– రాష్ట్రంలో క్లబ్బులు, పబ్బులు, రిసార్ట్‌లు, సినీపరిశ్రమ పైనా 24 గంటలు నిఘా
– స్కూళ్లు, కాలేజీల పైనా నార్కొటిక్ బ్యూరో డేగకన్ను
– కార్యాచరణను ప్రకటించిన
నార్కొటిక్ బ్యూరో డైరెక్టర్ సందీప్ శాండిల్య
నవతెలంగాణ-ప్రత్యేక ప్రతినిధి: రాష్ట్రంలో మాదక పదార్థాల అక్రమ రవాణా, వినియోగంపై ఉక్కుపాదం మోపుతున్నట్టు రాష్ట్ర నార్కొటిక్ బ్యూరో డైరెక్టర్ సందీప్ శాండిల్య స్పష్టం చేశారు. డ్రగ్స్‌ను కఠినంగా అణచివేయటానికి పకడ్బందీ వ్యూహంతో కార్యాచరణను రూపొందించి అమలు చేస్తున్నామని ఆయన తెలిపారు. ముఖ్యంగా, డ్రగ్స్‌కు ఆలవాలంగా మారిన క్లబ్బులు, పబ్బులు, రిసార్ట్‌లు, రేవ్‌పార్టీలపై 24 గంటల పాటు నిఘా వేసి ఉంచుతామని ఆయన చెప్పారు. అలాగే, సినీ పరిశ్రమలో సైతం ఈ డ్రగ్స్ మహమ్మారి ప్రవేశించటం ఆందోళనకర పరిణామమనీ, ఈ పరిశ్రమ పైన కూడా తాము నిశితంగా దృష్టిని సారించామని ఆయన స్పష్టం చేశారు. ప్రధానంగా కొన్ని పాఠశాలలు, కాలేజీలలో డ్రగ్స్ వినియోగం సాగుతున్నట్టు గతంలో అనేకసార్లు వెలుగులోకి వచ్చిందనీ, దీంతో వీటి పైనా తమ అధికారులు డేగ కన్ను వేసి ఉంచుతారని ఆయన తెలిపారు. అయితే, తామేగాక కాలేజీలు, స్కూళ్లలో ఆయా విద్యాసంస్థల టీచర్లు, మేనేజ్‌మెంట్లు, విద్యార్థుల తల్లిదండ్రులతో యాంటీ డ్రగ్ కమిటీలను కూడా వేసి పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తామని చెప్పారు. అదే సమయంలో తమ విభాగానికి అవసరమైన నిధులు, సిబ్బంది అధికారుల కోసం రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిని కలిసి విజ్ఞప్తి చేశామనీ, అందుకు పూర్తి సహకారాన్ని అందిస్తామని ఆయన హామీ ఇచ్చారని సందీప్ శాండిల్య వివరించారు. ఇందుకోసం కార్యాచరణను రూపొందించి ప్రభుత్వానికి సమర్పిస్తామని ఆయన తెలిపారు.గత ప్రభుత్వం డ్రగ్స్‌ను నియంత్రించటానికి నార్కొటిక్ బ్యూరోను తూతూ మంత్రంగా ఏర్పాటు చేసి, దానికి తగిన నిధులు, సిబ్బందిని కేటాయించలేదని శనివారం శాసనసభలో ముఖ్యమంత్రి ఆరోపించిన విషయం విదితమే. అదే సమయంలో, ఈ విభాగానికి అవసరమైన 302 మంది అధికారులు, సిబ్బందితో పాటు రూ.50 కోట్ల వరకు నిధులను కేటాయించి రాష్ట్రంలో విద్యార్థులు, యువత భవిష్యత్తుతో ఆడుకుంటున్న డ్రగ్ మహమ్మారిని కూకటివేళ్లతో పెకిలించి వేస్తామని సీఎం ప్రకటించారు.