వారాల ఆనంద్… పరిచయం అక్కరలేని తెలుగు కవి, సమాంతర సినిమా రచయిత, అనువాదకులు. 2023 సంవత్సరానికి గాను అనువాద రంగంలో ప్రతిష్టాత్మక కేంద్ర సాహిత్య అకాడమి పురస్కారం అందుకున్న కరీంనగర్ బిడ్డ. ‘లేంబాళ వాటిక’గా ఖ్యాతి చెందిన పంపకవి నేల వేములవాడలో ఆగస్టు 21, 1958న వారాల ఆనంద్ పుట్టారు. శ్రీమతి వారాల రాధ – శ్రీ అంజయ్య ఆనంద్ అమ్మా నాన్నలు. ఆనంద్ వేములవాడలో అమ్మమ్మ ఇంటిలో పుట్టారు. జిల్లా కేంద్రమైన కరీంనగర్‌లో పెరిగారు. తెలుగు సాహిత్యం, ఫిలాసఫీల్లో ఎం.ఎ., గ్రంథాలయ విజ్ఞానంలో ఎం.ఎం.ఐ.సి, ఎం.ఫిల్‌లు పూర్తిచేశారు. శ్రీరాజరాజేశ్వర డిగ్రీ అండ్ పి.జి. కళాశాలలో లైబ్రరియన్‌గా పనిచేసి పదవీవిరమణ పొందారు.
దాదాపు నాలుగు దశాబ్దాలు ఫిలిం సొసైటి ఉద్యమంతో మమేకమైన వారాల ఆనంద్ జాతీయ స్థాయిలో బాధ్యతలు నిర్వహించారు. కరీంనగర్ ఫిలిం సొసైటి మొదలు దక్షణ భారత ఫిలిం సొసైటి వరకు వివిధ పదవుల్లో సేవలందించారు. వివిధ సమయ సందర్భాలు, నటుల ప్రత్యేక సందర్భాలలో ఫిలిం ఫెస్టివల్స్ నిర్వహించారు. పిల్లల కోసం అనేక సంవత్సరాలు ఫిలిం ఫెస్టివల్స్ నిర్వహించిన వారాల ఆనంద్ అనేక బాలల చిత్రోత్సవాలు నిర్వహించారు. అంతర్జాతీయ బాలల చిత్రోత్సవాలకు జ్యూరీగా వ్యవహరించారు. వారాల ఆనంద్ ప్రాయికంగా కవి. అటుతరువాత సమాంతర సినిమాలో భాగం, విమర్శకుడు, అనువాదకుడు. కళాశాల దశలోనే తన మిత్రులతో కలిసి కవిత్వం తెచ్చిన ఆనంద్ ‘లయ’, ‘మానేరు తీరం’, ‘మనిషి లోపల’, ‘అక్షరాల చెలిమె’, ‘ముక్తకాలు’, ‘సొంత ఊరు’ కవితా సంపుటాలు. అనువాదకులుగా గుల్జార్ ‘గ్రీన్ పోయెమ్స్’ను ‘ఆకుపచ్చని కవితలు’గా తెలుగులోకి తెచ్చారు. దీనికి సాహిత్య అకాడమి అనువాద పురస్కారం లభించింది. ‘ఇరుగు పొరుగు’ పేరుతో ఇతర భాషల్లోని కవితలను అనువాదం చేశారు. ‘మెరుపు’, ‘మానేరు గల గల’ ఆనంద్ విమర్శ పుస్తకాలు. ఇటీవల వచ్చిన పుస్తకం ‘యాదోంకి బారాత్’. ఇవేకాక తెలంగాణ తేజోమూర్తులు ‘మిద్దె రాములు’, ‘పైడి జైరాజ్’ల మోనోగ్రాఫ్‌లను రాశారు. వారాల ఆనంద్ సినీ విమర్శకుడు, సమాంతర సినిమాతో కలిసినడిచిన బాటసారి. సినిమాకు సంబంధించి ఆనంద్ రాసిన ‘నవ్యచిత్ర వైతాళికులు’, ‘సినీ సుమాలు’, ’24 ఫ్రేమ్స్’ సినీమా వ్యాసాలు, ‘బంగారు తెలంగాణలో చలన చిత్రం’, ‘తెలంగాణ సినిమా దశ, దిశ’ వీరి ప్రసిద్ధ సినీ విమర్శ రచనలు. ‘తెలంగాణ సాహితీ మూర్తులు’ పేరుతో ఆనంద్ రూపొందించిన ‘ముద్దసాని రాంరెడ్డి’, ‘యాది సదాశివ’, ‘శివ పార్వతులు’, ‘లాంగ్ బ్యాటల్ విత్ షార్ట్ మెసేజెస్’, ‘ఎ రే ఆఫ్ హౌప్’, ‘కఫిసొ’ ఎ సగా ఆఫ్ ఫిల్మ్ లవర్స్’ మొదలైనవి వారాల ఆనంద్ రూపొందించిన డాక్యుమెంటరీ చిత్రాలు. సదాశివ, రాంరెడ్డి డాక్యుమెంటరీలు తెలంగాణ సాహితీ మూర్తులపై జరిగిన పనుల్లో గొప్పవి. తెలుగు విశ్వవిద్యాలయం కీర్తి పురస్కారం, రుద్ర రవి స్మారక పురస్కారం, తెలంగాణ సాహిత్య అకాడమి విశిష్ట పురస్కారం వంటివి వీరు అందుకున్న పురస్కారాల్లో ఉన్నాయి.
కవిత్వం నుండి ‘కఫిసొ’ వరకు తనదైన భూమికను పోషించిన వారాల ఆనంద్ బాల సాహితీవేత్త కూడా. 1998 ప్రాంతంలోనే బాలల కోసం అనేక కథలు రాశారు. ఆనాటి ఆంధ్రప్రభ వార పత్రికలో వీరి బాలల కథలు అచ్చయ్యాయి. ఇవేకాక ఆనంద్ పిల్లల సినిమాను పిల్లల నేపథ్యంలో పిల్లల కోసం విశ్లేషణ చేసి ‘బాలల చిత్రాలు’, ‘చిల్డ్రన్స్ సినిమా’ పుస్తకాలు రాశారు. ఇటీవల తన మనవడి కోసం రాసిన చిన్నారి కవితలు ‘చిన్నూగాడి ముక్తకాలు’. ‘బాలల చిత్రాలు’ పుస్తకంలో రచయిత బాలల చిత్రాల ఆవశ్యకతతో పాటు బాలల మానసిక ఉపశమనం మొదలు అనేక విధాల్లో బాలలకు దోహదం చేసిన సినిమాలను ఇందులో చర్చించారు. ‘బేబీస్ బ్రేక్‌ఫాస్ట్’ సినిమా మొదలు రవీంద్రనాథ్ ఠాగూర్ ‘పోస్టాఫీస్’, సత్యజిత్ రే, సందీప్ రే సినిమాల వరకు ఇందులో ఉన్నాయి. ఆనంద్ పిల్లల కోసం రాసిన అనేక కథల్లో ‘కష్టేఫలి’ చక్కని కథ. యిది విద్యార్థులు కష్టపడి చవివేందుకు వాళ్ల సంధ్య టీచర్ వారిని ఎలా ప్రేరేపించిందో తెలిపే కథ. పిల్లలకు ఒక విషయం చెబుతూ దాని ద్వారా మరో మంచి విషయం వైపుకు వారిని ఎలా మళ్లించాలో కూడా ఈ కథ తెలుపుతుంది. పిల్లల మనస్తత్వాన్ని, వాళ్లలోని సృజన శక్తిని గురించి చెప్పిన మరో కథ ‘అనగ అనగ రాగం’ కథ, ఇది 1990లో అచ్చయ్యింది. పిక్నిక్‌కు వెళ్లిన బడి పిల్లలలోని వైవిధ్య భరితమైన ప్రజ్ఞను, వారి చూపును గురించి ఈ కథలో ఆనంద్ చెబుతారు. ‘ఎప్పటిపని అప్పుడే’ కథలో ఉదాహరణలతో సంధ్య టీచర్‌తో సమయం విలువను గురించి వారాల ఆనంద్ చెప్పిన విధానం బాగుంది. రామయ్య-సోమయ్యల పాత్రల నేపథ్యంగా సాగిన ఈ కథలో రచయిత ఏ సమయంలో ఏపని చేయాలో, చేయకుంటే ఏమవుతుందో చెబుతాడు.
‘కష్టమే ఇష్టం’ కథ కూడా ఇంచు మించు ఇదే ప్రాంతంలో అచ్చయిన పిల్లల కథ. ‘కష్టేఫలి’లో పిల్లలకు సంధ్య టీచర్ తమకు తాము పిల్లలు స్వీయరక్షణతో పాటు కష్టపడి చదివితే ఎలాంటి ఫలితాలు వస్తాయో చెప్పడం చూడొచ్చు. ఈయన కథలు అన్నింటిలో ప్రధాన పాత్ర పిల్లల ‘సంధ్య’ టీచర్. ఆమె నేపథ్యంగానే వారాల ఆనంద్ నడుస్తాయి. ఆనంద్ పిల్లల కోసం తొంభయ్యవ దశకం నుండే అనేక కథలు రాసినప్పటికీ కొన్ని మాత్రమే ఇప్పుడు లభ్యమవుతున్నాయి. ఇటీవల తన మనవడి కోసం ఈయన రాసిన పద్యాలు కూడా పిల్లలకు సంబంధించినవే, పిల్లలకు నచ్చేవి… వాళ్లు మెచ్చేవిగా ఉంటాయి. ఇవేకాక పిల్లల సినిమా గురించి, పిల్లల సినిమా పండుగల గురించి చక్కని వ్యాసాలు రాశారు. బాలల నేస్తం వారాల ఆనంద్‌కు దిల్‌సే ముబారక్‌బాద్! జయహౌ! బాల సాహిత్యం.
– డా|| పత్తిపాక మోహన్
9966229548