతామని చెప్పాడు.
క్రిస్మస్ పండుగ సందర్భంగా పేదలకి, లేనివారికి సహాయాన్ని అందించడమే కాదు, స్నేహితులు, కుటుంబసభ్యులు కూడా క్రిస్మస్ కానుకలు ఇచ్చి పుచ్చుకుంటారు. ఒకరి నుంచి మరొకరికి సంతోషం, ఆనందం పంచుకుంటూ ఉంటారు. అందుకే క్రైస్తవులు ఈ మాసంలో వీలైనంత మంచి పనులు చేస్తూ తమ విశ్వాసాన్ని చాటి చెబుతుంటారు. పిల్లలకి రకరకాల బహుమతులు ఇస్తూ వాళ్ళ ముఖాల్లో నవ్వులు పూయిస్తారు.
డిసెంబర్ మాసమంతా మందిరాల నుంచి శాంతా క్లాస్ వేషధారణలో కొందరు, సంఘమంతా తెల్లారే వరకు కారల్స్ పాడుతూ నీడలేకుండా రోడ్లపై జీవిస్తున్న చిన్నారులకు, అనాధలకు, ఫుట్ పాత్ లపై జీవించే వారికి, రాత్రి వేళలో చలికి నిద్రిస్తున్న పేద పిల్లలకు రగ్గులు కప్పి రహస్యంగా బొమ్మలు, పెన్స్, పుస్తకాలు వారి పక్కన పెట్టి వస్తుంటారు. నువ్వు కుడి చేత్తో చేసే సాయం నీ ఎడమ చేతికి కూడా తెలియకూడదని క్రీస్తు చెప్పాడు. నువ్వు దానం చేసేది నీ రక్షణ కోసం తప్ప నీ పేరు కోసం కాదని చెప్పాడు.
ఏసుక్రీస్తు ఎన్నో వెలకట్టలేని మంచి మాటలను చెప్పాడు. మనిషిగా ఎలా జీవించాలో చెప్పాడు. మనసు పెట్టి క్రీస్తును చదివితే నీ చేయి పట్టుకుని మంచి మార్గంలోకి నడిపించడాన్ని అనుభూతి చెందుతావు. క్షమ, దయ, కరుణ, ప్రేమను నింపేదే క్రిస్మస్.
డిసెంబర్ 25 క్రిస్మస్ సందర్భంగా…
మానస ఎండ్లూరి