విరాట్ కర్ణ హీరోగా డైరెక్టర్ శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో రూపొందిన న్యూ ఏజ్ పొలిటికల్ థ్రిల్లర్ ‘పెదకాపు-1’. ‘అఖండ’తో బ్లాక్‌బస్టర్‌ను అందించిన ద్వారకా క్రియేషన్స్‌పై మిర్యాల రవీందర్ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ సినిమా ఈనెల 29న ప్రేక్షకుల ముందుకు వస్తున్న నేపథ్యంలో హీరో విరాట్ కర్ణ మీడియాతో ఈ చిత్ర విశేషాలను షేర్ చేసుకున్నారు. ‘మొదటి నుంచి సినిమాలపై ఆసక్తి ఉంది. కాలేజ్ పూర్తయిన తర్వాత ‘జయ జానకీ నాయక’ చిత్రానికి ప్రొడక్షన్ సైడ్ పని చేశాను. నటనలో సత్యానంద్ దగ్గర శిక్షణ తీసుకున్న తర్వాత ఒక షార్ట్ వీడియో చేసి మా బావకి చూపించాను. అది ఆయనకి చాలా నచ్చింది. ఇందులో యాక్షన్ అంతా నేచురల్‌గా కావాలి. వీధిలో ఒక గొడవ జరిగితే ఎలా ఉంటుందో అంత సహజంగా ఉండాలి. ట్రైలర్‌లో చూస్తే కూడా రా అండ్ రస్టిక్‌గా ఉంటుంది. పీటర్ హెయిన్స్ అద్భుతమైన యాక్షన్ డిజైన్ చేశారు. ఒక సామాన్యుడు అనేక సవాళ్ళని ఎదుర్కొని బలవంతుడితో పోరాడి ఎలా ఎదిగాడనేది పెదకాపు కథ. 1980లో ఎన్టీఆర్ పార్టీ పెట్టినపుడు కూడా అందరూ కొత్తవాళ్ళని తీసుకున్నారు. అలా ఒక సామాన్యుడు ఎదిగిన క్రమాన్ని చూపించడానికి కొత్తవాడైతే బావుంటుందని నన్ను ఎంపిక చేసుకున్నారు. స్క్రీన్ పై నన్ను నేను చూసుకోవడం మాటల్లో చెప్పలేని ఆనందం కలిగింది’ అని చెప్పారు.