కులం పేర అణిచివేత
మతం పేర అణిచివేత
కులంలో మతంలో మొత్తం జనంలో
మహిళపై మహ మహా అణిచివేత
తరతరాల అణిచివేతల
అహంకారపు ఆధిపత్యం
ఎవడిదంట? ఎందుకంట?
కష్టంచేసే కులాల
దిగువ దొంతర్లలో దించిందెవడు?
సంపద కులాల
‘సొంతఆస్తి’ కొండలపై నిలిపిందెవడు?
ఈ కిరాతకాల పాలన మోసిందెవడు?
సంపద ఎత్తే ఆధిపత్య నిచ్చెన మెట్లెక్కిన
అహంకారమే అణిచేత దురహంకారం కాదా?
మదమెక్కిన పొగరుబోతుల కండకావరం
వివక్షలతో అణగదొక్కిన
దౌర్జన్యం కాదా?
దేహమంటే కులం కాదు
దేహమంటే మతం కాదు
గింజకోసం గంజికోసం
చెమటచిందే ప్రాణయంత్రం
పెంచినోడికి దక్కకుండా
హక్కు చెక్కు పొందినోడు
సర్వ సంపద లెత్తడంపై
ఎగిసి లెగిసిన ప్రశ్నలన్నీ
విరగబడీ తిరగబడితే
కొత్త దారి నడక మొదలే కదా
తొక్కివేతకు లెక్కలేసిన
అహంకారం కలిసి రాసిన
కుల మత విభజనల గూడు
గడుల సోపాన పటం అది
ఏ గడిపై తిరగబడి ఏ నిచ్చెన ఎక్కినా
కడకు దోచే గడిలో కాచిన
పాము నోటబడటం ఖాయం
అందుకే ఇప్పుడు ….
ఎవడిపై అణిచివేత వాడిదే కాకూడదు
అణిచివేత పెత్తనం కర్ర ఎవడిపై పడినా
అందరూ ఏకమై నడుము విరవాలి
ఎక్కడది లేచే ఊపు ఊగినా
అక్కడే తొక్కేయాలి
ఎదురైన దుస్థితిపై ఘర్జిస్తూ
దేశంలో దేహాలొకటై కదలాలి
అణిచివేతల ఆధిపత్యంపై
ఎదురేగి కదం తొక్కాలి
ఇరవైమంది అణిచివేతలకు
ఎనభైమంది సమాధానమైతే
దాని కోరల్లో అసలు విషం
సంపదలో ఈదే నిజం
బట్టబయలై బద్దలౌను
అక్కడే దాని నడుము విరిస్తే
కష్టజీవి అంటే భయపడుతుంది
మనిషంటే మనిషేననీ
దేహమంటే దేహమేననీ
దేహమున్నదే జీవమనీ
దేహాల సమూహమే దేశమనీ
తలవంచి నమస్కరించే
సంస్కారం మెరుస్తుంది
– ఉన్నం వెంకటేశ్వర్లు
సెల్:8790068814