నటుడు ప్రకాశ్‌రాజ్‌కు క్లీన్‌చిట్‌

– పొంజి స్కామ్‌తో ఆయనకు సంబంధం లేదన్న ఈడీ
న్యూఢిల్లీ: తమిళనాడులోని ప్రణవి జ్యువెల్లర్స్‌కు సంబంధమున్న రూ.100 కోట్ల విలువైన పొంజి స్కామ్‌ కేసులో ఆరోపణలు ఎదుర్కొన్న ప్రముఖ నటుడు ప్రకాశ్‌రాజ్‌కు ఊరట లభించింది. కేంద్ర దర్యాప్తు సంస్థ ఈడీ ఆయనకు క్లీన్‌చిట్‌ ఇచ్చింది. ఈ కేసుతో ఆయనకు సంబంధం లేదని వెల్లడించింది. ప్రణవ్‌ జ్యువెల్లర్స్‌కు ప్రకాశ్‌రాజ్‌ బ్రాండ్‌ అంబాసిడర్‌గా వ్యవహరించారు. కాగా, ఈడీ క్లీన్‌చిట్‌ అనంతరం నటుడు ప్రకాశ్‌రాజ్‌ ‘ఎక్స్‌’ వేదికగా స్పందించారు. ”తమిళం అర్థం కానివారి కోసం బ్రేకింగ్‌ న్యూస్‌. దర్యాప్తు బృందం అధికారిక ప్రకటన. తమిళనాడు ప్రణవ్‌ జ్యువెల్లర్స్‌కు చెందిన పొంజి స్కామ్‌లో ఆయనకు సంబంధం లేదు. నన్ను నమ్మి, నా వెంట నిలబడ్డ ప్రతి ఒక్కరికి నా ధన్యవాదాలు” అంటూ సత్యమేవజయతే, జస్ట్‌ ఆస్కింగ్‌ అనే హ్యాష్‌ట్యాగ్‌లతో ఆయన తన పోస్ట్‌ను ముగించారు. ఈ మేరకు తన ఎక్స్‌ పోస్ట్‌కు తమిళ వార్త ఛానెల్‌కు చెందిన ఒక క్లిప్‌ను ఆయన జోడించారు.