నవతెలంగాణ – నల్లగొండ కలెక్టరేట్
గ్రామీణ ప్రాంతాల నుండి వచ్చి ప్రభుత్వ పాఠశాలల్లో విద్యనభ్యసిస్తున్న విద్యార్థులందరూ బాగా చదువుకోవాలని ఆయన తపన. ఎందుకంటే తాను సైతం ప్రభుత్వ పాఠశాలలో చదివి ప్రస్తుతం సమాజంలో ఉన్నత స్థానంలో ఉన్నాడు కాబట్టి చదువు విలువ ఆయనకు బాగా తెలుసు. ఆయన మరెవరో కాదు మన నల్గొండ జిల్లా కలెక్టర్ నారాయణరెడ్డి.నిత్యం పరిపాలన వ్యవహారాలలో బిజీగా ఉండే జిల్లా కలెక్టర్ సి. నారాయణరెడ్డి జిల్లాకు వచ్చిన వెంటనే విద్య, వైద్యం పై ప్రత్యేక దృష్టి సారించారు. ఇందులో భాగంగానే తను ఎక్కడ పర్యటనకు వెళ్లినా తప్పనిసరిగా ప్రభుత్వ ఆసుపత్రులను, పాఠశాలలను తనిఖీ చేయడం ఆయన ఆలవాటు చేసుకున్నారు. ఈ క్రమంలో గత నెల 24 న నల్గొండ జిల్లా కేంద్రంలోని బోయవాడలో ఉన్న ప్రభుత్వ పట్టణ రెసిడెన్షియల్ పాఠశాలను ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. అక్కడ చదువుకుంటున్న విద్యార్థులతో మాట్లాడారు. ఆరోజు ఆయన పాఠశాలను సందర్శించినప్పుడు పాఠశాలలో పెచ్చులూడిపోయి, రంగులు వెలిసిపోయి, వైర్లు వేలాడుతూ, కిటికీల పక్కనే ఉన్న ముళ్ల పొదలు, టాయిలెట్ నీరు బయట పారుతు, కిచెన్ సరిగా లేక, క్లాస్ రూమ్ లలో సరైన బెంచీలు, వసతులు లేక, అలాగే విద్యార్థులకు యూనిఫామ్, చదువుకునేందుకు పుస్తకాలు,దుప్పట్లు లేని సమస్యలు దర్శనమిచ్చాయి. అంతేకాక భోజనం సైతం నాణ్యతగా లేక, మెనూ ప్రకారం భోజనం లేక విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలను నేరుగా ఆ రోజు విద్యార్థులే జిల్లా కలెక్టరు దృష్టికి తీసుకువచ్చారు. ఇవన్నీ చూసి చలించిపోయిన జిల్లా కలెక్టర్ తక్షణమే పాఠశాల పరిస్థితులలో మార్పులు రావాలని, పాఠశాలకు మరమ్మతులు చేపట్టాలని, టాయిలెట్లు మరమ్మతులు చేయించడమే కాకుండా, వేలాడుతున్న వైర్లను సరిచేసి ట్యూబ్ లైట్లు,ఫ్యాన్లు ఏర్పాటు చేయించి, కలర్లు వేయించి విద్యార్థులకు సరిపడా భోజనం ఏర్పాటు చేయాలని, బట్టలు, పుస్తకాలు వెంటనే ఇవ్వాలని విద్యాశాఖ అధికారులకు అక్కడికక్కడే ఆదేశాలు జారీ చేశారు. వీటిని అమలు చేయకపోతే చర్యలు తీసుకుంటానని హెచ్చరించారు.
ప్రభుత్వ పాఠశాలలో చదివిన విద్యార్థి అయినందున కలెక్టర్ విద్యార్థుల బాధలను అర్థం చేసుకొని విద్యార్థులకు ఇచ్చిన హామీని నెరవేర్చేందుకు, పాఠశాలను ప్రత్యేకంగా అభివృద్ధి చేయాలని అధికారులకు కాకుండా సిసికి బాధ్యతలను అప్పగించారు.కాగా తాను ఇచ్చిన హామీ ఎంతవరకు అమలు అయ్యిందో తెలుసుకునేందుకు తిరిగి జిల్లా కలెక్టర్ శనివారం బోయవాడ పట్టణ రెసిడెన్షియల్ పాఠశాలను తనిఖీ చేశారు. అయితే గత నెలకి, ఈ నెలకు పాఠశాల రూపు రేఖలు మారిపోయాయి. పాఠశాలలో అడుగుపెట్టినప్పటి నుండి అన్ని వైపులా మార్పు స్పష్టంగా కనిపించింది. మధ్యాహ్న భోజనం సమయంలో తనికి కి వెళ్లిన జిల్లా కలెక్టర్ విద్యార్థులతో భోజనం గురించి ఆరా తీయగా, గతంలో కంటే ఇప్పుడు భోజనం బాగా పెడుతున్నారన్న సమాధానం విద్యార్థుల నుంచి వచ్చింది. అంతే కాక పాఠశాలలోని అన్ని తరగతి గదులు, పై అంతస్తులోని హాలు మరమ్మతులు, వైర్లు సరి చేయించి అన్ని గదులలో ఫ్యాన్లు, ట్యూబ్ లైట్లు, రంగులు వేయించడం, అలాగే టాయిలెట్స్ మరమ్మతులు చేయించి వంటగది శుభ్రంగా ఉండడం గమనించిన జిల్లా కలెక్టర్ సంతృప్తిని వ్యక్తం చేశారు. తాము అడిగిన వెంటనే అన్ని సౌకర్యాలు కల్పించి బాగా చదువుకునేందుకు అవకాశాలు కల్పించిన జిల్లా కలెక్టర్ కు విద్యార్థులు కృతజ్ఞతలు తెలియజేశారు. ఇంకా పాఠశాలలో ఏవైనా మరమ్మతులు చేపట్టాల్సి ఉంటే చేయాలని, విద్యార్థులు చదువుకునేందుకు అన్ని రకాల సౌకర్యాలు ఉండాలని, అప్పుడే వారు బాగా చదువుకుంటారని ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ అన్నారు. అయితే జిల్లాలోని అన్ని ప్రభుత్వ పాఠశాలల పనితీరును మెరుగుపరిచే విధంగా కలెక్టర్ చొరవ తీసుకోవాలని జిల్లాలోని అన్ని వర్గాల నుండి డిమాండ్ వినిపిస్తుంది. ఈ కార్యక్రమంలో కలెక్టర్ వెంట జిల్లా విద్యాశాఖ అధికారి బిక్షపతి సంబంధిత అధికారులు ఉన్నారు.