రాజీ కుదిరింది..

 A compromise was reached..– సీఎం..గవర్నర్‌ మధ్య సయోధ్య
– సచివాలయంలో గవర్నర్‌కు ఘన సన్మానం
– రాజ్‌భవన్‌లో కేసీఆర్‌కు తేనీటి విందు
– ప్రగతి భవన్‌, రాజ్‌ భవన్‌కు మధ్య తగ్గిన దూరం
– ఇక బిల్లులన్నింటికీ గ్రీన్‌ సిగల్‌…?
– రాజకీయ పరిణామాల్లో భాగమేనంటున్న విశ్లేషకులు
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
నిన్నటిదాకా ఉప్పూ.. నిప్పూగా ఉన్న ప్రగతి భవన్‌.. రాజ్‌భవన్‌లలో అకస్మాత్తుగా సీన్‌ మారిపోయింది. దాదాపు రెండేండ్లపాటు ఎడమొఖం.. పెడమొఖంగా ఉన్న సీఎం కేసీఆర్‌, గవర్నర్‌ తమిళిసై మోముల్లో ఒక్కసారిగా చిరు దరహాసాలు విరబూశాయి. రాష్ట్రపతి హైదరాబాద్‌కు వచ్చినప్పుడు, హైకోర్టు చీఫ్‌ జస్టిస్‌, మంత్రుల ప్రమాణ స్వీకారాలు తదితర ప్రత్యేక సందర్భాల్లో తప్ప ఇన్నాళ్లూ ఏ ఒక్క రోజూ మర్యాదపూర్వకంగా భేటీలుకాని ముఖ్యమంత్రి, గవర్నర్‌… హఠాత్తుగా వరసగా రెండు రోజులపాటు గంటలపాటు వేదికలను పంచుకున్నారు. ఇటీవల రాష్ట్ర క్యాబినెట్‌లోకి తీసుకున్న పట్నం మహేందర్‌రెడ్డి ప్రమాణ స్వీకారం సందర్భంగా గురువారం సీఎం కేసీఆర్‌ రాజ్‌భవన్‌కు వెళ్లారు. అక్కడ ఆయనకు ఘన స్వాగతం లభించింది. నిమిషాల వ్యవధిలో పట్నం ప్రమాణ స్వీకారం పూర్తికాగా… ఆ తర్వాత దాదాపు అరగంటపాటు కేసీఆర్‌, తమిళిసై ప్రత్యేకంగా భేటీ అయ్యారు. గవర్నర్‌ ఇచ్చిన తేనీటి విందులో సీఎం పాల్గొన్నారు. ఈ పరిణామాలు బీఆర్‌ఎస్‌ వర్గాలను, ప్రభుత్వ అధికార యంత్రాంగాన్ని సైతం అమితాశ్చర్యంలో ముంచెత్తాయి. మరోవైపు శుక్రవారం హైదరాబాద్‌లోని నూతన సచివాలయంలో ప్రార్థనా మందిరాల ప్రారంభోత్సవ సందర్భంగా తొలిసారి… గవర్నర్‌ సచివాలయంలో అడుగు పెట్టారు. అక్కడ ఆమెకు సీఎం సాదర స్వాగతం పలికారు. ఆమె అక్కడికి వచ్చేదాకా నిరీక్షించి… ఆ తర్వాతే ప్రారంభోత్సవాల క్రతువును చేపట్టారు. సచివాలయంలోని మందిరం, మసీదు, చర్చిని సీఎం దగ్గరుండి మరీ ఆమెకు చూపించారు. ఆ సందర్భంగా సీఎస్‌ శాంతికుమారి, ఇతర ఉన్నతాధికారులతో ఘన సన్మానం చేయించారు. అనంతరం సచివాలయం మొత్తం వారిద్దరూ కలియదిరిగారు. ఆ సందర్భంగా సీఎం సెక్రెటేరియట్‌ నిర్మాణ విశేషాలను ప్రత్యేకంగా తెలపటం విశేషం. గతేడాది రాష్ట్రంలో వరదలు సంభవించినప్పుడు సీఎంకు పోటాపోటీగా గవర్నర్‌ పలు జిల్లాల్లో పర్యటించారు. మారుమూల ప్రాంతాల్లో పర్యటించేందుకు హెలికాఫ్టర్‌ కావాలని అడిగితే ప్రభుత్వం ఇవ్వలేదంటూ ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ క్రమంలో ఆమె రైల్లోనే భద్రాచలం వరకూ వెళ్లివచ్చారు. ఆ తర్వాత ఈ యేడాది కూడా తమిళి సై వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించారు. రాజ్‌భవన్‌లో మహిళా దర్బార్‌ నిర్వహించారు. ప్రజలు తమ సమస్యలను తెలుపుకునేందుకు వీలుగా రాజ్‌భవన్‌ ప్రధాన ద్వారం వద్ద ఫిర్యాదుల పెట్టెను కూడా ఏర్పాటు చేశారు. ఈ నేపథ్యంలో గవర్నర్‌… సమాంతర ప్రభుత్వాన్ని నడుపుతున్నారంటూ ప్రభుత్వం, బీఆర్‌ఎస్‌ విమర్శలు గుప్పించాయి. పలు సందర్భాల్లో సీఎం సహా పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు… తీరు మార్చుకోవాలంటూ గవర్నర్‌కు సూచించారు. ఆ తర్వాత రాష్ట్ర ప్రభుత్వం పంపిన పలు బిల్లుల విషయంలోనూ తమిళిసై తాత్సారం చేశారు. వాటిని ఆమోదించకుండా పక్కనబెట్టారు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసే బిల్లు విషయంలో వివాదం ముదిరి పాకాన పడ్డట్టు కనబడింది. ఆ సందర్భంగా అధికార పార్టీ అనుబంధ కార్మిక సంఘాలు రాజ్‌భవన్‌ ముట్టడి చేపట్టాయి. అనూహ్య పరిణామాల నేపథ్యంలో ఆ బిల్లును అసెంబ్లీలో ప్రతిపాదించేందుకు గవర్నర్‌ ఓకే చెప్పారు. అక్కడి నుంచి సీన్‌ మారిపోయింది. ఆ తర్వాత ప్రగతి భవన్‌కు, రాజ్‌భవన్‌కు దూరం క్రమంగా తగ్గుతూ వచ్చింది. గురు, శుక్రవారాల్లో జరిగిన పరిణామాలతో అసలు దూరమే లేకుండా పోవటం గమనార్హం. రాష్ట్రంలో మారిన రాజకీయ సమీకరణాలు, కేంద్ర పెద్దల ఆదేశాలు, ఢిల్లీ నుంచి వచ్చిన సూచనలు, సలహాల నేపథ్యంలో ఈ దూరం తగ్గుతూ వచ్చి…క్రమక్రమంగా మాయమైపోయిందని విశ్లేషకులు భావిస్తున్నారు. ఇప్పుడు ఇలా దగ్గరైన ప్రగతి భవన్‌.. రాజ్‌భవన్‌ మైత్రి భవిష్యత్తులో కూడా ఇలాగే కొనసాగే అవకాశాలు సుస్పష్టంగా కనబడుతున్నాయని,బీఆర్‌ఎస్‌, బీజేపీ మైత్రికి ఇది నిదర్శమని అభిప్రాయపడుతున్నారు. ఈ పరిణామాల నేపథ్యంలో ఇప్పుడు గవర్నర్‌ వద్ద పెండింగ్‌లో ఉన్న బిల్లులన్నింటికీ ఆమె ఓకే చెప్పనున్నారని సమాచారం.