కమ్యూనిస్టు యోధుడు సాయుధ పోరాట సేనాని

కమ్యూనిస్టు యోధుడు
సాయుధ పోరాట సేనాని– భూములన్నింటినీ పేదలకు పంచిన త్యాగధనుడు
– ఉరిశిక్ష రద్దుకు పోరాడిన నంద్యాల శ్రీనివాస్‌రెడ్డి
– ఎమ్మెల్యేగా ప్రజాక్షేత్రంలో ఎన్‌ఎస్‌ఆర్‌
– తండ్రి బాటలోనే తనయులు
నైజాం సర్కారును గడగడలాడించి రజాకార్ల తోకలు కత్తిరించిన వీర తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటంలో పాల్గొన్న త్యాగధనులు.. ఆ తర్వాతా ప్రజాక్షేత్రంలో ప్రజల వెంటే నడిచారు. అందులో నంద్యాల శ్రీనివాస్‌రెడ్డి ఒకరు. అజ్ఞాతంలోనూ తన కర్తవ్యాన్ని మరువకుండా.. మరెందరినో నాయకులుగా తీర్చిదిద్దారు. చివరి శ్వాస వరకు కమ్యూనిస్టు యోధునిగా.. ఎన్‌ఎస్‌ఆర్‌గా పేదల గుండెల్లో నిలిచారు.
నవతెలంగాణ- మఠంపల్లి
నల్లగొండ జిల్లా కేతెపల్లి మండలం కొప్పోలు గ్రామంలో 1918లో భూస్వామ్య కుటుంబంలో జన్మించారు నంద్యాల శ్రీనివాస్‌రెడ్డి. ఆయన సూర్యాపేట, వరంగల్‌లో పాఠశాల విద్యనభ్యసించారు. పేదలపై భూస్వాములు, జమీందారులు, జాగీర్దారుల దౌర్జన్యాలకు వ్యతిరేకంగా ఆంధ్రమహాసభలో చేరారు. తమకు చెందిన వందలాది ఎకరాల భూములను పేదలకు పంచారు. కమ్యూనిస్టు ఉద్యమాల్లో పాల్గొన్నారు. నిజాం సర్కార్‌, రజాకార్ల దౌర్జన్యాలను ఎదిరించారు. తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటంలో దళ కమాండర్‌గా పనిచేస్తూ నిజామాబాద్‌, ఖమ్మం, భువనగిరి, వరంగల్‌ ప్రాంతాల్లో పనిచేశారు. ఈ క్రమంలో జైలు జీవితం గడిపారు. 1948 సెప్టెంబర్‌ 17 నిజాం ప్రభుత్వాన్ని భారత ప్రభుత్వంలో విలీనం చేసి నిజాం లొంగిపోయాడు. అనంతరం మిలటరీ సైన్యాలు సాయుధ పోరాట దళాలపై, నాయకులపై దాడు లను ఉధృతం చేశాయి. ఆ పోరాటంలో పాల్గొన్న యోధులకు మిలటరీ ట్రిబ్యునల్‌ ఉరిశిక్ష విధించింది. అందులో ఎన్‌ఎస్‌ఆర్‌తోపాటు నల్లగొండ జిల్లా అప్పాజిపేటకు చెందిన ఎర్రబోతు రామిరెడ్డి, ఉమ్మడి వరంగల్‌ జిల్లా రామానుజాపురానికి చెందిన గార్లపాటి రఘుపతి రెడ్డి, కడవెండికి చెందిన నల్ల నర్సింహులు ఉన్నారు. ట్రిబ్యునల్‌ ఉరిశిక్ష అమలు చేసేందుకు నిర్ణయించడంతో ఎన్‌ఎస్‌ఆర్‌ జైలు నుంచి తప్పించుకొని అజ్ఞాతంలోకి వెళ్లి పోరాటం కొనసాగించారు. వందలాది మందికి సాయుధ శిక్షణ ఇచ్చారు. ఈ కాలంలో జైలుశిక్ష అనుభవిస్తున్న వారిని, ఉరిశిక్ష పడిన వారిని విడుదల చేయాలని తెలంగాణ డిఫెన్స్‌ కమిటీ ఏర్పాటు చేశారు. ఈ విషయం అంతర్జాతీయంగా చర్చనీయాంశం కావడం, మేధావులు స్పందించి, ఇతర దేశాల న్యాయవాదులు ఉరి శిక్ష రద్దు కోసం వాదించడంతో చివరకు సుప్రీం కోర్టు దాన్ని రద్దు చేసింది. అనంతరం 1962 ఎన్నికల్లో నకిరేకల్‌ ఎమ్మెల్యేగా గెలిచి ప్రజాసంక్షేమానికి పాటుపడ్డారు. పార్టీ చీలిక అనంతరం సీపీఐ(ఎం)లో చివరి వరకు పనిచేశారు. పార్టీ నిర్మాణంలో బీఎన్‌, వీఎన్‌, స్వరాజ్యంతో కలిసి పని చేశారు. 1969లో మిర్యాలగూడలో స్థిరపడ్డారు. సాయుధ పోరాటంలో పాల్గొన్న స్వాతంత్య్ర సమర యోధుల పింఛన్‌ దరఖాస్తుల స్క్రీనింగ్‌ కమిటీలో ఎన్‌ఎస్‌ఆర్‌ మెంబర్‌గా ఉన్నారు. ఎంతో మందికి పింఛన్‌ ఇప్పించి వారి కుటుంబాలను ఆదుకు న్నారు. కడవరకు ఎర్రజెండాను విడువని ఎన్‌ఎస్‌ఆర్‌ 101 ఏండ్ల వయసులో 20 ఫిబ్రవరి 2019లో కన్నుమూశారు.
కుటుంబ నేపథ్యం
ఎన్‌ఎస్‌ఆర్‌కు నలుగురు కుమారులు హరీందర్‌రెడ్డి, వేణుధర్‌ రెడ్డి, కృపాకర్‌ రెడ్డి, అశోక్‌ రెడ్డి, కూతురు విద్య ఉన్నారు. వేణుధర్‌ రెడ్డి, కృపాకర్‌ రెడ్డి తండ్రి బాటలో నడుస్తూ సీపీఐ(ఎం)లోనే పనిచేస్తున్నారు.