– జిల్లా జడ్జి ఎంవీ.రమేష్ బాబు
నవతెలంగాణ-ఆసిఫాబాద్
జిల్లాలో డ్రగ్స్, మాదకద్రవ్యాల నివారణపై సమిష్టిగా కృషి చేద్దామని జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఎంవీ. రమేష్ బాబు అన్నారు. బుధవారం జిల్లా మహిళ, శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన నషా ముక్త్ భారత్ అభియాన్ కార్యక్రమంలో కలెక్టర్ వెంకటేష్ ధోత్రే, జిల్లా సీనియర్ సివిల్ జడ్జీ కమ్ అసిస్టెంట్ సెషన్స్ జడ్జీ, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి యువరాజతో కలిసి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థులు, యువత భవిష్యత్తుపై మాదకద్రవ్యాల ప్రభావాన్ని నియంత్రించాలని, గుట్కా, సిగరెట్, ఆల్కహాల్, గంజాయి, ఇతర డ్రగ్స్ తీసుకోవడం వలన ఎన్నో కుటుంబాలు రోడ్డున పడ్డాయని, వీటికి బానిసలైన వారు క్షణికావేశంలో అనాలోచిత పరిస్థితులలో నేరాలకు పాల్పడుతూ శిక్షలు అనుభవిస్తున్నారన్నారు. ఆసిఫాబాద్ లాంటి మారుమూల జిల్లాలో సాంకేతికతను ఉపయోగించి మోసాలకు పాల్పడుతున్నారని అన్నారు. ఈ చర్యలపై గ్రామాలలో అవగాహన కార్యక్రమాల ద్వారా ప్రజలను చైతన్యవంతులను చేయాలన్నారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ మాదకద్రవ్యాల అలవాటుకు దూరంగా ఉండాలని, మొదట చిన్నగా ప్రారంభించి తర్వాత బానిసలుగా మారుతున్నారన్నారు. వీటిని నియంత్రించేందుకు గ్రామాలలో మహిళా సంఘాలతో సమావేశాలు నిర్వహించడంతో పాటు బ్రహ్మకుమారీల సహకారం తీసుకొని ప్రజలకు అవగాహన కల్పించడం జరుగుతుందని తెలిపారు. ఆసిఫాబాద్, కాగజ్నగర్లలో మద్యానికి బానిసలైన వారి సంక్షేమం కోసం పునరావాస కేంద్రాల ఏర్పాటుకు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపిస్తామని పేర్కొన్నారు. జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ చౌక్ నుండి కలక్టరేట్ వరకు ప్రజాపిత బ్రహ్మకుమారి ఈశ్వరీయ విశ్వవిద్యాలయం ప్రధాన శిక్షకురాలు మనీష అధ్యక్షతన నిర్వహించిన నషా ముక్త్ భారత్ అభియాన్ ర్యాలీని ఆసిఫాబాద్ సీఐ సతీష్ జెండా ఊపి ప్రారంభించారు. కార్యక్రమంలో జిల్లా సంక్షేమ అధికారి భాస్కర్, బార్ అసోసియేషన్ అధ్యక్షుడు రవీందర్, సభ్యులు, బ్రహ్మకుమారిలు పద్మ, విద్యార్థులు, ఉద్యోగులు శాఖల అధికారులు పాల్గొన్నారు.