శక్తివంతమైన భావోద్వేగాల సమాహారం

పవన్‌ కళ్యాణ్‌, సాయిధరమ్‌ తేజ్‌ కాంబినేషన్‌లో సముద్రఖని దర్శకత్వం వహించిన చిత్రం ‘బ్రో’. పీపుల్‌ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై టీజీ విశ్వప్రసాద్‌ నిర్మిస్తున్న ఈ చిత్రానికి వివేక్‌ కూచిబొట్ల సహనిర్మాతగా వ్యవహరిస్తున్నారు. త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌ స్క్రీన్‌ ప్లే, డైలాగ్స్‌ అందించారు. కేతిక శర్మ, ప్రియా ప్రకాష్‌ వారియర్‌ నటించిన ఈ సినిమా ఈనెల 28న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో నిర్మాత టీజీ విశ్వప్రసాద్‌ మీడియాతో ముచ్చటించారు..
పవర్‌స్టార్‌ రాకతో పెరిగిన సినిమా స్థాయి..
మేం ఒక మంచి ప్రాజెక్ట్‌ కోసం ఎదురు చూస్తున్న సమయంలో త్రివిక్రమ్‌ తమిళంలో ‘వినోదయ సితం’ చిత్రాన్ని చూసి తెలుగులో చేస్తే బాగుంటుందని సూచించారు. అలా ఈ ‘బ్రో’ ప్రాజెక్ట్‌ స్టార్ట్‌ అయ్యింది. మాతకతో పోలిస్తే ఇది భారీగా ఉంటుంది. కథలోని ఆత్మ అలాగే ఉంటుంది. కానీ స్క్రీన్‌ ప్లే పరంగా, కమర్షియల్‌ ఎలిమెంట్స్‌ పరంగా కొత్తగా ఉంటుంది. బలమైన ఫ్యామిలీ ఎమోషన్స్‌తో పాటు, కమర్షియల్‌ ఎలిమెంట్స్‌ ఉంటాయి. సందేశం ఉంటుంది కానీ పూర్తి సందేశాత్మక చిత్రం కాదు. మాతక చూసిన వారికి కూడా ఈ సినిమా కొత్త అనుభూతిని ఇస్తుంది. దర్శకుడు సముద్రఖని తమిళంలోనూ ఈ సినిమాని చాలా చక్కగా తీశారు. అయితే ఇక్కడ పవన్‌ కళ్యాణ్‌ రాకతో సినిమా స్థాయి ఎన్నో రెట్లు పెరిగింది. పవన్‌ కళ్యాణ్‌, సాయి తేజ్‌ పాత్రలు ప్రేక్షకులను హత్తుకుంటాయి.
టికెట్‌ రేట్లు పెంచే ఆలోచన లేదు
టికెట్‌ ధరలు పెంచే ఆలోచన లేదు. టికెట్‌ ధరలు పెంచాలని మేము రెండు రాష్ట్ర ప్రభుత్వాలని కోరలేదు. ఇప్పుడున్న ధరలతోనే విడుదల చేయాలనుకుంటున్నాం. అలాగే ప్రీమియర్‌ షోలు వేసే ఆలోచన కూడా ఇప్పటికి లేదు. అయితే అభిమానుల నుంచి ఒత్తిడి వస్తే చెప్పలేం. అప్పటి పరిస్థితులను బట్టి ప్రీమియర్‌ షోలపై నిర్ణయం తీసుకుంటాం. సినిమా అవుట్‌ఫుట్‌ పట్ల, బిజినెస్‌ పరంగా మేం చాలా సంతృప్తిగా ఉన్నాం. ఈ సినిమా మీద ఉన్న నమ్మకంతో మేమే సొంతంగా విడుదల చేయాలని ఓవర్సీస్‌ హక్కులను ఎవరికీ ఇవ్వలేదు.
చిరంజీవితో సినిమా చేయాలనేది డ్రీమ్‌
వేేగంగా వంద సినిమాలు నిర్మించాలనేది మా లక్ష్యం. ‘బ్రో’ అనేది మా 25వ సినియా. ప్రస్తుతం 15-20 సినిమాలు నిర్మాణ దశలో ఉన్నాయి. అలాగే ఓటీటీ సినిమాలు కూడా చేయబోతున్నాం. బాలీవుడ్‌లోనూ సినిమాలు చేసే ఆలోచనలు ఉన్నాయి. త్వరలోనే ముంబైలో ఆఫీస్‌ ఓపెన్‌ చేయాలని అనుకుంటున్నాం. ప్రభాస్‌ లాంటి స్టార్‌తో సినిమా చేస్తున్నప్పటికీ ఇంతవరకు ఎందుకు అధికారికంగా ప్రకటించలేదని చాలా మంది అడుగుతున్నారు. ప్రతి సినిమాకి ఒక స్ట్రాటజీ ఉంటుంది. టైం వచ్చినప్పుడు వాటి గురించి ఖచ్చితంగా చెప్తాం. మా సంస్థలో అందరి హీరోలతో సినిమాలు చేయాలని ఉంది. ఆ దిశగానే అడుగులు సాగుతున్నాయి. అయితే నా డ్రీమ్‌ హీరో మాత్రం చిరంజీవి. చిన్నప్పటి నుంచి నేను ఆయనకు వీరాభిమానిని. ఆయనతో సినిమా చేయడం నాకు ప్రత్యేకంగా ఉంటుంది.