లారీ ఢీకొని భవన నిర్మాణ కార్మికుడు మృతి

– మరొకరికి గాయాలు
– కుటుంబానికి అండగా ఉంటాం : సీఐటీయూ రంగారెడ్డి జిల్లా ఉపాధ్యక్షులు రుద్రకుమార్‌
నవతెలంగాణ-రాజేంద్రనగర్‌
బైక్‌పై వెళ్తున్న ఇద్దరు భవన నిర్మాణ కార్మికులను వేగంగా వచ్చిన లారీ ఢీ కొట్టడంతో.. ఒకరు అక్కడికక్కడే మృతి చెందగా, మరొకరు గాయపడ్డారు. ఈ ఘటన రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్‌ పరిధిలోని మైలార్‌దేవ్‌పల్లి పోలీసుస్టేషన్‌ పరిధిలో ఆదివారం ఉదయం జరిగింది. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. నారాయణపేట జిల్లా మండలం ధన్వాడ గ్రామానికి చెందిన కిష్టాపురం రాజు(36) బతుకుతెరువు కోసం రాజేంద్రనగర్‌ ప్రాంతానికి కొంతకాలం క్రితం వలస వచ్చాడు. రాజు స్థానికంగా భవన నిర్మాణ కార్మికునిగా పని చేస్తున్నాడు. అయితే ఆదివారం ఉదయం పని నిమిత్తం రాజు తన స్నేహితుడైన రమేష్‌తో కలిసి బైక్‌పై ఆరాంగర్‌ నుంచి దుర్గానగర్‌ వైపు వెళ్తున్నారు. దుర్గానగర్‌ దగ్గర లారీ అతివేగంగా వచ్చి నిర్లక్ష్యంగా రాజు బైక్‌ను ఢకొీట్టింది. ఈ ఘటనలో బైక్‌పై ఉన్న ఇద్దరూ కింద పడిపోయారు. రాజు తలకు బలమైన గాయాలు కావడంతో అతడు అక్కడికక్కడే మృతి చెందాడు. రమేష్‌కు గాయాలు కావడంతో స్థానికులు అతన్ని సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. స్థానికులు ఇచ్చిన సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. లారీ డ్రైవర్‌ ప్రభాకర్‌రెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. కాగా, మృతిచెందిన భవన నిర్మాణ కార్మికుడు రాజు.. కుటుంబానికి ప్రభుత్వం నష్టపరిహారం ఇచ్చేంతవరకు వారికి అండగా ఉంటామని సీఐటీయూ రంగారెడ్డి జిల్లా ఉపాధ్యక్షులు రుద్రకుమార్‌ తెలిపారు. విషయం తెలుసుకున్న వెంటనే ఘటనాస్థలికి వెళ్లి పరిశీలించారు. అనంతరం మృతుని భార్య భారతమ్మను పరామర్శించారు. కార్మికుని కుటుంబానికి నష్టపరిహారం ఇప్పించేంత వరకూ సీఐటీయూ పోరాటం చేస్తుందని భరోసా ఇచ్చారు. బాధిత కుటుంబాన్ని పరామర్శించిన వారిలో భవన నిర్మాణ రంగం నాయకులు స్వామి, వెంకటేష్‌, చాంద్‌ పాషా, రాజు ఉన్నారు.