కళలకు కాణాచిగా తెలుగు సంస్కృతి సాంప్రదాయాలకు పట్టుకొమ్మగా గతమెంతో ఘనమైన చరిత గల పోరుగల్లు ఓరుగల్లుగా చరిత్రలో నిలిచిన వరంగల్లు సాహితీ కషిని అక్షర బద్ధం చేసిన వారెందరో ఉన్నారు. అందులో ముందు వరుసలో నిలిచేవారు శ్రీలేఖ శ్రీరంగ స్వామి.
తెలుగు సాహిత్యం మీద ఎనలేని మక్కువతో తన ఉద్యోగ వృత్తికి భిన్నంగా కృషి మొదలుపెట్టి ‘స్నేహం నీడనిచ్చే చెట్టువంటిది’ అని మనసారా నమ్మి రచయితగా ఓనమాలు నేర్చుకొని పరిశోధకునిగా ఎదిగిన అక్షర శ్రీమంతుడు డా: తిరుకోవలూరు శ్రీరంగస్వామి. నాలుగు దశాబ్దాల క్రితం శ్రీలేఖ సాహితీ అనే సాహిత్య సంస్థను ఏర్పాటు చేసి తెలుగు ప్రాంతాలలోని వర్ధమాన కవులు, కధకులు, వ్యాస రచయితలను, ప్రోత్సహించి ప్రముఖ సాహితీవేత్తలుగా తీర్చి దిద్దిన నిస్వార్థ సాహితీ సంస్థకు బాధ్యుడయ్యారు. సాహిత్య ప్రక్రియలతో పాటు వరంగల్ సాహిత్య చరిత్ర నిక్షిప్తం చేయడమే ప్రధాన లక్ష్యంగా ఏడు పుస్తకాలు శ్రీరంగ స్వామి వెలువరించారు, అదే దారిలో వెలువరించిందే ‘మన కాంతిపుంజలు’.
కీర్తిశేషులైనా స్ఫూర్తి దాతలు రచనలు కళాకారులు సమరయోధులు అయిన సుమారు 57 మంది సంక్షిప్త పరిచయ పత్రాలతో నిక్షిప్తమైన ఈ పుస్తకం సమగ్రం కాకపోయినా ఈ మార్గంలో పయనించబోయే భావితరం వారికి, సాహితీ పరిశోధకులకు, మాత్రం ఇదో సాహితీ వెలుగుల దారి దీపంగా నిలుస్తుంది.
ఈ స్ఫూర్తి మూర్తుల సంకలన కర్త టి. శ్రీరంగస్వామి తన అనుభవ పరిజ్ఞానంతో, తెలుసుకున్న సమాచారంతో అందుబాటులో గల వివరాలతో ఈ జీవన రేఖలు రాశారు. నేటి తరం వారికి తెలియని మరుగున పడ్డ తెలంగాణ స్ఫూర్తి దాతలు ఎందరినో మనం ఇందులో చదువుకోవచ్చు.
స్త్రీ విద్య సృజన అంతంత మాత్రంగా ఉన్న నాటి కాలంలోనే. గీసుకొండ దగ్గరి ఎలుకుర్తి హవేలి కి చెందిన ‘మంతెన ఆండాళమ్మ’ తన 13వ ఏట పద్య రచన చేసి యువతీ శతకం, భారత శతకం, వంటి రచనలు చేసి పలు సన్మానాలు పొందడంతో పాటు ‘అభినవ మొల్ల’ బిరుదు పొందిన సమాచారం ఇందులో నిక్షిప్తం చేశారు. అదే కుటుంబానికి చెందిన ఆండాళమ్మ సోదరి ఆమెకు ప్రేరణ అయిన కవయిత్రి ‘మంతెన రంగనాయకమ్మ’ వివరాలు కూడా ఇందులో నిక్షిప్తం కావలసి ఉంది.
వరంగల్ పత్రికా రంగంలో పేపర్ బారుగా చేరి విలేకరి స్థాయి నుంచి సంపాదకులుగా ఎదిగి జనధర్మ అయ్యగారుగా కర్మయోగిగా నిత్య అధ్యయనశీలిగా నిరుపేద జీవితం గడిపిన ఎమ్మెస్ ఆచార్యగా పిలవబడే మాడభూషి శ్రీనివాసాచార్యులు గారి పత్రికా కృషి పోరాట తత్వం నీతి నిజాయితీలు నేటితరం పత్రిక రచయితలు అందరికీ ఆదర్శనీయంగా ఇందులో చెప్పబడ్డాయి,
అవధాన విద్యలో ఆనాటి ఓరుగల్లులో తొలి స్థానం సంపాదించి సంస్కృత విద్యా బోధన చేస్తూ అనేకచోట్ల అవధానాలు చేసి పలు పద్య రచనలు చేసి ‘అపర పెద్దన’గా కీర్తించబడ్డ నాటి అవధాన శిరోమణి ‘చిలుకమర్రి రామానుజాచార్యులు’ చేసిన అవధాన కృషిని ఇందులో తెలుసుకోవచ్చు.
హసన్పర్తికి చెందిన ‘కేశపోగు గుల్బానమ్మ’ ను వరంగల్లు పత్రికా రంగ తొలి మహిళా సంపాదకురాలుగా ఇందులో పేర్కొన్నారు.
బందరులో పుట్టి వరంగల్లు లో స్థిరపడి క్రీడారంగంలో విశేష కీర్తి సొంతం చేసుకున్న అర్జున అవార్డు గ్రహీత జమ్మలమడక పిచ్చయ్య క్రీడా కృషి గురించి ఇందులో తెలుసుకోవచ్చు. ఇలా మరుగునపడిన మన ఓరుగల్లు స్ఫూర్తి దాతల వివరాలు విశేషాలు ఒకచోట గుది గుచ్చిన చక్కని పరిశోధక పుస్తకం ‘మన కాంతిపుంజలు’ రచయిత పరిశోధన, పరిశీలన కృషికి అక్షరాభివందనాలు.
డా||అమ్మిన శ్రీనివాసరాజు, 77298 83223