నేత పోగుల రంగుల కల

కాలం
కూలీ గిట్టని
ఎనకటి పాటే పాడుతున్నది

రాత్రంతా అల్లుకున్న
జరీ అంచు కవిత్వం
ఎవరికీ నచ్చని దుఃఖమయితున్నది

బడిబాట మానేసి
గువ్వల చెన్న గీతం ఎత్తుకుంటే
ఇద్దరు పిల్లలు
ఇద్దరు పెద్దలు
ఎంత చేసినా
ఏ మూల నుండి చూసినా
ఏ రూపమూ అగుపడని ఆనందం
ఏ ఉలితో చెక్కాలి

నలుగురు చుట్టాలు వస్తే
కూరాడు కుండకు నైవేద్యం పెట్టిన అమ్మ
పొద్దు పొద్దున్నే
పొద్దు మీద వాలిన కాకి
కావు కావు మంటుంటే రందివడుతున్నది

ఇంటిదాకా వచ్చిన పరాయీ సైకిల్‌
బతిమాలి
కాంచి తొక్కుడు నేర్చుకున్నట్టు
సందు దొరికితే
సరదాగా జొర్రిన నాయిన మగ్గం
బంకలాగా అంటుకున్నది

మగ్గం
నిత్యం
పెద్ద పాము మింగిన పందెం

పోగుకూ పేగుకూ నడుమ
బిగుసుకున్న ఆకలిముడి
రేపటి వసంతానికి స్వాగతం పలికే
ఎండుకొమ్మల ఎదురుచూపు

సూర్యుని చుట్టూ తిరిగే భూమిలా
అందరూ
మిల్లు బట్టలకు ఎగబడుతూ వుంటే

చీకటి తరువాత వెలుగంటూ
కష్టనష్టాలు దాటితే సుఖమంటూ
ఏదో ఒకనాడు
కన్నీరు పన్నీరు అవుతుందని
కలగంటూ…
– గజ్జెల రామకష్ణ, 8977412795