కేరళలోని హెచ్‌ఐఎల్‌ మూసివేసిన కేంద్రం

కొచ్చి: కేరళలోని హిందూస్థాన్‌ ఇన్‌సెక్టిసైడ్స్‌ లిమిటెడ్‌ (హెచ్‌ఐఎల్‌) పునరుద్ధరణ ఆశలకు కేంద్ర ప్రభుత్వం ముగింపు పలికింది. ఈ సంస్థపై తన పెట్టుబడుల ఉపసంహరణపై కేంద్రం దృఢంగా ఉంది. హెచ్‌ఐఎల్‌ను మూసివేయాలని నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు న్యూఢిల్లీలోని కంపెనీ ప్రధాన కార్యాలయం మంగళవారం ఒక ఉత్తర్వు జారీ చేసింది. హెచ్‌ఐఎల్‌ అన్ని ప్లాంట్ల కార్యకలాపాలను మూసివేయడానికి బోర్డు (డైరెక్టర్లు) ఆమోదం తెలిపిందని ఉత్తర్వుల్లో పేర్కొంది. దీంతో కేరళలోని ఉద్యోగమండల్‌, పంజాబ్‌లోని బటిండా వద్ద న్న హెచ్‌ఐఎల్‌ యూనిట్లు మూతపడ్డాయి. హెచ్‌ఐఎల్‌ అనేది కేరళలోని మొట్టమొదటి కేంద్ర ప్రభుత్వ రంగ యూనిట్‌. 1958 ఏప్రిల్‌ 24న స్థాపించారు. అప్పటి నుంచి 2015 వరకూ లాభాల్లో నడిచింది. రెండేళ్ల క్రితమే ఇక్కడ ఉత్పత్తిని నిలిపివేశారు. ఉపసంహరణలో భాగంగా 25 మంది ఉద్యోగులను మహారాష్ట్రలోని రసాయని యూనిట్‌కు బదలీ చేశారు. ఈ సంస్థను కేరళ ప్రభుత్వం టేకోవర్‌ చేసుకోవడానికి లేదా దీనిలో ఉద్యోగులను ఫెర్టిలైజర్స్‌ అండ్‌ కెమికల్‌ ట్రావెన్‌కోర్‌(ఎఫ్‌ఎసిటి)లోకి పంపించడానికి చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయి. హెచ్‌ఐఎల్‌ను మూసివేయడంతో 45 మంది ఉద్యోగుల భవిష్యత్‌ అంధకారంలో పడింది. ఉద్యోగులకు ఇప్పటికే ఒక ఏడాది నుంచి జీతాలు చెల్లించడం లేదు. పదవీ విరమణ చేసిన ఉద్యోగులకు గ్రాట్యుటీ ఇతర ప్రయోజనాలు లభించలేదు.