రాజ్ తరుణ్ హీరోగా నటించిన నూతన సినిమా ‘పురుషోత్తముడు’. ఈ చిత్రాన్ని శ్రీ శ్రీదేవి ప్రొడక్షన్స్ బ్యానర్ పై డా.రమేష్ తేజావత్, ప్రకాష్ తేజావత్ భారీ బడ్జెట్‌తో నిర్మించారు. ఈ చిత్రంతో హాసిని సుధీర్ హీరోయిన్‌గా పరిచయం అవుతున్నారు. ‘ఆకతాయి’, ‘హమ్ తుమ్’ చిత్రాలతో మంచి దర్శకుడిగా పేరు తెచ్చుకున్న రామ్ భీమన ఈ సినిమాకి దర్శకత్వం వహించారు. ప్రకాష్ రాజ్, మురళి శర్మ, రమ్యకృష్ణ, బ్రహ్మానందం, ముకేష్ ఖన్నా వంటి స్టార్ కాస్టింగ్‌తో రూపొందిన ఈ సినిమా నేడు (శుక్రవారం) ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్‌కు రాబోతోంది. ఈ నేపథ్యంలో దర్శకుడు రామ్ భీమన, నిర్మాత డా.రమేష్ తేజావత్ మీడియాతో పలు విశేషాలను షేర్ చేసుకున్నారు. దర్శకుడు రామ్ భీమన మాట్లాడుతూ, ‘డా.రమేష్ తేజావత్, ప్రకాష్ తేజావత్ లాంటి మంచి ప్రొడ్యూసర్స్ నాకు దొరకడం సంతోషంగా ఉంది. ఈ సినిమాను క్లీన్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా రూపొందించాను. ప్రకాష్‌రాజ్, రమ్యకష్ణ, ముఖేష్ ఖన్నా, మురళీ శర్మ లాంటి పెద్ద ఆర్టిస్టులను అనుకుంటే వాళ్లంతా మా మూవీలోకి వచ్చేలా మా ప్రొడ్యూసర్స్ చేశారు. వీళ్లంతా తమ నటనతో కథకు బలాన్ని తీసుకొచ్చారు. ఒక న్యూస్ ఆర్టికల్ చదివి కొన్నేళ్ల కిందట ఈ సినిమా కథ రెడీ చేసుకున్నాను. ఒక కోటీశ్వరుడైన అబ్బాయి పల్లెటూరికి ఎందుకు వచ్చాడు?, అక్కడ ఏం చేశాడు అనేది ఈ చిత్ర కథ. మహేశ్ బాబు ‘శ్రీమంతుడు’ లాంటి సినిమాలు ఇలాంటి కథలతో వచ్చాయి కదా అనిపించవచ్చు. మన దగ్గర కథ లైన్‌గా అనుకుంటే ఎన్నో సినిమాలు ఒకేలా అనిపిస్తాయి. కానీ ఆ కథలో ఏం చెప్పాం అనేది ముఖ్యం. ఈ సినిమాలో ఇప్పటిదాకా మన ఇండియన్ ఫిల్మ్ ఇండిస్టీలో రాని పాయింట్‌ను టచ్ చేశాం’ అని తెలిపారు. ‘నాకు సినిమాలంటే ప్యాషన్. బిజినెస్‌లో బాగా రాణిస్తున్నా ఒక మంచి తెలుగు సినిమా నిర్మించాలనే కోరిక మనసులో ఉండేది. ఆ కోరిక ఈ సినిమాతో తీరింది. సినిమా కోసం నిర్మాతలుగా ఎక్కడా రాజీ పడకుండా చేయాల్సిన ప్రయత్నాలన్నీ చేశాం. ఈ సినిమాని సకుటుంబంగా ప్రేక్షకులంతా హాయిగా చూసేలా ఉంటుంది’ అని నిర్మాత డా.రమేష్ తేజావత్ చెప్పారు.