నిర్మాణంలో ఉన్న చర్చి కూలడంతో..

నిర్మాణంలో ఉన్న చర్చి కూలడంతో..– ఒకరు మృతి.. మరొకరికి తీవ్ర గాయాలు
– ఏడుగురికి స్వల్ప గాయాలు
– సంగారెడ్డి జిల్లా కోహిర్‌లో ఘటన
నవతెలంగాణ-కోహిర్‌
నిర్మాణంలో ఉన్న చర్చి కూలడంతో ఓ యువకుడు మృతి చెందగా.. మరో వ్యక్తి పరిస్థితి విషమంగా ఉన్నది. ఇంకో ఏడుగురికి స్వల్ప గాయాలయ్యాయి. ఈ ఘటన సంగారెడ్డి జిల్లా కోహిర్‌ మండల కేంద్రంలో ఆదివారం జరిగింది. జహీరాబాద్‌ సీఐ రాజు, కోహీర్‌ ఎస్‌ఐ విఠల్‌ తెలిపిన వివరాల ప్రకారం.. కోహిర్‌ మండల కేంద్రంలో నూతనంగా నిర్మిస్తున్న మెథడిస్ట్‌ చర్చికి.. ఆదివారం స్లాబ్‌ వేస్తుండగా.. కింది భాగంలోని చెక్కలు ఒక్కసారిగా కూలాయి. దాంతో స్లాబ్‌ కూడా కూలడంతో అక్కడే కూలీలుగా పనిచేస్తున్న తొమ్మిది మందికి గాయాలయ్యాయి. వారిలో ఖాసీం మొల్ల(20), రాజుకు తీవ్ర గాయాలవ్వడంతో సంగారెడ్డి ప్రభుత్వాస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ పరిస్థితి విషమించి ఖాసీం మొల్ల మృతి చెందాడు. రాజు పరిస్థితి విషమంగా ఉన్నట్టు వైద్యులు తెలిపారు. స్వల్ప గాయాలైన మరో ఏడు మంది జహీరాబాద్‌ ప్రభుత్వాస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. కాగా మయమ్మార్‌కు చెందిన ఖాసీం మొల్ల, నేపాల్‌కు చెందిన రాజు తమ కుటుంబ సభ్యులతో కలిసి కొంత కాలంగా మండల కేంద్రమైన కోహిర్‌లో నివాసముంటూ.. మెథడిస్ట్‌ చర్చి నిర్మాణ పనులు చేస్తున్నారు. ప్రమాదం జరిగిన విషయం తెలుసుకున్న జహీరాబాద్‌ ఎమ్మెల్యే కొనింటి మాణిక్‌ రావు, జహీరాబాద్‌ డీఎస్పీ రఘు, సీఐ రాజుతో కలిసి ఘటనాస్థలాన్ని సందర్శించారు. ప్రమాదం ఎలా జరిగింది.. ఎంతమందికి గాయలయ్యాయని వివరాలు అడిగి తెలుసుకున్నారు.