‘నేను మొదటిసారి తల్లి పాత్ర పోషించాను. ఇది నాకు ఛాలెంజింగ్‌గా అనిపించింది. నా చిన్నప్పుడు మా అమ్మ ఎలా ఉండేదో తెలుసుకొని, అందుకు తగ్గట్టుగా పాత్రలో ఒదిగిపోయాను. ఇందులో నేను పోషించిన సుమతి పాత్ర ప్రేక్షకులకు మరింత చేరువవుతుందనే నమ్మకం ఉంది’ అని కథానాయిక మీనాక్ష చౌదరి అన్నారు. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ ‘లక్కీ భాస్కర్’ అనే మరో వైవిధ్యమైన చిత్రంతో అలరించడానికి సిద్ధమైంది. దుల్కర్ సల్మాన్ హీరోగా నటించిన ఈ చిత్రానికి వెంకీ అట్లూరి దర్శకత్వం వహించారు. మీనాక్షి చౌదరి కథానాయిక. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చూన్‌ఫోర్ సినిమాస్ పతాకాలపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మించారు. దీపావళి కానుకగా ఈనెల 31వ తేదీన ప్రపంచవ్యాప్తంగా భారీ స్థాయిలో విడుదల కానుంది. ఈ నేపథ్యంలో కథానాయిక మీనాక్షి చౌదరి చిత్ర విశేషాలను మీడియాతో షేర్ చేసుకున్నారు. ‘గుంటూరు కారం’ తర్వాత సితార బ్యానర్‌లో ఇది నా రెండో సినిమా. దుల్కర్ సల్మాన్, వెంకీ అట్లూరితో కలిసి పని చేయటం మంచి అనుభూతినిచ్చింది. బ్యాంకింగ్ నేపథ్యంలో కొన్ని సిరీస్‌లు వచ్చాయి. కానీ కుటుంబ భావోద్వేగాలను ముడిపెడుతూ వెంకీ అట్లూరి ఈ కథ రాసిన విధానం నాకు బాగా నచ్చింది. ఎమోషన్స్‌తో కూడిన ఒక బ్యూటీఫుల్ జర్నీ ఈ మూవీ. అలాగే నా పాత్ర కూడా బాగా నచ్చింది. డబ్బు కారణంగా మధ్యతరగతి మనిషి జీవితంలో, అతని కుటుంబంలో ఎలాంటి మార్పులు వచ్చాయనే దాని చుట్టూ ఈ కథ తిరుగుతుంది. భాస్కర్ దగ్గర ఏమీ లేనప్పుడు తనని తనగా ఇష్టపడుతుంది సుమతి. ప్రేమను పంచే కుటుంబం, బతకడానికి అవసరమైనంత డబ్బు ఉంటే చాలు అనుకునే స్వభావం తనది. అయితే దురాశ, డబ్బు కారణంగా భాస్కర్-సుమతి మధ్య ఏం జరిగింది అనేది సినిమాలో ఆసక్తికరంగా ఉంటుంది. ఈ సినిమాతో నాకు నటిగా మంచి గుర్తింపు వస్తుందని, మరిన్ని మంచి కథలు వస్తాయని భావిస్తున్నాను. ఇందులో ఎమోషన్స్ బాగుంటాయి. ఫ్యామిలీ ఎలిమెంట్స్ ఉంటాయి. చూసిన ప్రతి ఒక్కరికీ కనెక్ట్ అవుతుంది. ఇదొక కామన్ మ్యాన్ కథ. అందరికీ నచ్చుతుంది. నేను నటించిన ‘మట్కా, మెకానిక్ రాకీ’ విడుదలకు సిద్ధమవుతున్నాయి. వెంకటేష్, అనిల్ రావిపూడి సినిమాలో నటిస్తున్నాను. మరికొన్ని చర్చల దశలో ఉన్నాయి.