బాలసదనంను ఆకస్మికంగా తనిఖీ చేసిన కలెక్టర్ 

– మాట్రిన్ సామ్రాజ్యం సస్పెండ్
– సూపరింటెండెంట్ జయ పై ఆగ్రహం
– బాలసదనం పర్యవేక్షకురాలుకి సోకాజ్ నోటీస్ 
– హోం నిర్వహణ పట్ల నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు
– జిల్లా కలెక్టర్ హెచ్చరిక
నవతెలంగాణ – నల్లగొండ కలెక్టరేట్
జిల్లా కలెక్టర్  హరిచందన దాసరి  శనివారం నల్గొండ జిల్లా కేంద్రంలో ఉన్న జిల్లా సంక్షేమ అధికారి ఆధ్వర్యంలో నిర్వహించే  బాలసదనాన్ని ఆకస్మికంగా తనిఖీ చేసి సదనంలోని పిల్లలతో ముఖాముఖి మాట్లాడారు. బాలసదనంలో  సౌకర్యాలు ఎలా ఉన్నాయని, ఏం చదువుతున్నారని, భోజనం ఎలా ఉందని వారి బాగోగులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం బాలసదనం మొత్తం కలియతిరిగి నిర్వహణ సక్రమంగా లేకపోవడంపై హోం సూపరింటెండెంట్ జయ పై ఆగ్రహం వ్యక్తం చేస్తూ షోకాజ్ నోటిస్ జారీ చేయాలని ఆదేశించారు. బాలసదనం నిర్వహణ పట్ల సరైన శ్రద్ధ వహించని మ్యాట్రన్ సామ్రాజ్యాన్ని అప్పటికప్పుడే సస్పెండ్ చేస్తున్నట్టు ప్రకటించారు. బాలసదనం ఔట్సోర్సింగ్ ఉద్యోగులు వారిలో వారు కలహించుకోవడంతోపాటు, బాలసదనం బాగోగులను పట్టించుకోకపోవడంపై  తక్షణమే వారందరినీ సంబంధిత ఏజెన్సీకి సరెండర్ చేయాలని  ఆదేశించారు. 3 రోజుల్లో బాల సధనం మొత్తం పరిశుభ్రంగా ఉంచాలని, లేనట్లయితే  చర్యలు తీసుకుంటామని ఈ సందర్భంగా కలెక్టర్ హెచ్చరించారు.