వైవిధ్యభరిత చిత్రాలకు కేరాఫ్‌గా నిలిచిన సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ ‘లక్కీ భాస్కర్’ అనే మరో డిఫరెంట్ చిత్రంతో అలరించడానికి సిద్ధమైంది. దుల్కర్ సల్మాన్ హీరోగా నటించిన ఈ చిత్రానికి వెంకీ అట్లూరి దర్శకత్వం వహించారు. సితార ఎంటర్‌టైన్ మెంట్స్, ఫార్చూన్‌ఫోర్ సినిమాస్ పతాకాలపై తెరకెక్కిన ఈ చిత్రానికి సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మాతలు. దీపావళి కానుకగా నేడు (గురువారం) ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో నిర్మాత సూర్యదేవర నాగవంశీ మీడియాతో మాట్లాడుతూ,
‘మంచి సినిమా చేశామనే సంతప్తిని కలిగించిన చిత్రమిది. ఈ సినిమాపై ఎంతో నమ్మకంగా ఉన్నాం. అందుకే ప్రీమియర్ షోలు వేశాం. ప్రీమియర్లకు మంచి స్పందన వస్తుండటంతో షోల సంఖ్య కూడా పెంచాం. మనిషి డబ్బు సంపాదించాల నుకున్నప్పుడు ఎంత దూరమైనా వెళ్తాడు అనే కథాంశంతో ఈ చిత్రం రూపొందింది. బ్యాంకింగ్ నేపథ్యంలో థ్రిల్లర్ జోనర్‌లో ఉండే ఫ్యామిలీ సినిమా ఇది. తర్వాత ఏం జరుగుతుందోననే ఆసక్తిని రేకెత్తిస్తూ నడుస్తుంది. ఒక కొత్త ప్రపంచంలోకి వెళ్లినట్టు ఉంటుంది’ అని చెప్పారు.