పరిశోధకులకు దిక్సూచి

A compass for researchersచరిత్ర సృష్టించడమే కాదు… దాన్ని భద్రంగా దాచిపెట్టవలసిన అవసరం కూడా ఉంది. ఎందుకంటే ముందు తరానికి గుణపాఠం నేర్పుతుంది. తొవ్వ చూపిస్తుంది గనుక. అలాగే సాహిత్యం కూడా అంతే. మంచి బాల సాహిత్యం రికార్డు చేయబడాలే. ముఖ్యంగా బాల సాహిత్య సజన కారులను భవిష్యత్తు తరాలకు అందించ గలగాలే. ఈ ఉద్దేశంతోనే ప్రముఖ బాల సాహితీవేత్త కీర్తిశేషులు రెడ్డి రాఘవయ్య గారు తొట్ట తొలుతగా తొలి తరం నుండి 80వ దశకం వరకు పనిచేసిన బాల సాహిత్యకారుల పరిచయాలతో కూడిన పుస్తకాన్ని వెలువరించారు. ఇది ఎంతగానో ఉపయోగకరంగా ఉంది. అలాగే కొద్దీ కాలం క్రితమే ప్రముఖ బాలసాహితీవేత్త పైడిమర్రి రామకష్ణ వందమందికి పైగా బాలసాహితీ వేత్తల పరిచయాలతో కూడిన ‘బాల సాహితీ శిల్పులు’ అనే పేరుతో పుస్తకం తెచ్చారు. ఇది కూడా అందరి అభినందనలు అందుకున్నది. అదేవిధంగా ప్రముఖ బాలసాహితీవేత్త చొక్కాపు వెంకటరమణ కూడా తొలి తరం బాలసాహితీవేత్తల పరిచయాలతో కూడిన తెలుగు అకాడమీ పుస్తకం రాశారు. ఇట్లా ఎవరో ఒకరు ఏదో ఒక చోట నుండి బాల సాహితీ వేత్తలను భద్రపరిచి భవిష్యత్తుకు అందించే రికార్డు చేయడం గొప్ప విషయం. ఇదే కోవలో సిద్దిపేటకు చెందిన పెందోట వెంకటేశ్వర్లు ”బాల సాహిత్య సృజన కారులు’ అనే పేరుతో ఒక పుస్తకాన్ని ఇటీవలనే వెలువరించారు.
ప్రచారాలకు, ఆర్భాటాలకు ఏమాత్రం తావివ్వని పెందోట వెంకటేశ్వర్లు రాసిన ఈ పుస్తకంలో నాలుగు తరాలకు చెందిన 141 మంది బాలసాహిత్య సజన కారులను సంక్షిప్తంగా పరిచయం చేశారు. ఎక్కడెక్కడో ఉన్న పరిచయము లేని సాహితీవేత్తలందర్నీ ఒక్కచోట చేర్చడం అభినందనీయం. సమాజానికి పరిచయం చేయడం వెలకట్టలేనిది. ఇందులో జన్మ తేది అనుసరించి నెలల వారిగా ఫొటోతో సహా మొబైల్‌ నెంబరు, నివసిస్తున్న చిరునామా, రాసిన పుస్తకాలు, సాధించిన విజయాలు, వృత్తి ప్రవృత్తి మొదలైన విషయాలతో పాటు మెయిల్‌ అడ్రస్‌ ని కూడా పొందుపరచడం జరిగింది.
రాబోవు కాలంలో బాల సాహిత్యం పై పరిశోధన చేసే పరిశోధకులకు ఇది ఒక కరదీపిక కాగలదు. అదేవిధంగా ప్రముఖ బాల సాహితీవేత్త డాక్టర్‌ పత్తిపాక మోహన్‌ కూడా త్వరలో వెలువరించనున్న ”తెలంగాణ బాల సాహిత్య చరిత్ర” పుస్తకం కూడా పరిశోధక సమాజానికి తల మానికం కాగలదని ఆశిద్దాం. బాల సాహిత్య సజన కారులు పుస్తకాన్ని అందించిన బాల సాహిత్య పూదోట పెందోటను హదయపూర్వకంగా అభినందిద్దాం.
– కోమటిరెడ్డి బుచ్చిరెడ్డి, 9441561655