– హైదరాబాద్‌లో ఎక్కడికక్కడ చెక్‌పోస్టులు, తనిఖీలు..పట్టుబడుతున్న నగదు, బంగారు ఆభరణాలు
నవతెలంగాణ-సిటీబ్యూరో
రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికల నియమావళి (కోడ్) అమల్లోకి వచ్చిన నేపథ్యంలో హైదరాబాద్ జిల్లాలో ఎన్నికలను సమర్థవంతంగా నిర్వహించేందుకు అటు పోలీసులు, ఇటు జీహెచ్‌ఎంసీ అధికారులు మరింత అప్రమత్తమయ్యారు. నగర వ్యాప్తంగా ప్రత్యేక చెక్‌పోస్టులను ఏర్పాటు చేసిన పోలీసులు ఎక్కడికక్కడ తనిఖీలను ముమ్మరం చేశారు. మఫ్టీల్లో పోలీసులు సంచరిస్తున్నారు. ఎక్కడ ఇద్దరు ముగ్గురు గుమికూడినా ఆరా తీస్తున్నారు. నాయకులు, వారి ముఖ్య అనుచరుల ఇండ్ల సమీపంలో సైతం గట్టి నిఘా పెట్టారు. ఇదిలా ఉండగా జీహెచ్‌ఎంసీ పరిధిలో నోడల్ అధికారులను హైదరాబాద్ జిల్లా ఎన్నికల అధికారి, జీహెచ్‌ఎంసీ కమిషనర్ రోనాల్డ్ రోస్ నియమించారు. వివిధ పార్టీలు, అభ్యర్థులు మీడియా ద్వారా ఓటర్లను ప్రభావితం చేసేలా వ్యవహరిస్తున్న వారిపై వీరు దృష్టి సారిస్తారు. వ్యక్తిగత ప్రచారాలకు సంబంధించి పెయిడ్ న్యూస్‌ను ప్రొత్సహిస్తున్న వారి వివరాలను సేకరించి ఎప్పటికప్పుడు కమిషనర్ దృష్టికి తీసుకెళ్లనున్నారు. అంతేకాకుండా క్షేత్రస్థాయిలో ఓటర్లను ప్రభావితం చేసేలా పెయిడ్ న్యూస్‌ను అరికట్టడానికి ప్రత్యేకంగా పెయిడ్ న్యూస్ నియంత్రణ వ్యవస్థను సైతం ఎన్నికల సంఘం ఏర్పాటు చేసింది.
పట్టుబడుతున్న నగదు
నగరంలో ప్రతి పోలీస్‌స్టేషన్ పరిధిలో ప్రత్యేక చెక్‌పోస్టులను ఏర్పాటు చేస్తున్న పోలీసులు వాహనాలను తనిఖీ చేస్తున్నారు. ఈ క్రమంలో పెద్దఎత్తున నగదు, వెండి, బంగారం, మద్యం, మత్తు పదార్థాలతోపాటు చీరలు, కుక్కర్లు పట్టుబడుతున్నాయి. వాటిని స్వాధీనం చేసుకుంటున్న పోలీసులు వివిధ సెక్షన్ల కింద కేసులు నమోదు చేస్తున్నారు. ఎస్బీ, ఇంటలిజెన్స్, టాస్క్‌ఫోర్సు, ఎస్‌వోటీ పోలీసులు మఫ్టీలో సంచరిస్తూ ఓటర్లను ప్రలోభాలకు గురిచేసే వారిపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నారు. ఎప్పటికప్పడు వారి కదలికలను ఆరా తీస్తున్నారు. ఇటీవల చైతన్యపురి పోలీస్‌స్టేషన్ పరిధిలో సరైన పత్రాలు లేకుండా తరలిస్తున్న రూ.33.55లక్షలను, జూబ్లీహిల్స్‌లో రూ.5.50లక్షలు, అబిడ్స్‌లో రూ.5లక్షలను సీజ్ చేసిన విషయం తెలిసిందే. ఇక అమీర్‌పేట్‌లో రూ.9.9లక్షలతోపాటు మియాపూర్‌లో బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. నారపల్లి వద్ద ఎటువంటి ఆధారాలు లేకుండా అక్రమంగా తరలి స్తున్న రూ.13లక్షలు స్వాధీనం చేసుకున్నారు. శుక్రవారం కుషాయిగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో రూ. 12లక్షల నగదు పట్టుబడగా, పోచారం ఐటీసీ పోలీస్ స్టేషన్ పరిధిలో రూ. 8లక్షల నగదును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
వాటిపై ఆరా
ప్రచార కార్యక్రమాలకు సంబంధించి అన్నింటిపై దృష్టి సారించారు. ప్రచార ప్రకటనలకు ముందస్తు అనుమతి తీసుకోకుంటే చట్టపరంగా చర్యలు తీసుకోనున్నారు. మీడియాల్లో వచ్చే పెయిడ్ న్యూస్‌ను గుర్తించేందుకు ప్రత్యేక వింగ్‌ను ఏర్పాటు చేశారు. జీహెచ్‌ఎంసీ ప్రధాన కార్యాల యంలో సీ.పీ.ఆర్.ఓ సెక్షన్‌లో ప్రత్యేకంగా మీడియా సర్టిఫికేషన్, మానిటరింగ్ కమిటీ (ఎం.సి.ఎం.సి)ని ఏర్పాటు చేశారు. జిల్లా ఎన్నికల అధికారి చైర్మెన్‌గా ఉన్న ఈ కమిటీలో ఇన్‌ఫర్మేషన్ బ్యూరో డిప్యూటీ డైరెక్టర్, సీనియర్ జర్నలిస్ట్, జీహెచ్‌ఎంసీ సీపీఆర్‌ఓను సైతం నియమించారు. ప్రచారం చేయాలనుకుంటే మాత్రం కమిటీ నుంచి అనుమతులు పొందాల్సి ఉంటుందని అధికారులు తెలిపారు. అదేవిధంగా పోలింగ్ రోజు, ముందు రోజు ప్రచురితం అయ్యే ప్రింట్, ఎలక్ట్రానిక్, సోషల్ మీడియా ఇతర మాధ్యమాల్లో ప్రకటనలకు కూడా అనుమతి తప్పనిసరి తీసుకోవాలి. గుర్తింపు పొందిన రాజకీయ పార్టీలు, రిజిస్టరయిన రాజకీయ పార్టీలు రాజకీయ ప్రకటనలకు సంబంధించి రాష్ట్ర స్థాయి ఎంసీఎంసీ కమిటీకి దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుందని తెలియజేశారు. ఎన్నికల్లో పోటీచేసే అభ్యర్థులు నామినేషన్ వేసినప్పటి నుంచి చేసిన వ్యయాన్ని అభ్యర్థుల ఎన్నికల వ్యయంలో కలుపుతారు.
అనుచిత వ్యాఖ్యలు చేయడం నేరం
ఇతరులను కించపరిచే విధంగా వ్యవహరిస్తే చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని అధికారులు తెలిపారు. మతాలు, వర్గాలపై దాడి, దుర్బాషలు, అనుచిత వ్యాఖ్యలు చేసినా, ఇతరులను కించపరిచే విధంగా వ్యవహ రించినా కేసులు నమోదు చేయనున్నారు. హింసను ప్రేరేపించడం, కోర్టు తీర్పులకు వ్యతిరేకంగా వ్యవహరిం చడం, దేశ సార్వభౌమత్వం, ఐక్యతకు భంగం కలిగించడం, వ్యక్తిగత దూషణలు చేయడం చట్టప్రకారం నేరం.