ఓరుగల్లు ఖిల్లా మీద బాలల కథల మౌళి

A collection of children's stories about Orugallu Qillaఇటీవల బాలల సాహిత్యం తెలుగు నేల మీద అన్ని ప్రాంతల్లో విరివిగా వస్తోంది. కథలు, కవిత్వం, గేయం, వచన రచనలు మొదలు అనేక లఘు ప్రక్రియల్లో సైతం మన బాల సాహితీవేత్తలు, బాల రచయితలు చక్కని ప్రతిభను కనబరుస్తున్నారు. ఆ కోవలోనే కాకతీయుల కదన, కవన క్షేత్రం ఓరుగల్లు జిల్లా నుండి బాల సాహితీవేత్తగా పరిచయమైన వారు దండ్రె రాజమౌళి.
కవి, కథారచయిత, బాల సాహితీవేత్త దండ్రె రాజమౌళి 1 జనవరి, 1973న వరంగల్‌ జిల్లా దామెర మండలంలోని ల్యాదల్ల గ్రామంలో పుట్టారు. తల్లిదండ్రులు శ్రీమతి దండ్రె ఎల్లమ్మ – శ్రీ కట్టయ్య. బి.ఎస్సీ., ఎం.ఎ., బి.ఎడ్‌ చదివి ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయునిగా పనిచేస్తున్నారు. కవిత్వం, కథలతో పాటు బాలల రచనలు చేస్తున్న రాజమౌళి తాను పని చేసిన ప్రతిచోటా పిల్లల్లో బాల సాహిత్యం పట్ల ఆసక్తిని కలిగించడమేకాక తన కథలతో పిల్లలకు బాల సాహిత్యాన్ని పరిచయం చేశారు. రచయితగా విలక్షణ వ్యక్తీకరణతో రాసిన దీర్ఘ కవిత ‘అంబేద్కర్‌ ఓ అగ్ని ప్రవాహం’. శీర్షికలోనే ఈ దీర్ఘకవిత లోని అభివ్యక్తి, ఆలోచన వ్యక్తమవుతుంది. మరో పుస్తకం ‘తెలంగాణ సామెతలు -జాతీయాలు’, ఇది తన ప్రాంతం, భాష పట్ల రాజమౌళికి ఉన్న పాయిరానికి నిదర్శనం. పై రెండు పుస్తకాలతో పాటు తొమ్మిది తెలంగాణ సంకలనాలను తీసుకువచ్చారు కూడా. ఆకాశవాణి వరంగల్‌ ద్వారా రాజమౌళి కవితలు నూరుకు పైగా ప్రసారమయ్యాయి. కథానికలు వినిపించారు, వివిధ అంశాలపై, ప్రత్యేక సందర్బాల్లో వ్యాసాలు ప్రసారమయ్యాయి. గేయ రచయితగా కూడా రాజమౌళిది అందెవేసిన చేయి. అనేక గేయాలు రచించి పలు సందర్భాల్లో వాటిని ఆడియో, వీడియోలుగా వెలువరించారు. వాటిలో తెలంగాణ మట్టి పాటలు, పార్వతి తనయుడా, సమ్మక్క-సారక్క, షిరిడి సాయి పాటల పల్లకి ఆడియో వంటివి ప్రసిద్దాలు. వరంగల్‌ రచయితల సంఘం ప్రధాన కార్యదర్శిగా వున్న వీరు బాల చెలిమి కార్యక్రమాల ఉమ్మడి వరంగల్‌ జిల్లా కన్వీనర్‌గా వ్యవహరించారు. తెలంగాణ జంగ్‌ ఉద్యమ బులెటిన్‌, మా వూరి పెద్ద దర్వాజా, ఇంద్రవెల్లి, మోటబొక్కెన, అనుగర్ర సంకలనాలకు కూడా ఈయన సంపాదకులుగా వ్యవహరించారు. తెలంగాణ త్రైమాసిక పత్రికకు సంపాదకత్వం కూడా నిర్వహించారు.
కవిగా, రచయితగా, బాల సాహితీవేత్తగా అనేక సత్కారాలు, గౌరవాలు అందుకున్న రాజమౌళి 2015లో వరంగల్‌ జిల్లా ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారం అందుకున్నారు. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ ఉత్తమ సాహితీవేత్తగా నగదు పురస్కారం అందుకున్నారు. బతుకమ్మ పురస్కారం, సహస్ర కవిమిత్ర సత్కారం, కృషి కవితా పురస్కారం, సాహితీ సేవా మిత్ర పురస్కారం వంటివి వీరు అందుకున్నారు.
బాల సాహితీవేత్తగా రాజమౌళి తొలి పుస్తకం ‘తగిన శాస్తి’ పిల్లల కథల పుస్తకం. ఇందులో పంతొమ్మిది కథలున్నాయి. చక్కని జానపద శైలిలో రాసిన రాజమౌళి ప్రతి కథలో పిల్లలకు ఒక విషయాన్ని లేదా సందేశాన్ని, నీతిని అందించే దిశగా ఉంటాయి. చందమామ శైలిలో సాగినా ఆధునికత ఈ కథల సొంతం. ‘చెరపకురా చెడేవు’ కథ చిన్న పొరపాటు ఎంతటి అనర్థాన్ని కలిగిస్తుందో ఉదాహరణగా పిల్లలకు తెలిపేందుకు తోడ్పడుతుంది. ‘కలిసివుంటే కలదు సుఖం’ కూడా ఈ కోవలోనిదే. మనుషులు, జంతువుల పాత్రలతో సాగే కథ ఇది. సందేశంతో పాటు చక్కని నీతి కూడా ఈ కథలో మనం చూడవచ్చు. ‘మొదటికే మోసం కథ’ స్వార్థపరత్వం అనర్థమని చెబుతూ, సమన్వయం అన్నతమ్యుల మద్యైనా, ఇతరుల మధ్యైనా లేకుంటే జరిగే దానిని చక్కగా చెబుతుంది. ‘తగినశాస్రి’ కథ కూడా జానపద శైలిలో సాగిన మంచి కథ. చుట్టపు చూపుగా వచ్చి, ఇంట్లో తిష్ట వేసిన నలుగురు బంధువుల్లాంటి రాబంధువులను రత్నాకరుడు ఎలా వదిలించుకున్నాడో చెబుతాడీ కథలో రాజమౌళి. తాను చేపట్టిన ప్రతి వస్తువును తనదైన శైలిలో కొత్తగా రాయడం రాజమౌళి కథల్లో చూడవచ్చు. ఈ కోవలోనే ఇందులోని ‘నక్క తపస్సు, బుద్ధిబలం, మోసపోయిన సింహం, దేవుని ఉనికి, భూతదయ, తృప్తి, తల్లి ఆరాటం, జీమూత వాహనుడు, దురాశకు పోతే, కొండనాలుకకు మందు వేస్తే’ వంటివి ఇందులో ఉన్నాయి. వృత్తిరీత్యా ఉపాధ్యాయునిగా, ప్రవృత్తిరీత్యా బాల సాహిత్యకారునిగా, పాటల రచయితగా రాజమౌళి ముప్పేటలుగా తనదైన ప్రతిభతో రాణిస్తున్నారు. తెలుగు బాల సాహిత్యాకాశంలోకి కాకతీయుల నేల నుండి చక్కని కథల సంపుటిని అందించిన రాజమౌళికి అభినందనలు. మరిన్ని చక్కని కథలు రావాలని కోరుతూ… జయహో బాల సాహిత్యం.

– డా|| పత్తిపాక మోహన్‌, 9966229548