మాస్‌కి కనెక్ట్‌ అయ్యే కాన్సెప్ట్‌

Anand Devarakondaఆనంద్‌ దేవరకొండ, వైష్ణవి చైతన్య, విరాజ్‌ అశ్విన్‌ నటించిన చిత్రం ‘బేబీ’. మాస్‌ మూవీ మేకర్స్‌ బ్యానర్‌ పై ఎస్‌కేఎన్‌ నిర్మించారు. సాయి రాజేష్‌ దర్శకుడు. ఈ సినిమా ఈనెల 14న రిలీజ్‌ అవుతోంది. ఈ నేపథ్యంలో హీరో ఆనంద్‌ దేవరకొండ మీడియాతో పలు విశేషాలను షేర్‌ చేసుకున్నారు. ‘ఇప్పటి వరకు పక్కింటి అబ్బాయిలా కనిపించే సినిమాలు చేశాను. కానీ మొదటి సారి ఓ వైడ్‌ రేంజ్‌ ఆడియెన్స్‌ను పలకరించే సినిమాతో వస్తున్నాను. ఇందులోని పాత్రను పోషించగలననే నమ్మకాన్ని నాలో దర్శకుడు సాయి రాజేష్‌ నింపాడు. నా కెరీర్‌లో బేబీ ఎప్పటికీ నిలిచిపోతుంది. ప్రేమలో సంతోషం, బాధ అన్నీ ఉంటాయి. ఆ ఎమోషన్స్‌ను బాగా చూపించాం. ట్రైలర్‌లో చూపించిన ఎమోషన్‌ కంటే సినిమాలో మరో యాభై శాతం ఎక్కువే ఉంటుంది. తొలిప్రేమ అనేది ఎప్పటికీ ఓ అందమైన అనుభూతి. దాన్నే ఈ సినిమాలో చక్కగా చూపించాం. ప్రేమ మీద ఎన్నో సినిమాలు వచ్చాయి. కానీ ఈ సినిమాలో ప్రేమను దర్శకుడు సాయిరాజేష్‌ తన కోణంలోంచి చూపించారు. ఆయన రైటింగ్‌ కొత్తగా ఉంటుంది. హీరో, హీరోయిన్లు ప్రేమలోఉన్నా, విడిపోతున్నా ప్రేక్షకులు ఫీల్‌ అవ్వాలంటే దానికి మ్యూజిక్‌ ముఖ్యం. విజరు బుల్గానిన్‌ అద్భుతమైన సంగీతం, ఆర్‌ఆర్‌ అందించారు. ఇందులో వైష్ణవీ చైతన్య అద్భుతంగా నటించింది.
నాకు ఇంత వరకు థియేట్రికల్‌ హిట్‌ లేదు. మా సినిమా బజ్‌ చూసి, ట్రైలర్‌ రియాక్షన్‌ చూసి, పాటలకు వచ్చి చూసిన రెస్పాన్స్‌తో వేసిన ప్రీమియర్స్‌ హౌస్‌ ఫుల్‌ అవుతున్నాయి. ఈ సినిమాకు యూత్‌తో పాటు మాస్‌ జనాలూ కనెక్ట్‌ అవుతారు. నా కెరీర్‌లో ‘బేబీ’ది గ్రేట్‌ జర్నీ. ప్రస్తుతం ‘గం గం గణేశా’ సినిమా షూటింగ్‌ పూర్తి కాబోతోంది.