బడా కార్పొరేట్‌లకు రవాణా రంగాన్ని తాకట్టు పెట్టే కుట్ర

దేశ ప్రధాని నరేంద్ర మోడీ బడా కార్పొరేట్‌ కంపెనీలకు రవాణా రంగాన్ని తాకట్టు పెట్టే కుట్ర చేస్తున్నారని ఆలిండియా– జాతీయ రహదారుల నిర్మాణ లోపాలతో ప్రమాదాలు
– ఫిబ్రవరి 16 దేశవ్యాప్త సమ్మెకు సన్నద్ధమవుతున్న ట్రాన్స్‌పోర్ట్‌ కార్మికులు
– ‘నవతెలంగాణ’తో ఆలిండియా రోడ్‌ ట్రాన్స్‌పోర్ట్‌ వర్కర్స్‌ ఫెడరేషన్‌ (సీఐటీయూ) ప్రధాన కార్యదర్శి ఆర్‌. లక్ష్మయ్య
దేశ ప్రధాని నరేంద్ర మోడీ బడా కార్పొరేట్‌ కంపెనీలకు రవాణా రంగాన్ని తాకట్టు పెట్టే కుట్ర చేస్తున్నారని ఆలిండియా రోడ్‌ ట్రాన్స్‌పోర్ట్‌ వర్కర్స్‌ ఫెడరేషన్‌ (ఏఐఆర్‌టీడబ్ల్యూఎఫ్‌) ఆలిండియా ప్రధాన కార్యదర్శి ఆర్‌. లక్ష్మయ్య విమర్శించారు. శనివారం హన్మకొండలో సీఐటీయూ వర్కింగ్‌ కమిటీ సమావేశంలో పాల్గొన్న ఆర్‌ లక్ష్మయ్య రవాణా రంగంలో 100కు 90 శాతం మంది అసంఘటిత రంగ కార్మికులే ఉన్నారన్నారు. కేంద్రం తీసుకువచ్చిన ఎంవీ యాక్ట్‌లోని ‘భారతీయ న్యాయ సంహిత’ అంశంపై పరస్పర భిన్నమైన వాదనలను ఆయన బహిర్గతం చేయడంతో పాటు ఈ నెల 16వ తేదీన దేశవ్యాప్త సమ్మెకు ట్రాన్స్‌పోర్టు కార్మికులు సన్నద్ధమవుతున్న తీరుపై నవతెలంగాణతో మాట్లాడారు.
నవతెలంగాణ-వరంగల్‌ ప్రాంతీయ ప్రతినిధి
ఇటీవల భారీ రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి. వాటికి కారణాలు ఏమిటీ ?
జాతీయ రహదారుల నిర్మాణంలో అనేక లోపాలు చోటు చేసుకున్నాయి. ఈ లోపాలపై కేంద్ర ప్రభుత్వం దృష్టి సారించడం లేదు. ఈ నిర్మాణ లోపాలను వెంటనే గుర్తించి సరిదిద్దాలి. నియమ, నిబంధనలకు విరుద్దంగా రహదారులను నిర్మించిన గుత్తేదారులపై చర్యలు తీసుకోవాలి. గతంలో ఎంపీ ఎర్రన్నాయుడు రోడ్డు ప్రమాదంలో చనిపోయారు. ఆ ప్రాంతంలో హైవేపై ‘యూ’ టర్న్‌ పెట్టడంతో ఈ ప్రమాదం జరిగింది. అదేవిధంగా ఏపీలోని కృష్ణా జిల్లాలో బస్సు తగులబడి 60 మంది సజీవ దహనమయ్యారు. ఇక్కడ హైవే ఇరుగ్గా ఉండి హైవే గోడ నుంచి ఇనుప చువ్వలు బయటకు ఉండటం, బస్సు డీజిల్‌ ట్యాంకర్‌ ఆ ఇనుప చువ్వలకు గుద్దుకొని బస్సు తగులబడింది. ఈ విషయం నాటి ఐపీఎస్‌ అధికారి కృష్ణప్రసాద్‌ విచారణలో బహిర్గతమైంది. అయినా ఈ రహదారిని నిర్మించిన ఎల్‌ అండ్‌ టీ కంపెనీకి కేంద్ర ప్రభుత్వం కనీసం నోటీసు కూడా ఇవ్వలేదు. భారీ వాహనాల డ్రైవర్లు సుదీర్ఘంగా ట్రక్‌లను విశ్రాంతి లేకుండా నడిపించడం వల్లనే ప్రమాదాలు జరుగుతున్నాయన్న వాస్తవాన్ని ప్రధాని మోడీ ‘గ్లోబల్‌ మొబిలిటీ ఎక్స్‌పో’లో మాట్లాడిన మాటలను ఈ సందర్భంగా గుర్తుచేశారు. కానీ, నేషనల్‌ పర్మిట్‌ వాహనాల్లో గతంలో ఇద్దరు డ్రైవర్లు ఉండాలనే నిబంధన ఉండగా, ఆ నిబంధన తొలగించి ఒకే డ్రైవర్‌ ఉండాలని చట్టం చేసిందే ప్రధాని మోడీ అని తెలిపారు. ఇదంతా రవాణా రంగాన్ని కేంద్ర ప్రభుత్వం నిర్వీర్యం చేసి బడా కార్పొరేట్‌ కంపెనీలకు కట్టపెట్టే ప్రయత్నంలో భాగమేనని అన్నారు.
ఎంవీ యాక్ట్‌లో కేంద్ర ప్రభుత్వం చేసిన సవరణలు ఏమిటి?
ఎంవీ యాక్టు 2019లో కేంద్ర ప్రభుత్వం సవరణలు చేసింది. పదేండ్లు దాటిన వాహనాలను స్క్రాప్‌కు తరలించాలని పేర్కొన్నారు. తాజాగా ఎలక్ట్రిక్‌ వాహనాలను వినియోగించాలని చెబుతున్నారు. ఈ యాక్టును వెనక్కి తీసుకోవాలని డిమాండ్‌ చేస్తున్నాం.
భారతీయ న్యాయ సంహిత 2023లో లోపాలు ఏమిటి?
ఐపీసీకి బదులు కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ‘భారతీయ న్యాయ సంహిత 2023’ సెక్షన్‌ 106 (1), (2) ప్రకారం రోడ్డు ప్రమాదాలు జరిగి ఎవరైనా చనిపోతే ఆ ప్రమాదానికి కారకులైన డ్రైవర్లకు 5 ఏండ్ల జైలు శిక్ష విధించాలని పేర్కొన్నారు. అంతేకాదు, పోలీసు, మెజిస్ట్రేట్‌కు చెప్పకుండా పరారైతే 10 ఏండ్లు జైలు శిక్ష, జరిమానా విధించాలని నిర్దేశిస్తుంది. ఇది అమలు జరిగితే డ్రైవర్లందరూ జైళ్లలోనే ఉంటారు తప్ప వాహనాలను నడపరు. ఎంవీ యాక్ట్‌ సెక్షన్‌ 134 ప్రకారం ప్రమాదం జరిగి ఎవరైన చనిపోయిన సందర్భంలో ప్రజలు కొట్టే పరిస్థితి ఉత్పన్నమైతే డ్రైవర్‌ పరార్‌ కావడం తప్పు కాదని చెబుతుంది.
ఫిబ్రవరి 16న దేశవ్యాప్త సమ్మెలో రవాణా రంగం కార్మికుల పాత్ర ఏమిటి?
రవాణా రంగంలో ప్రయాణీకుల రవాణ, సరుకుల రవాణాను ప్రయివేటు కంపెనీలకు కట్టపెట్టడానికి కేంద్రం ప్రయత్నిస్తున్నది. ఇందులో భాగంగానే 2019లో ఎంవీ యాక్ట్‌లో సవరణలు తెచ్చారు. రవాణా లేకపోతే ఆర్ధిక వ్యవస్థ లేదు. రవాణా రంగంలో 90 శాతం అసంఘటిత రంగ కార్మికులున్నా సామాజిక సంక్షేమ చట్టం అమలు చేయడం లేదు. ఈ చట్టాన్ని అమలు చేయాలని డిమాండ్‌ చేస్తున్నాం. ‘భారతీయ న్యాయ సంహిత 2023’లో సెక్షన్‌ 106 (1), (2)లను రద్దు చేయాలి. ఎంవీ యాక్టు సవరణ చట్టం 2019ని వెనక్కి తీసుకోవాలనే ఈ మూడు డిమాండ్లతో ఫిబ్రవరి 16న దేశవ్యాప్త సమ్మెలో రవాణా రంగంలోని కార్మికులంతా పాల్గొని విజయవంతం చేయనున్నారు. ఈ సమ్మెలో జాతీయస్థాయిలో ఏఐటీయూసీ, సీఐటీయూ, ఐఎన్‌టీయూసీ, హెచ్‌ఎంసీ, ఎల్‌పీఎఫ్‌, ఏఐసీసీటీయూ, టీయూసీఐ తదితర సంఘాలన్నీ పూర్తిస్థాయిలో పాల్గొంటున్నాయి.